లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. టీబీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలుస్తామని, ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి కొలువుతీరుతుందని కమలనాథులంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవడంతో పాటు ఓట్ షేర్ కూడా గణనీయంగా పెరగడంతో పార్టీ వర్గాల్లో జోష్ నెలకొంది. ఇదే దూకుడును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని యోచిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి పదికి పైగా స్థానాలపై గురిపెట్టింది. ఇందులో భాగంగా ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అభ్యర్థుల ఎంపికతో పాటు క్యాడర్‌కు మార్గ నిర్దేశం చేసేందుకు స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు.
ఈ నెల 28న అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో పార్టీ మండల స్థాయి అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలతో సమావేశమవుతారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం
ప్రారంభోత్సవం, రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత తెలంగాణలో బీజేపీకి మరింత సానుకూలత ఏర్పడుతోందని కమలనాథులు అంచనావేస్తున్నారు. రామమందిర నిర్మాణం వాజ్‌పేయి కల అని… దాన్ని మోదీ సాకారం చేశారని చెప్పారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి సానుకూల పవనాలున్నాయని, లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవడం ఖాయమంటున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. తెలంగాణలో బీఆర్‌ఎస్ కథ ముగిసిందన్నారాయన. తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా ఈ నెల 28న కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అనంతరం బీజేఎల్పీ నేతపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి