Telangana News: దసలి ‘పట్టు’ అంటే ఏంటి? దానికి ఎందుకంత క్రేజ్ ?
శతాబ్దాల చరిత్ర కలిగిన పట్టు.. దేవాది దేవతలకు మాత్రమే పరిమితమైన పట్టు.. ఆనాడు నిజాంను మంత్రముగ్దున్ని చేసి నేడు మగువల మనసులనూ కనికట్టు చేస్తోంది. ప్రాణహిత గోదావరి తీరం వెంట పుట్టిన ఈ పట్టు.. నేడు ఫ్యాషన్ ప్రపంచాన్నీ ఓ పట్టు పడుతోంది.
ఆదివాసీ ఖిల్లాలో అరుదైన పరిశ్రమగా.. శ్రమే ఆయుదంగా సాగిస్తున్న ఈ పంట గిరిజన రైతుల పాలిట కల్పతరువుగా మారుతోంది. ఇంకాస్త ప్రభుత్వాల ప్రోత్సాహం అదనమైతే ఈ పట్టు తెలంగాణ వస్త్రరాజంగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం. ఇంతకీ ఏంటా పట్టు కథ అంటారా.. అయితే ఎందుకు ఆలస్యం గోదారి గట్టున ప్రాణహిత ఒడ్డున అడవుల్లో సాగవుతున్న అరుదైన పట్టు చరిత్రను తెలుసుకుందాం పదండి.
దసలిపట్టు ముదురు గోధుమ బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. దీంతో వందల ఏండ్ల నుంచీ సామాన్యులెవరూ ఆ పట్టును ధరించే సాహసం చేయలేదు. దేవుళ్ళకే సమర్పించేవారు. ఈ దేవతా వస్త్రాలను నేసేవారిని దేవాంగులు అంటారు. కాళేశ్వరంలో ఏటా శివరాత్రికి నిర్వహించే కళ్యాణానికి దసలిపట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఆ తర్వాత కాలంలో గోదావరి తీర ప్రాంతంలోని కలపకు గిరాకీ పెరిగింది. దీంతో కలప వర్తకులు ఓసారి, నిజాం నవాబుకు దసలి పట్టుతో నేసిన వస్త్రాలను కానుకగా సమర్పించారు. ఇవి నిజాంకు చాలా నచ్చాయి. దీంతో ఇక్కడి నుంచే ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను తీసుకెళ్లేవారు. ఆ రోజుల్లో నిజాం స్థానిక నేత కార్మికులకు సైకిల్‌ను బహుమతిగా ఇచ్చాడు. అప్పటి వరకూ పరమాత్మకు, ప్రభువులకు మాత్రమే పరిమితమైన దసలి పట్టు (టస్సర్ పట్టు) ఓ దశాబ్దం నుంచి కొత్త హంగులు అద్దుకొంటుంది. సామాన్యులను మురిపిస్తున్నది. ప్రకృతి సిద్ధంగా లభించే పట్టు.. అదే దసలి పట్టు. ఆదివాసీ గిరిజనులు అరుదుగా సాగు చేస్తున్న సిరుల పట్టు ఇది. ప్రాణహిత గోదావరి తీర ప్రాంతం ఈ పట్టు పరిశ్రమ సాగుకు పట్టుకొమ్మగా నిలుస్తోంది.
మంచిర్యాల, కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలోని అడవుల్లో ఏరుమద్ది నల్లమద్ది చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి దసలి పట్టుపురుగుల పెంపకానికి కేరాఫ్ అడ్రస్.. గత 30 ఏళ్లుగా ఈ జిల్లాల్లో సుమారు 1000 మంది రైతులు 7500 ఎకరాల్లో దసలి పంటను పండిస్తున్నారు. కొమురంభీం జిల్లాలోని గొల్లతరివి, కౌటాల, బెజ్జురు.. మంచిర్యాల జిల్లాలోని నెన్నల మండలంలోని మన్నెగూడెం, కోటపల్లి మండలంలోని కొత్తపల్లి, రాజారం, పారుపల్లి, లింగన్నపేట, నాగంపేట, ఎదుల్లబంధం, వేమనపల్లి మండలంలోని ముల్కలపేట.. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, లింగంపల్లి గ్రామాలో దసలి పట్టు కాయ పండిస్తూ రైతులు ఉపాధి పొందుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో అయితే 1985 లోనే దసలి పట్టు పరిశ్రమను స్థాపించారు. ఇక్కడ 100 ఎకరాల్లో ‘టస్సర్ ఫామ్’ను ఏర్పాటు చేసిన పట్టు పరిశ్రమ శాఖ భూమిలేని రైతులను గుర్తించి దసలి పట్టు కాయలను పండించే విధానంపై శిక్షణ ఇచ్చింది. మంచిర్యాల జిల్లాలో దాదాపు 400 మంది రైతులు దసలి పట్టుకాయలను పండిస్తూ ఉపాధి పొందుతున్నారు.
