e-Aadhaar App: కొత్త యాప్‌తో ఆధార్ సమస్యలకు చెక్.. ఒక్క క్లిక్‌తో ఇంటి నుంచే అప్‌డేట్..
కేంద్రం ఆధార్‌కు సంబంధించి తీసుకరానున్న కొత్త మొబైల్ యాప్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభంకానుంది. UIDAI అభివృద్ధి చేస్తోన్న ఈ యాప్.. ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండి నేరుగా వివిధ ఆధార్ సంబంధిత సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ యాప్ ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తప్పిస్తుంది.

ప్రస్తుతం దేశంలో అన్ని అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి మొదలు రైల్వే టికెట్ల బుకింగ్ వరకు అన్నింటికి ఆధార్ కార్డు కంపల్సరీ. ఇక ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే ఆధార్ సేవా సెంటర్‌కు వెళ్లాల్సిందే. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆధార్ సంబంధిత సేవలను మరింత సులభతరం చేసేందుకు ఒక కొత్త మొబైల్ అప్లికేషన్‌ను తీసుకొస్తుంది. అతి త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి రానుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యాప్‌ను డెవలప్ చేస్తోంది. దీంతో ఇకపై ఆధార్ సేవలు పొందడానికి తరచుగా ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఏడాది చివరినాటికి
ఈ కొత్త యాప్ ఈ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మరింత ఈజీగా మారుస్తుంది. ఆధార్ నంబర్, ఓటీపీ ధృవీకరణతో ఈ-ఆధార్‌ను పొందవచ్చు.
యాప్ ఫీచర్లు – ప్రయోజనాలు:
ఇన్‌ఫర్మేషన్ అప్‌డేట్: ఈ కొత్త అప్లికేషన్‌తో ఆధార్ కార్డుదారులు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఇంటి నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఏఐ, ఫేస్ ఐడీ టెక్నాలజీ: ఈ యాప్ ఏఐ, ఫేస్ ఐడీ సాంకేతికతను ఉపయోగించి సురక్షితమైన ఆధార్ అప్‌డేట్ ఆప్షన్స్ అందిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
బయోమెట్రిక్ అప్‌డేట్: నవంబర్ నుండి ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం మాత్రమే ఆధార్ కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్స్ సేకరణ: UIDAI ఈ యాప్‌లో డాక్యుమెంట్స్ ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అయ్యే ఫీచర్‌ను చేర్చాలని యోచిస్తోంది. దీంతో బర్త్ సర్టిఫికెట్లు, పాన్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రేషన్ కార్డులు, MNREGA రికార్డులు, కరెంట్ బిల్స్ వివరాలను నేరుగా ప్రభుత్వ రికార్డుల నుంచి పొందవచ్చు.
ఈ మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తే పేపర్ పని తగ్గడం, మోసాలు నియంత్రణలోకి రావడం, అలాగే ఆధార్ సంబంధిత ప్రక్రియలు వేగవంతం అవడం లాంటి ప్రయోజనాలు ఉంటాయని అంచనా. ఈ కొత్త యాప్ భారత పౌరులకు ఆధార్ సేవలను మరింత సులభతరం చేయనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




