Rain Alert: ఆంధ్రా, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. ఈ జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో సౌత్ కొంకణ్ దగ్గర తీరాన్ని దాటనుంది. మరో మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దాంతో.. నైరుతి రుతుపవనాల విస్తరణకు మరింత అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా..

నైరుతి రుతుపవనాలు లక్షదీప్, కేరళ రాష్ట్రంలో పూర్తిగా.. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవా రాష్ట్రంలో పూర్తిగానూ, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కొంకణ్ తీరంలో రత్నగిరి, దాపోలి మధ్యలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ఈ నెల 27న పశ్చిమ మధ్య, సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతో రాగల రెండు రోజులలో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందంది. ఆదివారం తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
మరోవైపు ఆరేబియా సముద్రంలోని వాయుగుండం, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోనూ రానున్న మూడు రోజులు అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆదివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూ లు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, సోమవారం అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.