
ఆది మానవుడు నుంచి విశ్వంలోకి అడుగు పెట్టే స్థాయికి ఎదిగిన మానవుడి ఆలోచన, శక్తి సామర్థ్యాలు అంతులేనివి. అంతటి మేథస్సుతో మనిషి సాధించలేనిదంటూ.. ఏమి లేదనే స్థాయికి ఎదిగారు. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో మనుషులు విఫలమయ్యారు. ఒకవైపు ప్రపంచ దేశాలకు గ్లోబల్ వార్మింగ్‌తో ముప్పు ముంచి ఉందని ప్రపంచం మొత్తం హెచ్చరిస్తూనే ఉంది.
ఒకప్పుడు ఈకలతో ఇంకులో ముంచి వ్రాసే వారు. ఆ తరువాత పాలీ పెన్నులు, చెక్క పెన్నులు, స్టీల్ పెన్నులు, ప్లాస్టిక్ పెన్నులు వచ్చేశాయి. ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని.. అందుకు కోట్ల మొక్కలు నాటాలని దశాబ్దాల కాలం పాటు శ్రమించి పద్మశ్రీ అవార్డులు అందుకున్న మహనీయులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వనజీవి రామయ్య దంపతులు కూడా ఒకరు.
నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు. అలాంటి బాలలు బడిలో విద్యాబుద్ధులు నేర్చుకునేప్పుడే వారిలో మొక్కలు నాటాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని NTR కాలనీకి చెందిన నూతక్కి ఆశ అనే మహిళ ఆలోచన నుంచి రూపొందినదే పేపర్ పెన్ ( ECO PEN ).
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని NTR కాలనీలోని నూతక్కి ఆశ అనే మహిళ ప్లాస్టిక్ ను నిషేధించేలా.. పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. విన్నూత్నంగా ఉండేలా 80% పేపర్‌తో పెన్నును తయారు చేయాలని అనుకున్నారు. వాడి పడేసే పెన్నుగా డిజైన్ చేసినప్పటికీ ఆ పేపర్ పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలు పెరిగేలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఈ పెన్నుతో వేసుకున్నాక పారవేసినప్పుడు పెన్ను క్యాప్ చివర విత్తనాలను అమర్చారు. దీంతో వ్రాయడం అయిపోయాక, ఆ పెన్నును పారవేస్తే నీరు తడి తగలగానే పేపరు భూమిలో కలిసిపోతుంది. పేపరులో ముందే అమర్చిన గింజలు భూమిలో కలిసిపోయి మొక్కలుగా పెరుగుతాయి. 80% ప్లాస్టిక్ రహిత పేపరు పెన్నుతో పర్యావరణాన్ని కాపాడుకోవడం తో పాటుగా వాడి పడేసే పెన్ను తో మొక్కలు కూడా పెంచవచ్చు అంటున్నారు సత్తుపల్లి కి చెందిన నూతక్కి ఆశ.
రాబోయే భావితరాలకు పర్యావరణాన్ని కాపాడుకోవడం ఒక బాధ్యత అని తెలియజేస్తూ.. మొక్కలు నాటాలని సూచించేలా ” ECO PEN ” ఫ్రెండ్లీ పెన్ తో సాధ్యం అవుతుందని సూచిస్తున్నారు. వీరి ఆలోచనకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కూడా ఆకర్షితులయ్యారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతక్కి ఆశ దంపతులకు అభినందనలు తెలియజేశారు. ఏకో పెన్ను చాలా బావుందని, రాసుకుని పడవేసే పెన్నుతో ఎలాంటి హాని లేకుండా 80% పేపరుతో తయారు చేసిన పెన్ను లోనే విత్తనాలు కూడా ఉంచారు. వాటితో మొక్కలు పెరిగేలా వినూత్నంగా డిజైన్ చెయ్యడం మంచి ఆలోచన అని వారిని అభినందించారు.
వీడియో చూడండి..
ఏది ఏమైనా ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ…పర్యావరణాన్ని కాపాడేందుకు పేపర్లతో పెన్నులను తయారు చేయడమే కాకుండా వాడేసిన పారేసిన పెన్ను తో విత్తనాల ద్వారా మొక్కలు పెరగడం చాలా గొప్ప ఆలోచనే కదా మరి..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..