Telangana: గ్రూప్ – 2 అభ్యర్థుల కొంప ముంచిన గూగుల్ తల్లి…
ఒకప్పుడు ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్తే అడ్రస్ కోసం స్థానికులను అడిగి తెలుసుకునేవాళ్ళం. కానీ ఆధునిక యుగంలో అందివచ్చిన టెక్నాలజీ సహాయంతో ఈజీగా గమ్య స్థానాలను చేరుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా.. ఇపుడు గూగుల్ తల్లిని నమ్ముకుంటున్నారు. అందరి మాదిరిగానే గ్రూప్ - 2 అభ్యర్థులు కూడా గూగుల్ తల్లిని నమ్ముకుంటే.. చివరికి ఏమైంది...?
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు గ్రూప్ – 2 పరీక్ష రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా 150 కేంద్రాల్లో 52 వేల మంది అభ్యర్థులు గ్రూప్ -2 పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సన ఇంజనీరింగ్, కిడ్స్ ఇంజనీరింగ్, ఎస్వీ డిగ్రీ, వాగ్దేవి జూనియర్ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే చాలామంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు చేరుకున్నప్పటికీ.. కొందరు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయారు. గ్రూప్ 2 పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు పోలీసులు, అధికారులు అనుమతించలేదు. నల్లగొండ జిల్లా చింతపల్లికి చెందిన మాల్సూరు, శేఖర్‌లకు కోదాడలో పరీక్ష కేంద్రాలకు అలాట్ చేశారు. చింతపల్లి నుండి బైక్‌పై బయలు దేరిన ఇద్దరు అభ్యర్థులు సరిగ్గా తొమ్మిది గంటల సమయంలో సన ఇంజనీరింగ్ కాలేజి చేరుకోవాల్సిన వీరు… గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజి చేరుకున్నారు. తమ పరీక్ష కేంద్రం అది కాదని తెలుసుకొని అడ్రస్ అడుగుతూ సన ఇంజనీరింగ్ పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో అధికారులు పరీక్ష కేంద్రం లోపలికి వీరిని అనుమతించలేదు. ఎంత ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే కొంప ముంచిందని అభ్యర్థులు వాపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..