భారతీయ రైల్వే రూపురేఖల్ని మార్చేస్తూ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి సైతం పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు ప్రారంభమైన రూట్స్‌లో ప్రయాణికులు పెద్ద ఎత్తున రైల్వే సేవలను వినియోగించుకున్నారు. ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ నేపథ్యంలో మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే సికింద్రాబాద్-విశాఖపట్నంల మధ్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. అయితే సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అని తెలుగు వాళ్లు ఎదురు చూస్తున్నారు.
ఇదిలా సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ రైలు సేవలను వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను శంకుస్థాపన చేయనున్నారని సమాచారం. ఇదే సమయంలో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది. అయితే అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నదానిపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లడానికి 12 గంటల సమయం పడుతుండగా వందే భారత్ అందుబాటులోకి వస్తే.. ఆరనున్నర నుంచి ఏడు గంటల్లోనే గమ్యాన్ని చేరుకోచవ్చు.
ఇదిలా ఉంటే సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్‌ను నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రూట్‌లో నడిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణాద్రి.. సికింద్రాబాద్- బీబీనగర్- నల్గొండ- మిర్యాలగూడ- నడికుడి- పిడుగురాళ్ల- సత్తెనపల్లి- గుంటూరు- తెనాలి- బాపట్ల- చీరాల- ఒంగోలు- సింగరాయకొండ- కావలి- నెల్లూరు- గూడూరు- వెంకటగిరి- శ్రీకాళహస్తి- రేణిగుంటల మీదుగా తిరుపతి వెళుతుందనే విషయం తెలిసిందే. ఇక టికెట్ ధర విషయంలోనూ ఓ వార్త వైరల్ అవుతోంది. వీటి ప్రకారం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఛైర్ కార్ టికెట్ రూ. 1150, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ. 2వేలకిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..