ఫ్రిజ్, ఏసీలో ఈ చిన్న సెట్టింగ్స్‌తో కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గించుకోండి.. ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే..
కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి వేలకు వేలు పోసి 5 స్టార్ ఏసీలు, ఫ్రిజ్‌లు కొంటున్నారా? అయితే ఈ నిజం తెలుసుకోవాల్సిందే.. ఎంత ఖరీదైన ఉపకరణాలు ఉన్నా, వాటిని నడిపే సెట్టింగ్స్ సరిగ్గా లేకపోతే నెలాఖరుకు బిల్లు షాక్ కొట్టడం ఖాయం. అక్టోబర్ నెలలో వచ్చే ఉక్కపోతకు ఏసీ, ఫ్రిజ్ వాడుతూనే కరెంట్ బిల్లును సగానికి తగ్గించుకోవడానికి నిపుణులు చెబుతున్న సీక్రెట్ టిప్స్ గురించి తెలుసుకోండి..

అక్టోబర్ నెలలోనూ ఎండలు మండుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి, ఉక్కపోతతో చాలా ఇళ్లలో ఏసీలు, ఫ్రిజ్‌ల వినియోగం నిరంతరాయంగా సాగుతుంది. అయితే నెలాఖరుకు వచ్చే విద్యుత్ బిల్లులను చూసి చాలామంది ఆందోళన చెందుతుంటారు. 5 స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలు ఉన్నప్పటికీ విద్యుత్ వినియోగం తగ్గకపోవడానికి ప్రధాన కారణం వాటిని నడిపే సెట్టింగులేనని నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన ఉపకరణాలు కొనడం మాత్రమే కాకుండా వాటి సరైన నిర్వహణే బిల్లులను తగ్గిస్తుంది. విద్యుత్ ఆదా కోసం నిపుణులు సూచిస్తున్న కీలక అంశాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.
ఏసీని ఈ నంబర్ వద్ద ఉంచండి
ఉక్కపోత నుంచి వెంటనే ఉపశమనం కోసం చాలామంది ఏసీని ఆన్ చేయగానే 18 లేదా 20 డిగ్రీలకు సెట్ చేస్తారు. అయితే ఉష్ణోగ్రత తక్కువ పెట్టినంత మాత్రాన గది త్వరగా చల్లబడదు. ఏసీ తన నిర్ణీత వేగంతోనే పనిచేస్తుంది. పైగా కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేయాల్సి రావడంతో విద్యుత్ ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మార్గదర్శకాల ప్రకారం.. ఏసీని 24 డిగ్రీల వద్ద ఉంచడం అత్యంత అనుకూలం. టెంపరేచర్‌ను ఒక్క డిగ్రీ పెంచడం ద్వారా దాదాపు 6శాతం వరకు విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. అక్టోబర్ రాత్రుల్లో వాతావరణం చల్లబడుతుంది కాబట్టి స్లీప్ లేదా ఎకో మోడ్ వాడితే అది ఆటోమేటిక్‌గా కూలింగ్‌ను సర్దుబాటు చేసి కరెంట్ ఆదా చేస్తుంది.
ఫ్రిజ్ ఉష్ణోగ్రత – తప్పుడు సెట్టింగ్స్‌తో నష్టం
రిఫ్రిజిరేటర్ రోజుకు 24 గంటలూ నడుస్తుంది కాబట్టి దాని థర్మోస్టాట్ సెట్టింగ్ చాలా ముఖ్యం. ఫ్రిజ్ లోపలి సాధారణ భాగంలో 3 నుండి 5 డిగ్రీలు, డీప్ ఫ్రీజర్‌లో -18 డిగ్రీల వద్ద ఉంచడం సరైన ప్రమాణం. ఫ్రిజ్ తలుపును పదేపదే తీయడం వల్ల లోపలి చల్లటి గాలి బయటకు పోయి కంప్రెసర్‌పై భారం పడుతుంది. అలాగే వేడి ఆహారాన్ని నేరుగా కాకుండా చల్లారిన తర్వాతే లోపల పెట్టాలి. ఫ్రిజ్‌ను గోడకు బాగా ఆనించి పెట్టకుండా వెనుక భాగంలో గాలి ఆడేలా కాస్త స్థలం వదిలితే కూలింగ్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఫాంటమ్ పవర్‌తో కంటికి కనిపించని ఖర్చు
టీవీలు, మొబైల్ ఛార్జర్లు, సెట్ టాప్ బాక్స్‌లను రిమోట్‌తో ఆఫ్ చేసి స్విచ్ బోర్డు వద్ద ఆన్‌లోనే ఉంచేస్తుంటారు. దీనివల్ల అవి నిరంతరం విద్యుత్‌ను గ్రహిస్తూనే ఉంటాయి. వాడుకలో లేని పరికరాల ప్లగ్‌లను స్విచ్ ఆఫ్ చేయడం లేదా అన్‌ప్లగ్ చేయడం మేలు. ఇలాంటి విద్యుత్ వృథాను అరికట్టేందుకు అవసరమైతే స్మార్ట్ ప్లగ్‌లను ఉపయోగించవచ్చు. విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. నిత్య జీవితంలో పరికరాల సెట్టింగ్స్‌ను సరైన రీతిలో సర్దుబాటు చేసుకోవడం, చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడమే సరిపోతుంది.
