Antivenom: పాము కాటుకు సరికొత్త చికిత్స.. విషానికి కొత్త విరుగుడును కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
పాము కాటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు దీనికి సరికొత్త పరిష్కారం కనిపెట్టారు. దీనిపై ఏళ్ల తరబడి పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు తాజాగా పాముకు కాటుకు కొత్త విరుగుడును కనిపెట్టారు. గత సాంప్రదాయ విరుగుడు తయారీకి బిన్నంగా ల్యాబ్‌లోనే యాంటీవెనం తయారు చేసేలా సరికొత్త విదానానికి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఇది రాబోయే తరాలకు సంజీవనిలా మారబోతుందని పరిశోదకులు అంటున్నారు.

ఈ భూమిపై అనేక రకాల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా విషపూరితమైనవి. అయితే ప్రస్తుతం జంతువుల రక్తం నుంచి తయారు చేసిన యాంటీవెనమ్‌ను పాముకాటుకు విరుగుడుగా వాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా శాస్త్రవేత్తలు పాముకాటుకు సరికొత్త విరుగుడును కనిపెట్టారు. ఎన్నో ఏళ్లుగా వాడుకలో ఉన్న సంప్రదాయ జంతు ఆధారిత పద్ధతికి భిన్నంగా.. ల్యాబ్‌లోనే బయోటెక్నాలజీ సాయంతో రీకాంబినెంట్ యాంటీవెనమ్ అనే సరికొత్త విరుగుడును భారత, డెన్మార్క్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), డెన్మార్క్‌కు చెందిన టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి పాముకాటుకు ఈ కొత్త విరుగుడును కనిపెట్టారు. ఈ పరిశోధనలో భాగంగా వీరు ఎలుకలపై ప్రయోగాలు జరిపారు. ఈ ప్రయోగంలో వీరు తయారు చేసిన కొత్త విరుగుడు రక్తపింజరి, తాచుపాముల్లోని వివిధ జాతుల విషాన్ని విజయవంతంగా నిర్వీర్యం చేయగలిగింది.
100 ఏళ్ల చరిత్రలో తొలిసారి విజయం
గత శతాబ్ద కాలంగా శాస్త్రవేత్తలు గుర్రాలు లేదా గొర్రెలకు పాము విషాన్ని ఎక్కించి, వాటిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల ద్వారా యాంటీవెనమ్ తయారు చేసేవారు. ఇప్పటికీ దాదాపు అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ పద్ధతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటం, ఒక పాము విషం కోసం తయారు చేసింది మరో రకానికి పనిచేయకపోవడం, అలాగే ఉత్పత్తి వ్యయం పెరగడంతో మరో ప్రత్యామ్నాయ మార్గంలో విరుగుడు తయారు చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
రెండు పాముల విషాన్ని నిర్వీర్యం చేసిన విరుగుడు
ఇందులో భాగంగానే పరిశోధనలు ప్రారంభించి, ఇంతకుముందు ఆఫ్రికన్ పాము విషాన్ని ఒంటె జాతి జంతువులకు ఇచ్చి ఉత్పత్తి చేసిన యాంటీబాడీల చివర ఉండే తేలికపాటి భాగాలను వేరు చేసి ఐదు నానోబాడీల కాక్‌టెయిల్‌ను రూపొందించారు. ఈ నానోబాడీల మిశ్రమంతో తయారు చేసిన విరుగుడును మన దేశంలో కనిపించే స్పెక్టకిల్డ్ కోబ్రా (తాచుపాము), మోనోకిల్డ్ కోబ్రా (చంద్రనాగు) వంటి రెండు రకాల కోబ్రాల విషంపై పరీక్షించగా, ఇవి సులభంగా ఆ విషాన్ని నిర్వీర్యం చేశాయి.
ఎలుకలపై ప్రయోగం సక్సెస్
ఇందుకోసం ముందుగా ఎలుకలకు పాము విషం ఎక్కించి, ఆ తర్వాత ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను శాస్త్రవేత్తలు ఇంజెక్ట్ చేశారు. కొద్దిసేపటికే ఆ ఎలుకలు విష ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్నాయి. వాటికి విషం ఎక్కించిన అరగంట తర్వాత విరుగుడు అందించినా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతేకాదు, నరాల బలహీనత, పక్షవాత లక్షణాలు కనిపించిన ఎలుకలు సైతం ఈ విరుగుడుతో చాలా త్వరగా కోలుకున్నాయని ఐఐఎస్సీ అసోసియేట్ ప్రొఫెసర్ కార్తీక్ స్పష్టం చేశారు.
రాబోయే తరాలకు దొరికిన సంజీవని
ప్రస్తుతం యాంటీవెనమ్ తయారు చేసేందుకు గుర్రాలు, ఒంటెలు, గొర్రెలు వంటి జంతువులను వినియోగించాల్సి వస్తోంది. అయితే భవిష్యత్తులో జంతువులను పదేపదే ఇమ్యునైజ్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాక్టీరియా లేదా హ్యూమనైజ్డ్ వ్యవస్థల ద్వారా ల్యాబ్‌లోనే వీటిని భారీ ఎత్తున ఉత్పత్తి చేసే దిశగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. పాముకాటు మరణాలు ఎక్కువగా సంభవించే భారత్ వంటి దేశాల్లో ఈ కొత్త విరుగుడు రాబోయే తరాలకు ఒక సంజీవనిలా మారనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
