NASA Vascular Tissue Challenge: కృత్రిమ అవయవాల నిర్మాణంలో నాసా ముందడుగు.. త్రీడీ ప్రింటెడ్ కణజాల ఆవిష్కరణ!
NASA Vascular Tissue Challenge: వైద్య సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక కాలానికి వేగంగా దూసుకుపోతోంది. దీనికి 3 డైమెన్షనల్ ప్రింటింగ్ ఈ రంగం పురోగతికి కొత్త కోణాలను జోడిస్తోంది.
NASA Vascular Tissue Challenge: వైద్య సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక కాలానికి వేగంగా దూసుకుపోతోంది. దీనికి 3 డైమెన్షనల్ ప్రింటింగ్ ఈ రంగం పురోగతికి కొత్త కోణాలను జోడిస్తోంది. ప్రయోగశాలలో క్యూబ్ ఆకారపు కణజాలాన్ని నిర్మించడానికి పరిశోధకుల బృందం ఇప్పుడు 3డి ప్రింటింగ్‌ను ఉపయోగించగలిగింది. ఈ 3 డి-ప్రింటెడ్ కణజాలం 30 రోజులు పనిచేయగలదు. నాసా నిర్వహించిన వాస్కులర్ టిష్యూ ఛాలెంజ్‌లో భాగంగా ఈ కొత్త అభివృద్ధి చేశారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కణజాల ఇంజనీరింగ్ ఆవిష్కరణలను వేగవంతం చేయడం కోసం నాసా ఈ ఛాలెంజ్ నిర్వహించింది. పరిశోధనల్లోనూ, వైద్య చికిత్సలలోనూ ఈ 3 డి-ప్రింటెడ్ కణజాలం చాలా ఉపయోగపడుతుంది. ఈ పోటీలో పాల్గొన్న రెండు టీంలు నార్త్ కరోన్లినాలోని వెక్ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీజెనరేటివ్ మెడిసిన్ (WFIRM) కు చెందినవి. విన్స్ టన్ ఈ ఆవిష్కరణల కోసం మొదట ట్రయల్స్ పూర్తి చేసింది. ఇప్పడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలను ముందుకు తీసుకువెళ్ళడంలో ఈ టీం పాల్గొంటుంది.
ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం అయితే, రోగి సొంత కణజాలం నుంచి కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది. అదేవిధంగా అవయవాల మార్పిడి కోసం దీర్ఘకాలం వేచి ఉండే అవసరాన్ని లేకుండా చేస్తుంది. అంతేకాకుండా అవయవాల కొరత అనే సమస్య నుంచి ప్రపపంచం బయట పడుతుంది. నాసా తన పోటీ బ్రీఫింగ్‌లో బృందాలను క్రియాత్మక కృత్రిమ రక్త నాళాలతో కణజాలాలను తయారుచేసే వ్యూహాలను అభివృద్ధి చేసి పరీక్షించాలని కోరింది. కణాలలో ఆక్సిజన్ సరఫరా చేసే క్రమంలో పెర్ఫ్యూజన్ అనే ఒక ప్రక్రియ ద్వారా జీవక్రియ వ్యర్ధాలను తొలగించడానికి కణజాలం రక్తనాళాలపై ఆధారపడుతుంది. ఈ పెర్ఫ్యూజన్ ను ఇంజనీరింగ్ కణజాలాల్లో పునఃసృష్టి చేయడం చాలా కష్టం. దీనికోసం ఇప్పుడు ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కృత్రిమంగా తయారు చేసిన కణజాలం పరిశీలించడం కోసం 30 రోజుల పాటు ట్రయల్స్ నిర్వహిస్తారు. అంతకాలం అవి సజీవంగా ఉండడానికి ఇప్పుడు చేసిన ఆవిష్కరణ ఉపయోగపడుతుంది. ఈ త్రీడీ టెక్నాలజీ ద్వారా కణజాలాలను సజీవంగా, ఆక్సిజన్, పోషక స్థాయిలను నిర్వహించడం సాధ్యం అవుతుంది. దీంతో కృత్రిమ అవయవాల రూపకల్పనకు అవకాశాలు దొరుకుతాయని నాసా చెబుతోంది.
ఈ అవిష్కరణపై మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. ఈ త్రీడీ టెక్నాలజీతో కృత్రిమ అవయవాలు రూపొందించే దిశలో ప్రయత్నాలు ఫలిస్తే.. మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.