
రూపం భిన్నం.. ఆచార వ్యవహారాలు మరింత విభిన్నం.. తరతరాల సంప్రదాయాలు పాటించడం సంస్కృతిని పంచప్రాణంగా కాపాడుకోవడం ఆదివాసీలకే సొంతం. ఇదిగో ఈ దృశ్యం చూస్తే ఆదివాసీల నియమ నిబందనలు.. ఆచారవ్యవహారాలు ఇంత కఠినంగా ఉంటాయా.. అనుకోక తప్పదు. దండారీ పండుగ వేళ దీపావళి పండుగ మరుసటి రోజు నిర్వహించే దహాడీ వేడుక వామ్మో అనిపించక మానదు. ఇనుప చువ్వలు కాల్చి వాత పెట్టడమే దహాడీ వేడుక ప్రత్యేకం. గుస్సాడీల చేత ఇలా వాతలు పెట్టించుకుంటే మొండి రోగం అయినా మటుమాయం అవుతుందని.. రోగాలు రావని నమ్ముతారు ఆదివాసీలు. దండారీ వేడుకల్లో ఏడవ రోజు ఈ వేడుకను జరుపుతారు. మనుషులతో పాటు పశువులకు సైతం ఎర్రని చువ్వను కాల్చి వాతలు పెట్టడం దహాడీ ప్రత్యేకం. వినడానికి వింతగా ఉన్నా.. చూడడానికి భయకరంగా ఉన్నా ఈ ఆచారాన్ని తూచ తప్పకుండా పాటిస్తామంటున్నారు ఆదివాసీలు.
ఒక్క వాతతో రోగాలన్నీ పరార్.. మొండి రోగాలను సైతం ఆ వాత దూరం చేయడం పక్కా.. ఇది ఆదివాసీలు నమ్మే తరతరాల ఆచారం. అదే దండారీ పండుగలో భాగంగా ఏడవ రోజు గుస్సాడీలు పెట్టే వాతల వైద్యం. ఈ వేడుకనే లాస్ దహాడీ అని పిలుస్తారు ఆదివాసీలు. ఈ వేడకకు వినియోగించే ఇనుప చువ్వ నుండి మొదలు.. కాల్చే కట్టెల వరకు అన్నీ సంప్రదాయ బద్దంగానే తీసుకొస్తారు ఆదివాసీలు. అమావాస్య గ్రహణం వేళ ఇనుప చువ్వను కమ్మరుల వద్ద ప్రత్యేకంగా తయారీ చేయిస్తారు. అలా తయారు చేయించిన ఇనుప కడ్డీని భద్రంగా దాచిపెడుతారు. ఇనుప చువ్వను వేడి చేసేందుకు సైతం ప్రత్యేకమైన పిడకలను , కర్రలను వాడుతారు. పొలాల అమావాస్య రోజు సేకరించిన కర్రలను , పొరకను ఉపయోగించి దహాడీ వేళ ఇనుప చువ్వను కాలుస్తారు. అలా కాల్చిన చువ్వతో మెడపై వాత పెడ్తారు గుస్సాడీలు. చంటి పిల్లల నుండి వృద్దుల వరకు ఈ వాతలు పెట్టించుకుంటారు. అలా చేస్తేనే ఊరికి ఎలాంటి కీడు జరగదని ఆదివాసీల నమ్మకం.
దీపావళి పండుగ ముగియగానే దండారీ వేడుకల్లో భాగంగా.. గుస్సాడీ ల చేత ఈ కాల్చిన చువ్వలను వాతలుగా పెట్టిస్తారు ఆదివాసీ పెద్దలు. ఇలా చేస్తే మొండి రోగాలు సైతం మటుమాయం అవుతాయని ఆదివాసీల అపార నమ్మకం. మనుషులతో పాటు పశువులకు దహాడీ సందర్భంగా వాతలు పెడ్తారు. గుస్సాడీల చేత ఇలా వాతలు పెట్టించుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెప్తారు. కరోనా సమయంలోను ప్రపంచమంతా మరణశయ్యపై పడుకున్నా.. మా ఆదివాసీలను మాత్రం ఆ మాయదారి రోగం ఏం చేయలేకపోయిందని.. అందుకు ఈ వాతల వైద్యమే కారణం అంటున్నారు. దహాడీ ముగియగానే మరుసటి రోజు కొలబోడి కార్యక్రమం నిర్వహించి దండారీ వేడుకను ముగిస్తారు ఆదివాసీలు.
దసరా అనంతరం బోగి పండుగతో మొదలైన దండారీ ఉత్సవాలు ఏడవ రోజుకు చేరుకున్న సందర్బంగా ఈ దహాడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెపుతున్నారు ఆదివాసీ పెద్దలు. రేపు జరుపబోయే కొలబోడి వేడుకతో దండారీ ఉత్సవాలు ముగుస్తాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.