Karimnagar: మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట కోడిని వెళ్లాడదీసి నిరసన.. ఇంతకీ ఎందుకో తెలుసా.?

గత కొంతకాలంగా పట్టణంలో కుక్కలు దాడులు చేస్తుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నామని పదే పదే చెప్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని అజీజోద్దీన్ వాపోయాడు. గత మూడేళ్లుగా కొత్తపల్లిలో ఈ తంతు సాధారణంగా మారిపోయిందని, ఓ సారి చిన్నారులపై దాడులు చేశామని...

Karimnagar: మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట కోడిని వెళ్లాడదీసి నిరసన.. ఇంతకీ ఎందుకో తెలుసా.?
Viral News

Edited By: Narender Vaitla

Updated on: Jan 23, 2024 | 3:08 PM

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మునిసిపాలిటీలో వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. పట్టణంలోని రెచ్చిపోతున్న శునకాల బారి నుంచి కాపాడండంటూ నెత్తినోరు బాదుకున్న వినిపించుకునే వారు లేకుండా పోయారన్న కోపంతో ఓ యువకుడు చేసిన ఈ నిరసన సంచలనంగా మారింది. కొత్తపల్లికి చెందిన అజీజోద్దీన్ చనిపోయిన కోడిని తీసుకెళ్లి ఏకంగా మునిసిపల్ కమిషనర్ చాంబర్ డోర్ ముందు వేలాడదీశాడు.

గత కొంతకాలంగా పట్టణంలో కుక్కలు దాడులు చేస్తుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నామని పదే పదే చెప్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని అజీజోద్దీన్ వాపోయాడు. గత మూడేళ్లుగా కొత్తపల్లిలో ఈ తంతు సాధారణంగా మారిపోయిందని, ఓ సారి చిన్నారులపై దాడులు చేశామని, అంతేకాకుండా మేకలను కూడా చంపేశాయని చెప్పుకొచ్చారు. ఈ సారి ఇంట్లోకి చొరబడిన కుక్క కోడిని చంపేసిందని… దీంతో నిరసన చేపట్టాల్సి వచ్చిందన్నాడు. కుక్కల బెడద నుండి తప్పించాలని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని ఆయన అన్నాడు. వాటిని పిచ్చి కుక్కల వల్ల తాము పడుతున్న ఇబ్బందుల నుండి రక్షించాలని వేడుకున్నా మునిసిపల్ అధికారులు తమ వినతులను విస్మరిస్తున్నారని ఆరోపించాడు.

గతంలో పలువురిపై దాడులకు పాల్పడిందన్న కారణంతో స్థానికులపై కేసులు నమోదు చేశారని దీంతో నిభందనల మేరకే వాటి బారి నుండి తమను కాపాడాలని అభ్యర్థిస్తున్నా కట్టడికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదని అజీజోద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. శునకాల కారణంగా చిన్నారులను బయటకు పంపించే పరిస్థితి లేకుండా పోయిందని, కోళ్లు కూడా పిచ్చి కుక్కలు కరవడంతో చనిపోయాయన్నారు. అధికారులకు పదేపదే చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో చనిపోయిన కోడిని మునిసిపల్ ఛైర్మన్ చాంబర్ ముందు వేలాడదీయాల్సి వచ్చిందన్నాడు. మున్సిపల్‌ ఆఫీస్ ఎదుట కోడిని వేలాడదీసిన తన ఆవేదనను వివరిస్తూ ఓ వీడియో తీశాడు అజీజోద్దీన్‌.. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..