టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఇజ్రాయిల్ సూపర్ ప్రాసెసర్‌!

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో హార్డ్‌వేర్ తయారు చేసే సంస్థలు ఎన్ని ఉన్నా.. వాటిలో ఉపయోగించే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU) చిప్‌ల విషయంలో ఓ రెండు మూడు కంపెనీలే మార్కెట్‌ను శాసిస్తున్నాయి. అందులో ఇంటెల్ (Intel) మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ దిగ్గజాలు ఉలిక్కిపడేలా ఇజ్రాయిల్ దేశానికి చెందిన స్టార్టప్ నెక్స్ట్‌ సిలికాన్ (NextSilicon) సరికొత్త సూపర్ ప్రాసెసర్‌ను ఆవిష్కరించింది.

టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఇజ్రాయిల్ సూపర్ ప్రాసెసర్‌!
Nextsilicon Chip

Edited By: Balaraju Goud

Updated on: Oct 23, 2025 | 6:59 PM

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో హార్డ్‌వేర్ తయారు చేసే సంస్థలు ఎన్ని ఉన్నా.. వాటిలో ఉపయోగించే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU) చిప్‌ల విషయంలో ఓ రెండు మూడు కంపెనీలే మార్కెట్‌ను శాసిస్తున్నాయి. అందులో ఇంటెల్ (Intel) మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. ఏ కంప్యూటర్, ల్యాప్‌టాప్ చూసినా.. దానిపైన Intel Inside అనే లోగో కనిపిస్తుంది. Intel తర్వాతి స్థానంలో AMD ప్రాసెసర్లతో తయారైన కంప్యూటర్లు కనిపిస్తాయి. ఇక గ్రాఫిక్స్ – మల్టీమీడియాను ప్రాసెసర్లలో ఎన్‌విడియా సంస్థ రూపొందించే చిప్‌సెట్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. హార్డ్‌వేర్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు పూర్తిగా తామే తయారు చేసే యాపిల్ (Apple) సంస్థ మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. టెక్ మార్కెట్లో దశాబ్దాలుగా ఈ సంస్థల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ దిగ్గజాలు ఉలిక్కిపడేలా ఇజ్రాయిల్ దేశానికి చెందిన స్టార్టప్ నెక్స్ట్‌ సిలికాన్ (NextSilicon) సరికొత్త సూపర్ ప్రాసెసర్‌ను ఆవిష్కరించింది. దాని పనితీరు, విశేషాలు టెక్ దిగ్గజాలను నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

ఇజ్రాయెల్ నుంచి సవాల్..

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణల్లో చిన్న దేశం ఇజ్రాయెల్ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది. ముఖ్యంగా అష్ట దిక్కులా శత్రుదేశాల నడుమ కొలువైన ఈ చిన్న దేశం రక్షణ రంగ ఆవిష్కరణల్లో అగ్రగామిగా దూసుకెళ్తోంది. రక్షణతో పాటు వ్యవసాయం, ఆరోగ్యం, అంతరిక్షం, శాస్త్ర-సాంకేతిక రంగాల్లోనూ ఆ దేశం అనేక ఆవిష్కరణలు చేసింది. ఇప్పుడు తాజాగా కంప్యూటర్ హార్డ్‌వేర్ రంగాన్ని శాసించే సరికొత్త ఆవిష్కరణతో యావత్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. గత రెండేళ్లుగా పాలస్తీనా, లెబనాన్, ఇరాన్ వంటి దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేస్తున్నప్పటికీ.. తమ ఆవిష్కరణలపై వాటి ప్రభావం లేకుండా ముందుకు దూసుకెళ్ళింది.

ఆ దేశానికి చెందిన ఒక చిన్న టెక్నాలజీ రంగ స్టార్టప్ కంపెనీ, నెక్స్ట్‌సిలికాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప చిప్ తయారీ సంస్థలైన ఎన్విడియా, ఇంటెల్ వంటి సంస్థలకు సవాలు చేస్తున్న ఒక కొత్త ప్రాసెసర్‌ను ప్రకటించింది. ఈ చిప్ పేరు మావరిక్-2. ఇది ఆర్ఐఎస్సీ-వీ (RISC-V) అనే ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైంది. సాధారణ మాటల్లో చెప్పాలంటే.. ఇది కంప్యూటర్ బ్రెయిన్‌లా పనిచేసే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU)లలో ఈ ప్రాసెసర్ ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పటికే మార్కెట్ లీడర్లుగా ఉన్న మైక్రోప్రాసెసర్లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగిస్తూ వాటి కంటే అనేక రెట్ల వేగంతో ప్రాసెస్ చేయగలదు.

