మిణుగురులు ఎందుకు మెరుస్తాయో తెలుసా.. చిన్న పురుగుల్లో దాగున్న పెద్ద సైన్స్..
మీరు ఎప్పుడైనా రాత్రిపూట మిణుగురు పురుగులను చూశారా? అవి ఎలా మెరుస్తున్నాయనే డౌట్ మీకు వచ్చిందా..? ఇది మాయాజాలం కాదు. సైన్స్ అని చెప్పొచ్చు. వాటి మనుగడ కోసం అవి సొంతంగా కాంతిని సృష్టించుకుంటాయి. మిణుగురులు రాత్రిపూట ఎలా ప్రకాశిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చిమ్మ చీకటి.. చుట్టూ చెట్లు.. అప్పుడే మినుకు మినుకుమంటూ మిణుగురులు.. వావ్ ఆ సీన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. చీకట్లో స్టార్స్ నేల మీదకి దిగొచ్చాయా అన్నట్టు ఉండే ఈ సీన్ వెనుక ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది. అవును.. ఈ చిన్న కీటకాలు రాత్రిపూట మాత్రమే ఎందుకు మెరుస్తాయి..? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బయోలుమినిసెన్స్.. కాంతిని సృష్టించే ప్రక్రియ
మిణుగురు పురుగులు మెరిసే ఈ ప్రక్రియను శాస్త్రీయంగా “బయోలుమినిసెన్స్” అని పిలుస్తారు. ఇది జీవి తనంతట తానుగా కాంతిని ఉత్పత్తి చేసే ఒక రసాయన ప్రక్రియ. మిణుగురు పురుగుల పొత్తికడుపులో లూసిఫెరిన్, లూసిఫెరేస్ అనే రెండు ముఖ్యమైన రసాయనాలు ఉంటాయి. ఒక మిణుగురు పురుగు శ్వాస తీసుకున్నప్పుడు, ఆక్సిజన్ ఈ రసాయనాలతో కలిసి రసాయన ప్రతిచర్యను ప్రారంభిస్తుంది. ఈ ప్రతిచర్యలో శక్తి విడుదల అవుతుంది. ఇది కాంతి రూపంలో కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో చాలా తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది కాబట్టి దీన్ని “చల్లని కాంతి” అని కూడా అంటారు.
రాత్రిపూట మాత్రమే ఎందుకు మెరుస్తాయి..?
మిణుగురు పురుగులు రాత్రిపూట మెరవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పునరుత్పత్తి, కమ్యూనికేషన్ వీటికి ప్రధాన కారణం. రాత్రి చీకటి వాటికి సరైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
జత కోసం: వివిధ రకాల మిణుగురు పురుగులు ప్రత్యేకమైన మెరుపును కలిగి ఉంటాయి. మగ పురుగులు ఎగురుతూ ఒక లయలో కాంతి సంకేతాలను పంపిస్తాయి. ఈ సంకేతాలను ఆడ పురుగులు గుర్తించి అదే పద్ధతిలో స్పందిస్తాయి. ఈ విధంగా అవి చీకటిలో కూడా ఒకరినొకరు కనుగొంటాయి. పగటిపూట ఈ కాంతి కనిపించదు కాబట్టి ఈ ప్రక్రియ రాత్రిపూట మాత్రమే సాధ్యమవుతుంది.
ఆత్మరక్షణ: మిణుగురు పురుగుల మెరుపు రక్షణగా కూడా పనిచేస్తుంది. ఈ మెరుపు ఇతర జీవాలకు ఒక హెచ్చరికగా కూడా పనిచేస్తుంది. మిణుగురు పురుగులు వాటి శరీరంలో రసాయనాలను కలిగి ఉంటాయి. వీటి వల్ల వచ్చే ప్రకాశవంతమైన మెరుపు పక్షులు, కప్పలు వంటి వాటి నుంచి మిణుగురులను కాపాడుతుంది. ఈ రకంగా మిణుగురు పురుగుల మెరుపు అనేది వాటి జీవితంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రకృతిలో అవి తమ మనుగడ సాగించడానికి సహాయపడుతుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




