AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక వ్యక్తి చనిపోయాక అతడి ఫేస్‌బుక్ అకౌంట్ ఏమవుతుంది..? మీకు తెలియని నిజాలు ఇవే..

మనిషి బతికున్నంత కాలం సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోలు, వీడియోలతో హడావిడి చేస్తాం.. కానీ మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాక మన ఫేస్‌బుక్ ఖాతా ఏమవుతుంది? ఆ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే పరిస్థితి ఏంటి? ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకే మెటా ఒక అద్భుతమైన డిజిటల్ వీలునామా ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ఏమిటా సెట్టింగ్? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఒక వ్యక్తి చనిపోయాక అతడి ఫేస్‌బుక్ అకౌంట్ ఏమవుతుంది..? మీకు తెలియని నిజాలు ఇవే..
What Happens To Your Facebook Account After Death
Krishna S
|

Updated on: Oct 11, 2026 | 4:01 PM

Share

ఈ డిజిటల్ యుగంలో మనిషి నిజ జీవితానికి సోషల్ మీడియా ప్రతిబింబంగా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన ఆలోచనలు, ఫోటోలు, అనుభవాలన్నీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పంచుకుంటూనే ఉంటాం. అయితే మనిషి జీవితం శాశ్వతం కాదు. ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత వారి సోషల్ మీడియా ఖాతాలకు ఏమి జరుగుతుంది? ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయా లేక సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయా? ఈ ప్రశ్నకు ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా అద్భుత పరిష్కారాన్ని చూపుతుంది. మన తర్వాత మన ఖాతాను ఎలా నిర్వహించాలో మనమే ముందుగా నిర్ణయించుకునే వీలును అకౌంట్స్ సెంటర్ ద్వారా కల్పిస్తోంది.

మెమోరియలైజేషన్ లేదా డిలీట్.. రెండు కీలక ఆప్షన్స్

మెటా నిబంధనల ప్రకారం.. ఒక ఖాతాదారుడు తన మరణానంతరం తన ప్రొఫైల్ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి రెండు ముఖ్యమైన ఆప్షన్లు ఉన్నాయి.

శాశ్వతంగా తొలగించడం : మన తర్వాత మన వ్యక్తిగత వివరాలు, ఫోటోలు లేదా ఖాతా సోషల్ మీడియాలో ఉండకూడదనుకుంటే శాశ్వతంగా డిలీట్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు.

స్మారక ఖాతాగా మార్చడం : మన ప్రొఫైల్‌ను మిత్రులు, బంధువుల జ్ఞాపకాల వేదికగా అలాగే ఉంచాలనుకుంటే దీనిని ఎంచుకోవచ్చు.

స్మారక ఖాతా ప్రత్యేకతలు ఏంటి?

ఖాతాను స్మారకంగా మార్చినప్పుడు ప్రొఫైల్‌లో కొన్ని ఆటోమేటిక్ మార్పులు చోటుచేసుకుంటాయి.

రిమెంబరింగ్ : మరణించిన వ్యక్తి పేరు పక్కన గౌరవసూచకంగా రిమెంబరింగ్ అనే పదం కనిపిస్తుంది.

లాగిన్ కావడం అసాధ్యం: ఈ ఖాతాలోకి ఎవరూ నేరుగా లాగిన్ కాలేరు. దీనివల్ల ప్రొఫైల్ హ్యాకింగ్‌కు గురికాకుండా సురక్షితంగా ఉంటుంది.

నోటిఫికేషన్లు బంద్: ఇతరులకు ఆ ఖాతా నుంచి బర్త్‌డే రిమైండర్‌లు, పీపుల్ యు మే నో సూచనలు లేదా వాణిజ్య ప్రకటనలు రావు.

జ్ఞాపకాల వేదిక: గతంలో పంచుకున్న ఫోటోలు, పోస్ట్‌లు యథావిధిగా ఉంటాయి. ప్రైవసీ సెట్టింగ్‌లకు లోబడి సన్నిహితులు తమ జ్ఞాపకాలను అక్కడ పంచుకోవచ్చు.

లెగసీ కాంటాక్ట్ ఎందుకు అవసరం?

మన మరణానంతరం ప్రొఫైల్‌ను పర్యవేక్షించడానికి ఫేస్‌బుక్ ఒక నమ్మకమైన స్నేహితుడిని లేదా కుటుంబ సభ్యుడిని లెగసీ కాంటాక్ట్‌గా నియమించుకునే సదుపాయాన్ని ఇస్తుంది. లెగసీ కాంటాక్ట్ మీ ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఫోటోను మార్చగలరు. కొత్తగా వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయగలరు. అవసరమైతే ఖాతాను పూర్తిగా తొలగించేందుకు కూడా దరఖాస్తు చేయగలరు. లెగసీ కాంటాక్ట్ మీ పాత వ్యక్తిగత చాట్‌లు చదవలేరు, పాత పోస్ట్‌లను మార్చలేరు.

ఈ సెట్టింగ్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

  • ఈ ప్రక్రియ చాలా సులభం..
  • ఫేస్‌బుక్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి Settings – Privacyకి వెళ్లండి.
  • Accounts Center ఓపెన్ చేసి, Personal Details పై ట్యాప్ చేయండి.
  • అక్కడ Account Ownership and Control ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • అనంతరం Memorialization లోకి వెళ్లి, మీకు నమ్మకమైన లెగసీ కాంటాక్ట్‌ను ఎంచుకోవచ్చు లేదా Delete after death ఆప్షన్‌ను సెట్ చేసుకోవచ్చు.

ఆస్తిపాస్తులకే కాకుండా మనం సృష్టించుకున్న డిజిటల్ ప్రపంచానికి కూడా ఒక డిజిటల్ వీలునామా రాసుకోవడం నేటి ఆధునిక కాలంలో ఎంతో అవసరం.

Follow Us