Telangana: రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే..?
సాగు చేసే వాడికే సాయం అందాలి. అసలైన రైతుకే ఆర్థిక భరోసా కల్పించాలంటోంది కాంగ్రెస్ సర్కార్. సంక్రాంతి కానుకగా రైతులకు రొక్కం అందిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించింది. రైతుభరోసా పథకానికి సంబంధించిన విధివిధానాల ఖరారుతో పాటు నిధుల సమీకరణపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.
రైతులకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాళ్లు, రప్పలు ఉన్న భూములకు కూడా రైతుభరోసా ఇచ్చిందని, సీఎం రేవంత్ సర్కార్ అసలైన రైతులకు సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని తుమ్మల వెల్లడించారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా అర్హులకే అందేలా చూస్తామన్నారు. సోమవారం(డిసెంబర్ 23) రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల.. ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ రైతులకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంపై తీవ్రస్థాయి మండిపడ్డారు.
సంక్రాంతి కానుకగా రైతులకు రొక్కం అందిస్తామని అసెంబ్లీ వేదికగా రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రైతుభరోసా పథకానికి సంబంధించిన విధివిధానాల ఖరారుతో పాటు నిధుల సమీకరణపై దృష్టి సారించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ పథకం రూపకల్పనపై కసరత్తు జరుగుతోందన్నారు. ఏ విధంగా అమలుచేయాలి.. అర్హులను ఎలా ఎంపిక చేయాలనే దానిపై అన్ని పార్టీల సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. రైతు బంధు మాదిరిగా నిధులు దుర్వినియోగం కాకుండా కీలక మార్పులు చేసి, సాగు చేసే భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. అయితే ప్రతిపక్షాలు రైతులను మాయమాటలు, అసత్య ప్రచారాలతో ఆందోళనకు గురి చేయవద్దన్నారు. అయితే, రైతు భరోసాకు పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేస్తామన్న వార్తల్లో నిజం లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో 2019-20లో రెండు పంటలకు రైతు బంధు డబ్బులు చెల్లించలేదని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. 2023 యాసంగిలో రూ.7,600 కోట్లు ఎగ్గొట్టిందని ధ్వజమెత్తారు. రైతుబంధు పేరుతో వ్యవసాయ యాంత్రీకరణ, పంటల బీమా, సూక్ష్మసేద్యం వంటి అన్ని పథకాలను అటకెక్కించిందన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పథకాల వాటా రూ.3,005 కోట్లు రాకుండా చేసిందని ఆరోపించారు. 2018లో ఏకంగా 20 లక్షల మందికి రుణమాఫీ చేయలేదని విమర్శించారు. పంటలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఊసే ఎత్తని సర్కార్, కనీసం రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు. పరిహారం కోసం అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి ప్రత్యక్షంగా 35% నిధులు ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే పంటలకు రెండుసార్లు నష్ట పరిహారం చెల్లించామని తెలిపారు. ఏడాది కాలంలో రూ.695 కోట్లు వెచ్చించి ప్రతి పంటకు మద్దతు ధర కల్పించిందని గుర్తు చేశారు. సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించి, రైతులకు ప్రతి ఎకరాకు అదనంగా రూ.8-12 వేలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకుని రైతులను ఆదుకునేందుకు సరియైన సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..