Hyderabad: సోషల్ మీడియా పోస్ట్‌లపై పోలీసుల సీరియస్.. అడ్డగోలు పోస్టులకు కేసులు తప్పవని వార్నింగ్..!
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే.. తాట తీస్తోంది తెలంగాణ పోలీస్. ఇదే క్రమంలో లేటెస్టుగా రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై యాక్షన్ మొదలు పెట్టారు హైదరాబాద్ పోలీసులు.
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రతి చిన్న విషయం దగ్గరి నుంచి వార్తల వరకు సోషల్ మీడియానే జనం ఫాలో అవుతున్నారు. ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు ఇష్టానుసారం రీల్స్ చేస్తూ జనాలను ఇబ్బంది పెడుతున్నారు. రోడ్లపై పిచ్చిగా వ్యవహరించడం. డబ్బులు వెదజల్లడం, వెకిలి చేష్టలతో అందరినీ బెంబేలెత్తిస్తున్నారు.
అయితే హైదరాబాద్ పాతబస్తీలో యూట్యూబర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇష్టానుసారం అసత్య కథనాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల 9 మంది యూట్యూబర్లపై కేసు నమోదైంది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారయత్నం జరిగిందంటూ తప్పుడు కథనం సోషల్ మీడియాలో ప్రసారం చేశారు. అంతేకాకుండా నిందితులు, బాధితుల పేర్లను బయటికి వెల్లడించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన రెయిన్ బజార్ పోలీసులు.. 9 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో ఇష్టానుసారం ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కాలంలో పాతబస్తీ ప్రాంతంలో నకిలీ రిపోర్టర్లు ఎక్కువైపోయారు. యూట్యూబ్ ఛానల్స్ పేరుతో సంఘవిద్రోహశక్తులు పెట్రేగే అవకాశం ఉందంటూ ఈ మధ్యకాలంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాయి. విధ్వంసం సృష్టించేందుకు కొన్ని శక్తులు సిద్ధమవుతున్నట్టు హెచ్చరికలు సైతం జారీ చేశారు. సింపుల్‌గా యూట్యూబ్ చానల్ ఓపెన్ చేసి, లైసెన్సులతో పనిలేకపోవడంతో చాలా మంది సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు.
ఏదోక న్యూస్ ఛానల్ పేరు పెట్టుకుని రిపోర్టర్లుగా చలామణి అయిపోతున్నారు. నిజమైన మీడియాతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఇలా చేయడంతో ఇప్పుడు ప్రమాదం లేకున్నా రానురాను మరింత ప్రభావం ఉంటుందని ఐబీ హెచ్చరిస్తోంది. ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు పంపింది. ఏదో ఒక లోగో పట్టుకుని తిరుగుతున్నవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టుల అంశంలో కాకుండా మిగతా వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..