పాపం పసివాడు.. అమ్మ పొత్తిళ్లకు దూరమై.. మూడేళ్లుగా శిశుగృహాలో అనాథగా..
A boy living in Orphanage: అమ్మ ప్రేమ తెలియదు.. నాన్న స్పర్శకు నోచుకోలేదు. ఆరు నెలల వయస్సులో అనాథగా రోడ్డున పడ్డాడు.. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో బంధీ అయ్యాడు.. ఆ తరువాత
A boy living in Orphanage: అమ్మ ప్రేమ తెలియదు.. నాన్న స్పర్శకు నోచుకోలేదు. ఆరు నెలల వయస్సులో అనాథగా రోడ్డున పడ్డాడు.. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో బంధీ అయ్యాడు.. ఆ తరువాత పోలీసుల కంట పడి క్షేమంగా శిశు గృహాకు చేరిన ఆ బుడ్డోడు.. హైదరాబాద్ శిశుగృహలో తాత్కాలిక వసతి పొంది.. ఇప్పుడు ఇందూరు శిశుగృహా ఒడికి చేరాడు. మూడేళ్ల బాలుడి బంధువుల కోసం అధికారులు తీవ్రంగా ఆరా తీస్తున్నా.. కుటుంబ సభ్యులు జాడ మాత్రం తెలియడం లేదు. బుడిబుడి అడుగులు వేస్తూ.. చలాకీగా ఉన్న ఈ చిన్నోడు అమ్మ ఒడిలో చేరేందుకు ఆరాట పడుతున్నా.. ఆ అమ్మా-నాన్న ఎవరో అంతుచిక్కడం లేదు.. అమ్మ ప్రేమ కోసం ఎదురుచూస్తున్న ఈ బాలుని పేరు కార్తీక్. నిజామాబాద్ శిశు గృహ సిబ్బందే.. అమ్మా- నాన్నగా మారి.. బాబు అలనాపాలనా చూస్తున్నారు. కార్తీక్ అని పేరు పెట్టి అల్లారిముద్దుగా పెంచుతున్నారు.
ఆరు నెలల వయస్సులో కార్తీక్.. అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. భిక్షాటన చేస్తున్న మహిళ నుంచి ఓ వ్యక్తి కొనుగోలు చేసి.. హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. 2019 జూన్ 23న బోయిన్ పల్లి పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తిని విచారించగా. నిజామాబాద్ బస్టాండ్‌లో బిక్షాటన చేస్తున్న మహిళ నుంచి బాలుడిని కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు.. దీంతో బాలుడిని తాత్కాలిక వసతి కోసం హైదరాబాద్ శిశువిహార్‌లో ఉంచారు. అప్పటనుంచి బాలుని తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నించి.. విసిగిపోయారు శిశుగృహ సిబ్బంది. ఈ కేసు తదుపరి దర్యాప్తు కోసం హైదరాబాద్ చైల్డ్ వెల్పేర్ కమిటీ సభ్యులు.. నిజామాబాద్ చైల్డ్ వెల్పేర్ కమిటీకి బదిలీ చేశారు. ప్రస్తుతం బాలుడు నెల రోజులుగా నిజామాబాద్ శిశు గృహలో వసతి పొందుతున్నాడు. శిశు గృహ సిబ్బంది ఆ బాలుడికి అన్నీతామై చూసుకుంటున్నారు..
ఎవరైనా బంధువులు ఉంటే ముందుకురావాలి.. ఆరు నెలల క్రితం.. అమ్మ ఒడికి దూరమైన బాలుడు ఇప్పుడు మూడేళ్ల వయస్సుకు వచ్చాడు. బయట ప్రపంచం తెలియదు. ఊహ తెలిసినప్పటి నుంచి శిశుగృహలోనే గడిపాడు. మూడేళ్లుగా తోటి అనాథల మధ్య గడుపుతున్నాడు. అమ్మ ప్రేమకు, నాన్న అనురాగానికి ఎందుకు దూరమయ్యాడో తెలియదు. ఎవరి స్వార్దానికి అనాథగా మిగిలిపోయాడో అర్దం కాక బాల్యాన్ని అమాయకంగా గుడుపుతున్నాడు. కనిపించిన వారిలో తమ కుటుంబసభ్యులను చూసుకుంటున్నాడు. సరిగా మాటలు కూడా రాని ఈ బాలునికి.. శిశు గృహ సిబ్బంది పేరు పెట్టి.. చిన్న చిన్న అక్షరాలు నేర్పిస్తున్నారు. ఆటలు ఆడిపిస్తూ… అనాథ అనే భావం రాకుండా చూసుకుంటున్నారు. బాబుకి సంబంధించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే.. నిజామాబాద్ శిశు గృహలో సంప్రదించాలని శిశు గృహ సిబ్బంది సూచిస్తున్నారు. అన్ని ఆధారాలు చూసి.. డి.ఎన్.ఏ. టెస్టు నిర్వహించాక కన్న తల్లిదండ్రులకు అప్పగిస్తామమని శిశు గృహ అధికారి చైతన్య తెలిపారు.
ఎవరు స్పందించకపోతే దత్తతకు సిద్దం – ఐసీడీఎస్ పీడి ఝాన్సీలక్ష్మి నిజామాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన శిశుగృహలో బాబుకు వసతి కల్పించారు. ఆరు నెలల వయసున్న బాలుడికి మూడేళ్లు వచ్చినా కుటుంబ సభ్యులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ బాబుకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే జిల్లా కేంద్రంలోని శిశుగృహ అధికారులను సంప్రదించి.. బాబుకు అమ్మా-నాన్న లేని లోటు తీర్చాలని శిశుగృహ అధికారులు కోరుతున్నారు. బాలుని అసలు తల్లిదండ్రులు రాకపోతే.. దత్తతకు ఇచ్చేందుకు సైతం రెడీగా ఉన్నామని చైల్డ్ వేల్పేర్ అధికారిని ఝాన్సీలక్ష్మి తెలిపారు.
మనస్సు తరక్కుపోతుంది..! మొత్తనికి తన తల్లి తండ్రులు ఎవరో తెలియక అల్లాడుతున్నా ఆ చిన్నారిని చూస్తే మనస్సు తరుక్కుపోతుందంటున్నారు శిశు విహర్ సిబ్బంది.. సంబందికులు ఎవరైన ఉంటే సంప్రదించాలని కోరుతున్నారు..
ప్రభాకర్, టీవీ9 తెలుగు రిపోర్టర్, నిజామాబాద్
Also Read: