Hyderabad: జూబ్లీహిల్స్ బైపోల్ ఎఫెక్ట్.. భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆలయానికి క్యూ కట్టిన అన్ని పార్టీలు
అమ్మా భాగ్యనగరాన్ని కాపాడే తల్లి. భాగ్యలక్ష్మి మాతా.. పాహిమాం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మా పార్టీని గట్టెంచు తల్లీ అంటూ అమ్మవారికి మొక్కుకుంటున్నాయి అన్ని పార్టీలు. గతానికి భిన్నంగా అన్నిపార్టీలు అమ్మవారి ఆలయానికి క్యూ కట్టాయి. భాగ్యలక్ష్మి అమ్మవారికి దర్శించుకొని ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని వేడుకున్నాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రధాన పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. ఎప్పుడూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించే పార్టీలు ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు. ఇందులో భాగంగానే అన్ని పార్టీల నాయకులు ప్రజల బాటా కాకుండా అమ్మవారికి గుడిబాట పట్టారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని వేడుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి టెంపుల్‌కు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వరుస కట్టారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గట్టెంచుతల్లీ అంటూ వేడుకున్నారు. ఇక బీజేపీ నుంచి తెలంగాణ చీఫ్ రాంచందర్ రావు, ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అటు అధికార కాంగ్రెస్ నుంచి పార్టీ స్టార్ క్యాంపెయినర్ దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేశారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నిమగ్నమైన బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని అమ్మవారిని మొక్కుకున్నారు. అయితే మూడు పార్టీల నేతలు అమ్మవారి ముందు తమ కోరికలను ఉంచారు. చూడాలి మరి అమ్మవారు ఏ పార్టీని ఆశీర్వదిస్తుందో.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




