TS DEE CET 2025 Exam: ఒక్కసారిగా డీఈఎల్‌ఈడీ కోర్సుకు పెరిగిన డిమాండ్.. నేడే ప్రవేశ పరీక్ష! నిమిషం ఆలస్యమైనా నో ఎట్రీ
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డీఈఈసెట్ 2025 పరీక్ష ఆదివారం (మే 25) జరగనుంది. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఇప్పటికే అధికారులు..

హైదరాబాద్, మే 25: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డీఈఈసెట్ 2025 పరీక్ష ఆదివారం (మే 25) జరగనుంది. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఇప్పటికే అధికారులు ఈ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నేడు రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5వరకు రెండో సెషన్‌లో నిర్వహిస్తారు. ఉదయం 9:45 గంటలు, మధ్యాహ్నం 2:45 గంటలలోపు ఆయా పరీక్ష కేంద్రాలకు అభ్యర్ధులు చేరుకోవాలి. ఆ తర్వాత గేట్లు మూసేస్తామని అధికారులు సూచించారు.
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా డీఈఈసెట్‌కు దాదాపు 43,616 మంది దరఖాస్తు చేశారు. డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు డీఈఎల్‌ఈడీ కోర్సు పూర్తిచేసిన వారే అర్హులు కావడంతో ఈసారి భారీ దరఖాస్తులు వచ్చాయి. గతేడాది మొత్తం 3,600 సీట్లు ఉంటే.. వాటిల్లో 50 శాతం సీట్లు కూడా నిండలేదు. డిమాండ్ లేక కాలేజీలు క్రమంగా మూతబడుతున్నాయి. కానీ ఈ ఏడాది అనూహ్యంగా భారీ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గణితం పేపర్ 2బీ, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ఫెయిలైన వారితోపాటు, ఇంప్రూవ్‌మెంట్ రాసే వారు కూడా ఈ పరీక్షలు రాస్తున్నారు. డీఈఈసెట్ పరీక్షకు ఇంటర్ అర్హత కలిగిన వారు అర్హులు. దీంతో ఈ రెండు పరీక్షలు ఒకే రోజు జరగనుండటంతో సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్ధులు డీఈఈసెట్ పరీక్షను వదులుకోవల్సి ఉంటుంది. ప్రభుత్వం స్పందించి ఏదైనా ఒక పరీక్షను వాయిదా వేయాలని విద్యార్ధులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
జిప్‌మ్యాట్ 2025 తుది కీ విడుదల.. స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ ఇలా
జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్ 2025) తుది కీ విడుదలైంది. ఫైనల్ కీతో పాటు అభ్యర్థుల స్కోర్ కార్డును అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పరీక్ష ఏప్రిల్ 26న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2025- 26 విద్యా సంవత్సరానికి ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్ములో ఉమ్మడిగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)లో ప్రవేశాలు కల్పిస్తారు.
జిప్‌మ్యాట్ 2025 తుది కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.