Jogu Ramanna: బర్త్ డే వేళ ఎమ్మెల్యే జోగు రామన్నకు చేదు అనుభవం.. కాన్వాయ్‌ని అడ్డుకుని నిరసన తెలిపిన..
Adilabad News: ఆదిలాబాద్: పుట్టినరోజు నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు చేదు అనుభవం ఎదురయ్యింది. పుట్టిన రోజు వేళ బీజేవైఎం నేతల నుండి ఆయనకు నిరసన సెగ ఎదురయ్యింది. పుట్టిన రోజు సందర్భంగా దుర్గా నగర్ కి బయలుదేరిన ఎమ్మెల్యే జోగు రామన్న కాన్వాయ్‌ని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఆదిలాబాద్: పుట్టినరోజు నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు చేదు అనుభవం ఎదురయ్యింది. పుట్టిన రోజు వేళ బీజేవైఎం నేతల నుండి ఆయనకు నిరసన సెగ ఎదురయ్యింది. పుట్టిన రోజు సందర్భంగా దుర్గా నగర్ కి బయలుదేరిన ఎమ్మెల్యే జోగు రామన్న కాన్వాయ్‌ని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏం అభివృద్ధి చేశావని మా కాలనీకి వస్తున్నాయంటూ నిరసనకారులు ప్రశ్నించారు. నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. మావలా పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అంతకు ముందు ఉదయాన తన సన్నిహితుల మధ్య జోగు రామన్న తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తల్వార్‌తో బర్త్ డే కేక్‌ను కట్ చేసి తన సన్నిహితులు, పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారు. అలాగే తన పుట్టిన రోజు సందర్భంగా జోగు రామన్న మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా గత రెండేళ్ల క్రితం పుట్టిన రోజు సందర్భంగా 3 లక్షలకు పైగా మొక్కలు నాటి లిమ్కా బుక్ ఆప్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నామని.. రేపటి సమాజానికి బతుకునిచ్చే మొక్కలను బతికున్నంత కాలం నాటుతూ పోవాలని పిలుపునిచ్చారు. మొక్కలతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ డైరక్టర్ పూర్ణ చందర్ నాయక్ పాల్గొని ఎమ్మెల్యే జోగు రామన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
జోగు రామన్న ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తొలి మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. 1963 జులై 4న జన్మించిన రామన్న.. 60 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2014 నుంచి ఆయన ఆదిలాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు. గతంలో తెలుగు దేశం పార్టీలో ఉన్న ఆయన.. 2011లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) తీర్థంపుచ్చుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మొత్తం నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.