దసలిపట్టు కాయ పంట సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. రైతుల శ్రమే పెట్టుబడి.. రైతులు 3 వేల రూపాయలతో గుడ్లను కోనుగోలు చేస్తే సరిపోతుంది. అంతకు మించి పెద్దగా ఖర్చులు ఉండవు. కానీ గుడ్లు కొనుగోలు చేసిన నాటి నుండి అవి పిల్లలు అయ్యేంత వరకు కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. గుడ్ల నుంచి పట్టు పురుగులు బయటికి వచ్చిన తర్వాత వాటిని చెట్లపై వేస్తారు. అలా చెట్టెక్కిన పట్టుపురుగులు ఆకులను తింటూ 25 రోజులకు చెట్టుపై లార్వా గూడులా మారుస్తాయి. అలా తయారైన పట్టే.. దసలి పట్టు. దసలిపట్టు కాయ పంట 45 రోజుల్లో అంటే కేవలం నెలన్నరలో చేతికి వస్తుంది. కానీ ఈ నెలన్నర దసలి పట్టు రైతులు పడే కష్టం అంత ఇంతా కాదు. పక్షులు పట్టు పురుగులను తినకుండా చూసుకోవడం పెద్ద టాస్క్ అని చెప్పాలి
అయితే ఈ దసలిపట్టు కాయలో బైలొల్టిన్, ట్రైవొల్టెన్ అనే రెండు రకాలు ఉంటాయని.. బైవొల్టిన్ దసలి కాయకు ధర వెయ్యికి రూ. 2000 వేల నుంచి రూ. 2500 వేల వరకు పలుకుతుండగా ట్రైవొల్టన్ కాయ ధర రూ.1900 వరకు ఉంటుందని రైతులు చెప్తున్నారు. బైవొల్టిన్ దసలి గుడ్లపై 50 శాతం సబ్సిడీ ఉండడంతో రైతులు బైవొల్టిన్ పట్టు పంటను ఎక్కువ శాతం పండిస్తున్నారు. పెట్టుబడి పోగా ఏడాదికి రూ.80 వేల నుంచి రూ. లక్ష ఆదాయం వస్తుంది. మొదటి పంటకు నెల, రెండో పంటకు 45 రోజులు, మూడోపంటకు 90 రోజులు పడుతుంది.
పట్టుపురుగుల్లో మల్బరీ, దసలి, మెగాసిల్క్ , ఎరి సిల్క్ ఓక్ టస్సర్ అని ఐదు రకాలున్నాయి. మొదటి రకం మల్బరీ పట్టు పురుగులు కాగా.. ఇవి మల్బరీ ఆకులను తిని గూళ్లను అల్లుతాయి. రెండో రకం దసలి పట్టు పురుగులు.. దసలి పట్టుపురుగుల ముఖ్య ఆహారం ఏరుమద్ది (తెల్లమద్ది) నల్లమద్ది చెట్లు.. వీటిని ప్రైమరీ ఫుడ్‌లాండ్స్‌గా వ్యవహరిస్తారు. దసలిపట్టు పురుగులు వీటి ఆకులను ఆహారంగా తీసుకొని పట్టు గూళ్లను అల్లుతాయి. సాధారణంగా పట్టుపురుగుల సీజన్ జూన్ నెల నుంచి డిసెంబర్ వరకూ ఉంటుంది. ఈ ఆరు నెలలు పట్టుపురుగులను ఇక్కడి ఆదివాసీ రైతులు పెంచుతారు. మిగతా సమయంలో చేతివృత్తుల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.
పట్టుగుడ్ల నుంచి వచ్చే లార్వా (గొంగళి పురుగు)ను నల్లమద్ది తెల్లమద్ది చెట్లపై వదులుతారు. ఈ పురుగులు చెట్ల ఆకులను తింటూ 25 నుంచి 30 రోజుల్లో పెద్దగా పెరుగుతాయి. ఆ తర్వాత ఆ చెట్లమీదే పట్టుగూళ్లను అల్లుతాయి. గూళ్లు పూర్తిగా తయారైన తర్వాత స్థానిక గిరిజనులు వాటిని సేకరిస్తారు. దండలుగా కట్టి షేడ్‌నెట్‌లో పరిరక్షిస్తుంటారు. కాయ అల్లిన 15 నుంచి 20 రోజుల తర్వాత వాటిలోంచి మాత్ (పెద్ద సీతాకోక చిలుక) బయటికి వస్తాయి. అక్కడే ఆడ మగ మాత్‌లు కలుస్తాయి. తర్వాత ఆడ మాత్ గుడ్లు పెడుతుంది. ఇలా పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో విత్తనాలను (గుడ్లను) ఉత్పత్తి చేస్తూ.. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. చెన్నూర్‌లోని దసలి పట్టుపురుగుల విత్తనోత్పత్తి కేంద్రంలో ఏటా 2 లక్షల 50 వేల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయని అదికారులు చెప్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి