Phone Call Leaks: పొలిటికల్ ఫోన్లు చాలా డేంజర్ గురూ! ఫోన్ వాయిస్‌లతో పబ్లిగ్గా బుక్కవుతున్న నేతలు..

|

Mar 07, 2023 | 9:25 AM

నా ఫోనే పోయింది.. వెతికిపెట్టండి అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఒక ఎంపీ కంప్లయింట్.. ఒక మాజీ ఎంపీ అయితే.. పదో పదిహేనో ఫోన్లు పగలకొట్టుకున్నట్టు ఎలిగేషన్. ఇలా ఫోన్ అనే మాటంటేనే కిందినుంచి..

Phone Call Leaks: పొలిటికల్ ఫోన్లు చాలా డేంజర్ గురూ! ఫోన్ వాయిస్‌లతో పబ్లిగ్గా బుక్కవుతున్న నేతలు..
Phone Call Record
Follow us on

నా ఫోనే పోయింది.. వెతికిపెట్టండి అంటూ పోలీస్‌స్టేషన్‌లో ఒక ఎంపీ కంప్లయింట్.. ఒక మాజీ ఎంపీ అయితే.. పదో పదిహేనో ఫోన్లు పగలకొట్టుకున్నట్టు ఎలిగేషన్. ఇలా ఫోన్ అనే మాటంటేనే కిందినుంచి పైదాకా మంటెక్కిపోతోంది కొందరు ఖద్దరు నేతలకు. మరికొందరు పొలిటీషియన్లయితే ఆ ఫోన్లతోనే చెలగాటం ఆడేస్తున్నారు. ఫోనే కదా.. చేస్తే పోలా.. అంటూ అలా రింగిచ్చి.. ఇలా బుక్కయిపోతున్నారు. టోటల్‌గా ఒక్క ఫోన్‌ కాల్‌తో.. తెలుగు పాలిటీషియన్ల తుప్పు వదిలిపోతోందిక్కడ.

కంట్రోల్ తప్పి మాట్లాడితే.. మఠాషే..!

రాజకీయాల్లో ఇదోరకం రింగరింగా. తన ఇమేజ్‌ని పెంచుకోడానికో.. అవతలివాడి ఇమేజ్‌ని డ్యామేజ్ చెయ్యడానికో ఫోన్‌ కాల్‌ అనే ఐడియాని ఇష్టారాజ్యంగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు వర్తమాన పొలిటీషియన్లు. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. ఒకే పార్టీలో నేతలు.. ఒకరి మీద మరొకరు బురద జల్లుకోడానికి ఈ ఫోన్లనే యధేచ్ఛగా వాడేస్తున్నారు. పిచ్చి పీక్స్‌ రేంజ్‌లో వైరల్ అవుతున్న కొన్ని పొలిటికల్ ఫోన్లను ప్రస్తావించుకోవాల్సిందే.

నల్గొండ కింగ్‌ నేనే అనేంత సౌండొస్తుంది పెద కోమటిరెడ్డి దగ్గర. తన బ్రాండ్‌ బీటలు బారుతోందన్న బెంగ పట్టుకుందో ఏమో రిసెంట్‌గా ఆయన సైడ్‌ ఎఫెక్ట్స్ బాగా పెంచేశారు. పార్టీలో ఎలాగూ కార్నరైపోయాం.. లోకల్‌లోనైనా లైన్ క్లియర్ చేసుకుందాం.. అంటూ ఆ దిశగా బిజీ అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆ బిజీబిజీలోనే ట్రింగ్‌ట్రింగ్‌మంటూ ఓ ఫోన్‌ కాల్.. ఆ తర్వాతే దాంతో రేగింది దుమ్ము దుమారం.

ఇవి కూడా చదవండి

చెరుకు సుధాకర్‌ అంటే సొంత జిల్లాలో కోమటిరెడ్లకు కొరకరాని కొయ్య. ఆయన్ను, ఆయన కొడుకు సుహాస్‌నీ చంపుతా అనేది ఈ ఫోన్ కాల్ సారాంశం. ఆ వాయిస్ కాస్తా వైరల్‌గా మారి.. అటుతిరిగీ ఇటుతిరిగీ బూమరాంగై.. ఎంపీగారి చెవుల్లోనే రీసౌండివ్వడం మొదలైంది. భావోద్వేగంలో నోరు జారిన మాట వాస్తవమే.. చెరుకు సుధాకర్ నన్ను రోజూ తిడతారు. నేను ఒక్కరోజు తిట్టకూడదా.. దాన్ని బట్టుకుని నీచమైన టైటిళ్లతో గబ్బు లేపుతారా.. ఇదెక్కడి న్యాయం అంటూ ఇప్పుడు నాలిక్కర్చుకుంటారు నల్గొండ పెద్దారెడ్డి.

