నిజామాబాద్, జులై 16: నిజామాబాద్ జిల్లాలో యువజంట బలన్మరణానికి పాల్పడింది. దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తమపై బంధువులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదని తెలియజేస్తూ వీడియో చిత్రీకరించి, ఆ సెల్ఫీ వీడియోను పోలీసులకు పంపించారు. అనంతరం ప్రాణాలను తీసుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్యలో సోమవారం ( జులై 15) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్ (28), అదే మండలానికి చెందిన శైలజ (24)కు ఏడాది కిందట వివాహమైంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో బంధువులు చిచ్చుపెట్టారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు దంపతులిద్దరూ కుటుంబీకులకు చెప్పి, సోమవారం ఇంటి నుంచి వెళ్లారు. అనంతరం తాను గతంలో ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారని దంపతులు ఇద్దరూ సెల్ఫీ వీడియోను చిత్రీకరించారు. వారు తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు వీడియో చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియోలను కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపారు.
ఈ వీడియో చూసిన ఆయన వెంటనే నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్‌కు వీడియోతోపాటు వారి సెల్‌ఫోన్ నంబరు పంపి, అప్రమత్తం చేశారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు వీడియోలో చెప్పారు. ఆ సమాచారం ప్రకారం స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి మాటువేశారు. ఎంత గాలించినా జాడ కనిపించలేదు. దీంతో బాధితుల ఫోన్ నంబరును ట్రాక్ చేయగా ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు తెలిసింది. వెంటనే నవీపేట ఎస్సై గుర్తించి అక్కడికి చేరుకునేటప్పటికే ఆలస్యమైంది. అనిల్, శైలజ.. ఇద్దరి మృతదేహాలు రైలు పట్టాలపై కనిపించాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యా్ప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. యువ దంపతులు ఆత్మహత్యతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.