Telangana: రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రాలు! ఎలా బుక్‌చేసుకోవాలంటే?
వ్యవసాయంలో యాంత్రీకరణను వేగవంతం చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ కొత్త డిజిటల్ విధానానికి శ్రీకారం చుడుతోంది. టాక్సీ సేవల మాదిరిగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్లు వంటి వ్యవసాయ యంత్రాలను మొబైల్‌లోనే బుక్ చేసుకునేలా ప్రత్యేకంగా “ఫామ్ యాప్”ను అభివృద్ధి చేసే పనులు ప్రారంభమయ్యాయి. యూరియా యాప్ విజయంతో ప్రోత్సాహం పొందిన ప్రభుత్వం, రైతుల పనిభారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

రైతాంగానికి మేలు చేసేందుకు ప్రభుత్వం ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా టాక్సీ సేవల తరహాలో ట్రాక్టర్, హార్వెస్టర్ల వంటి వ్యవసాయ యంత్రాలను మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునేందు ప్రత్యేక యాప్‌ను తీసుకురానుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే రైతులు తమ గ్రామ పరిధిలో ఉన్న యంత్రాల వివరాలు మొబైల్‌లోనే చూసి, అవసరమైన తేదీ-సమయం ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన వెంటనే యంత్ర యజమాని వివరాలు అందుతాయి. నిర్ణయించిన సమయానికి యంత్రం పొలం వద్దకు చేరుకుని దున్నడం, నాట్లు వేయడం, మందులు పిచికారీ చేయడం వంటి పనులు పూర్తి చేస్తుంది.
పంటల సీజన్లలో యంత్రాల కొరత రైతులకు పెద్ద సమస్యగా మారుతోంది. ఒకేసారి కోతలు మొదలైతే హార్వెస్టర్లు, మక్కజొన్న కోసే యంత్రాలు దొరకక రైతులు రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా పరిశీలనలో ఉన్న ప్రణాళిక ఇప్పుడు కార్యరూపం దాల్చే దశకు వచ్చింది. ఏపీలో డ్రోన్ సేవలకు వాడుతున్న యాప్ నమూనాను పరిశీలించి, మరింత విస్తృతంగా అమలు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
ఫామ్ యాప్ వల్ల రైతులు కూలీలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. గ్రామాల్లో పెరుగుతున్న కూలీల కొరత కారణంగా పంటలు ఆలస్యమవుతున్న పరిస్థితికి చెక్ పడుతుంది. యంత్రాలతో పనులు త్వరగా పూర్తవడంతో సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా ధరల విషయంలో పారదర్శకత పెరిగి, మధ్యవర్తుల సమస్య కూడా తగ్గే అవకాశం ఉంది. డ్రోన్ల వినియోగం వల్ల ఎరువులు, పురుగుమందులు శాస్త్రీయంగా పిచికారీ చేయవచ్చు. అవసరమైన పరిమాణం మాత్రమే వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం కూడా రక్షితమవుతుంది.
రైతు పొలం వద్ద లేకపోయినా, ఇంటి నుంచే బుకింగ్ చేసుకుని పనులను షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది. యంత్రం ఎక్కడ ఉంది, ఎప్పుడు చేరుతుంది వంటి లైవ్ సమాచారం కూడా యాప్‌లో కనిపిస్తుంది. యాప్ పనితీరును వ్యవసాయ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించనున్నారు. టెక్నాలజీపై అవగాహన తక్కువగా ఉన్న రైతులకు స్థానిక స్థాయిలో సహాయం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ డిజిటల్ నెట్‌వర్క్ అమలైతే వ్యవసాయం మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతుందని అంచనా వేస్తున్నారు
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
