Mahabubnagar : అవయవదానంతో ఎనిమిది మంది జీవితాల్లో వెలుగు నింపిన మహిళా..

తాను మరణిస్తూ మరికొంతమందికి జీవితాల్లో వెలుగులు నింపింది ఓ మహిళ.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు.

Mahabubnagar : అవయవదానంతో ఎనిమిది మంది జీవితాల్లో వెలుగు నింపిన మహిళా..
Organ Donation

Edited By:

Updated on: Sep 30, 2024 | 8:19 PM

తాను మరణిస్తూ మరికొంతమందికి జీవితాల్లో వెలుగులు నింపింది ఓ మహిళ.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది.

మక్తల్ పట్టణానికి చెందిన చాకలి జయమ్మకు గత మంగళవారం కృష్ణ మండల పరిధిలో నల్లగట్టు మారెమ్మ దేవతకు మొక్కులు చెల్లించాలని వెళ్లింది. గ్రామ స్టేజ్ వద్ద బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడింది. ఈ ఘటనలో జయమ్మకు తీవ్ర గాయాలైయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. అయితే జయమ్మ అవయవాలు దానం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉస్మానియా వైద్యులు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. అవయవదానంపై జయమ్మ కుటుంబసభ్యులకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అవగాహన కల్పించారు. డాక్టర్ల విజ్ఞప్తి మేరకు జయమ్మ అవయవ దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు అంగీకరించారు. ఇక కుటుంబసభ్యుల అవయవదానానికి ఒప్పుకోవడంతో అవసరం ఉన్నవారి వివరాలు సేకరించారు. వివిధ అవయవాలతో ఎనిమిది మందికి జీవం పోశారు.

చనిపోయినా మరి కొంతమంది జీవితాలలో వెలుగు నింపిన జయమ్మకు వైద్య సిబ్బంది ఘన నివాళులర్పించారు. అనంతరం జయమ్మ పార్థివదేహానికి మక్తల్ పట్టణంలో కాలనీవాసులు దారి పొడవునా దీపాలు, క్యాండిల్స్‌తో నివాళులర్పించారు. మానవతా దృక్పథంతో అవయవదానానికి అంగీకరించిన కుటుంబసభ్యులను పలువురు అభినందించారు.