నేను శత్రువును కూడా ప్రేమించేరకం.. లేస్తే నా అంత శాంతికాముకుడు మరొకడు లేడు.. అనేది సగటు పొలిటీషియన్ పైకి చెప్పుకునే మాట. కానీ.. లోపల్లోపలుండే అసలు రంగు మాత్రం పెరుమాళ్లకే ఎరుక. ఆ అసలు రంగే అప్పుడప్పుడూ రింగరింగా రూట్లో.. ఇలా రాంగ్‌సైడ్‌లో బైటికొస్తుందోన్నమాట. అటు.. పాలమూరు జిల్లాలో కూడా పొలిటికల్ ఫోన్లు ఓ రేంజ్‌లో రింగవుతున్నాయి.

నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, అచ్చంపేట ఎంఎల్ఎ గువ్వల బాలరాజు.. వీళ్లిద్దరి మధ్య ఆల్రెడీ పచ్చగడ్డి వెయ్యకపోయినా భగ్గుమంటుంది. ఇప్పుడు వారసుడిని వెంటేసుకుని ఎంపీ రాములు యాక్షన్‌ పార్ట్ మొదలుపెడితే.. ఎమ్మెల్యే గువ్వల ఓవరాక్షన్ పార్ట్ మొదలుపెట్టకుండా ఉంటారా? సరిగ్గా అదే జరిగింది.

నీ కొడుకు ఫోటోలతో నా ఏరియాలోనే ఫ్లెక్సీలు కడతారా.. ఎంత దమ్ముంటే నా ఇలాఖాలోకి వస్తారు.. హైకమాండైనా ఏ కమాండైనా నా తర్వాతే.. అంటూ గువ్వల రెచ్చిపోయినప్పటి ఆడియో.. ఆన్‌లైన్‌లో అదరగొడుతోంది. తన కొడుక్కి జెడ్‌పీ ఛెర్మన్ కుర్చీ దక్కకుండా చేశారన్న కోపంతో ఎంపీ గువ్వల అడ్డా అచ్చంపేట మీదే కన్నశారట. దాని ఫలితమే ఈ వార్నింగులు. రెచ్చిపోయి ఎంపీకే ధమ్‌కీ ఇచ్చిన ఎమ్మెల్యే ఫోన్‌కాల్‌.. ఇప్పుడు తెలంగాణా భవన్‌ దాకా పంచాయితీ పెట్టేసింది.

బీఆర్‌ఎస్‌లోనే మరో ఫోనో లొల్లి. తనపై వచ్చిన కబ్జా ఆరోపణల్ని తుడిచేసుకోడానికి ఫోన్‌ కాల్‌నే వాడుకున్నారు ఎమ్మెల్యే రేఖానాయక్. బీజేపీ నాయకుల్ని, ఎమ్మార్వోని నిలబెట్టి వాళ్ల ఎదురుగానే సొంత పార్టీ లీడర్‌కి ఫోన్ చేసి తన సచ్ఛీలతను ప్రూవ్ చేసుకోబోయారు. కాకపోతే.. అది కాస్త వైరల్ అయ్యేసరికి రేఖమ్మా నీ ఓవరాక్షన్ భలే ఉందమ్మా అంటూ ట్రోలింగ్ మొదలైంది.

ఏపీలోనూ సేమ్ సీన్స్..

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మంత్రి జోగిరమేష్.. మధ్యలో మైలవరం.. ఈ రచ్చకు కామాలే తప్ప ఫుల్‌స్టాపుల్లేవు. అధినేత పిలిచి మొట్టికాయలేసినా తుడిచేసుకుని మళ్లీ తొడ గొట్టుకుంటారు. ఈ కొట్లాటను క్లైమాక్స్‌కి తీసుకెళ్లడానికా అన్నట్టు వీళ్లిద్దరి గ్రూపుల మధ్య కొత్తగా ఆ తిట్ల పురాణం.. వయా ఫోన్‌ కాల్!

‘నా బాట జగన్ బాట.. ఎవరడ్డొచ్చినా తీస్తా తాట.. మీ వాళ్లతో తిట్టిస్తే తిట్టిచ్చుకోడానికి, గిల్లితే గిల్లిచ్చుకోడానికి నేను గల్లీ లీడర్ని కాదు’ అని రెచ్చిపోయారు ఎమ్మెల్యే వసంత.

గల్లీ లీడర్లో ఢిల్లీ లీడర్లో ఎవరైతేనేం.. రెచ్చిపోయి నోటికొచ్చినంతా మాట్లాడ్డం.. అది కాస్తా రికార్డయ్యి వైరలయ్యాక.. నాలిక్కర్చుకోవడం కామనైపోయింది. అది నేను కాదు.. ఆ వాయిస్ నాది కాదు.. అని తప్పించుకోవడం రొటీనైపోయింది కనుక లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోతున్నారు. మనలాగే ఫోన్లు కూడా అప్‌డేటయ్యాయ్.. ఏ మీటా నొక్కకుండానే ఆటోమేటిగ్గా రికార్డయిపోతాయ్ అనే కనీస జ్ఞానం మనోళ్లకు లేకుండా పోతోంది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక బీప్‌సౌండ్లు కూడా సిగ్గుపడే భాషలో బూతులందుకుని.. ఆనక అధిష్టానాలకు తలనొప్పిగా మారడం.. ఇదీ వరస.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..