నెక్స్ట్‌సిలికాన్ 2017లో ఏర్పాటైన ఒక చిన్న కంపెనీ. దీని వెనుక 300 మిలియన్ డాలర్ల (సుమారు 2,500 కోట్ల రూపాయలు) పెట్టుబడులు ఉన్నాయి. తైవాన్‌లోని TSMC కంపెనీకి చెందిన 5nm (నానోమీటర్) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ చిప్‌ను డిజైన్ చేశారు. ఒకే చిప్‌లో 32 RISC-V కోర్లు ఉంటాయి. అవి 1.5GH (గిగా హెడ్జ్) వేగంతో పనిచేస్తాయి. అలాగే 96GB హై-స్పీడ్ మెమరీ (HBM3e) ఇందులో ఉంటుంది. ఇది ఒక్కసారి 3.2 టెరాబైట్ల మెమరీ బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తుంది. ఇదంతా కేవలం 300 వాట్లు విద్యుత్ వినియోగంతోనే చేయగల్గుతోంది!

మావరిక్-2 గురించి కంపెనీ చెప్పిన ప్రత్యేకత ఏమిటంటే.. ఇది “డేటా-ఫ్లో” అనే కొత్త రీతిలో పనిచేస్తుంది. సాధారణ చిప్‌లలో 98% భాగం కేవలం నియంత్రణకు వాడతారు. కానీ ఇక్కడ చాలా భాగం నిజమైన గణనలకు (కంప్యూటేషన్) ఉపయోగపడుతుంది. ఫలితంగా ఇది ఎన్విడియా సంస్థకు చెందిన HGX B200 జీపీయూ (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) కంటే 4 రెట్లు ఎక్కువ వేగం, తక్కువ విద్యుత్‌తో పనిచేస్తుందని బెంచ్‌మార్క్‌లు చూపిస్తున్నాయి. ఇంటెల్ సాఫిర్ రాపిడ్స్ సిప్యూ కంటే 20 రెట్లు మెరుగైన పనితీరును కూడా ప్రదర్శిస్తోంది. పైగా ఇది AI (కృత్రిమ మేధస్సు), HPC (హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్) వంటి కష్టమైన పనుల్లో సమర్థవంతంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా న్యూక్లియర్ ఆయుధాల మోడలింగ్, సరికొత్త ఔషధాల ఆవిష్కరణ, పదార్థాల విశ్లేషణ వంటి శాస్త్రీయ పరిశోధనలకు ఇది బాగా సహాయపడుతుంది.

మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మావరిక్-2తో పాటు, కంపెనీ “ఆర్బెల్” అనే కొత్త ఆర్ఐఎస్సీ-వీ ప్రాసెసర్‌ను కూడా ప్రకటించింది. ఇది ఇంటెల్ లయన్‌కోవ్, AMD జెన్ 5 కంటే మెరుగైనదని చెబుతున్నారు. ఆర్ఐఎస్సీ-వీ అంటే ఏమిటంటే.. ఇది ఓపెన్ స్టాండర్డ్. ఫలితంగా ఆ టెక్నాలజీని ఆధారంగా చేసుకుని ఎవరైనా మరికొన్ని అడ్వాన్స్‌డ్ వెర్షన్లను రూపొందించవచ్చు. ఫలితంగా ఇంకా అనేక కొత్త స్టార్టప్‌లకు అవకాశాలు ఉంటాయి.

ఈ చిప్ ఇప్పటికే అమెరికాలోని సాండియా నేషనల్ ల్యాబొరేటరీలలో పరీక్షలు ఎదుర్కొంటోంది. “ఇది మా కోడ్‌ను మార్చాల్సిన అవసరం లేకుండా, చాలా మంచి పనితీరు చూపిస్తోంది” అని అక్కడి సీనియర్ సైంటిస్ట్ జేమ్స్ ఎల్. లారోస్ వెల్లడించారు. PCIe కార్డ్ రూపంలో లేదా డ్యూయల్-డై మాడ్యూల్‌గా మావరిక్-2 ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది కస్టమర్లకు కొత్త కోడ్ రాయాల్సిన పని లేకుండా, పాత సాఫ్ట్‌వేర్ (క్యూడా, ఫోర్ట్రాన్ వంటివి)తో కూడా పనిచేస్తుంది.

“గత 80 సంవత్సరాలుగా హార్డ్‌వేర్ మారాలని సాఫ్ట్‌వేర్‌ పై ఒత్తిడి పెంచాం. మావరిక్-2తో అది సాధ్యపడుతోంది. ఇది భవిష్యత్తు పనులకు సిద్ధంగా ఉంటుంది” అని నెక్స్ట్‌సిలికాన్ CEO ఎలాడ్ రాజ్ అన్నారు. ఈ కొత్త చిప్ ప్రపంచ చిప్ మార్కెట్‌లో పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఓపెన్ సోర్స్ సాంకేతికతతో చిన్న కంపెనీలు కూడా పెద్దవాళ్లను ఎదుర్కోగలవని ఇది నిరూపిస్తోంది. ఈ సరికొత్త ఆవిష్కర శాస్త్రవేత్తలతో పాటు పరిశోధకులకు ఉత్సాహాన్నిస్తోంది. త్వరలో మరిన్ని పరీక్షలు, ధరల వివరాలు తెలుస్తాయని కంపెనీ చెబుతోంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..