AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌ఫోర్స్ చేతికి అత్యాధునిక మిస్సైల్.. R-37M అందించేందుకు ముందుకొచ్చిన రష్యా!

హమాస్‌, హెజ్బుల్లాతో యుద్ధం ద్వారా ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ సామర్థ్యం ప్రపంచానికి తెలిస్తే.. పాకిస్తాన్‌తో స్వల్పకాలిక యుద్ధంతో భారత గగనతల రక్షణ వ్యవస్థ డైమండ్ డోమ్ సత్తా లోకానికి తెలిసింది. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు శత్రుదేశాలు గగనతలం నుంచే ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థ ఒక్కటే ఉంటే సరిపోదు.

ఎయిర్‌ఫోర్స్ చేతికి అత్యాధునిక మిస్సైల్.. R-37M అందించేందుకు ముందుకొచ్చిన రష్యా!
R 37m Long Range Missile To India
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Jun 06, 2025 | 11:17 AM

Share

హమాస్‌, హెజ్బుల్లాతో యుద్ధం ద్వారా ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ సామర్థ్యం ప్రపంచానికి తెలిస్తే.. పాకిస్తాన్‌తో స్వల్పకాలిక యుద్ధంతో భారత గగనతల రక్షణ వ్యవస్థ డైమండ్ డోమ్ సత్తా లోకానికి తెలిసింది. భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు శత్రుదేశాలు గగనతలం నుంచే ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థ ఒక్కటే ఉంటే సరిపోదు. శత్రుదేశం ఆట కట్టించేందుకు గగనతనం నుంచి దాడులు చేసే సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారత్ అదే పని చేస్తోంది. భారత ఫైటర్‌జెట్ పైలట్లు శత్రుదేశ భూభాగంలోకి అడుగుపెట్టకుండా సుదూర లక్ష్యాలను ధ్వంసం చేసే అధునాతన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను సమకూర్చుకునే ప్రయత్నాలు సాగిస్తోంది.

ఈ క్రమంలో భారతదేశానికి తన అత్యాధునిక R-37M హైపర్‌సోనిక్ లాంగ్-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌ను అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. ఈ మిస్సైల్‌ను భారత వైమానిక దళం ఉపయోగిస్తున్న రష్యన్ తయారీ సుఖోయ్ (Su-30MKI) ఫైటర్ జెట్‌లలో అమర్చి వినియోగించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం భారతదేశ గగన రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుంది. పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాల వైమానిక శక్తిని వెనక్కి నెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

R-37M మిస్సైల్ అంటే ఏమిటి?

రష్యా దేశానికి చెందిన R-37Mకు నాటో AA-13 Axeheadగా నాటో దేశాలు వ్యవహరిస్తాయి. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన లాంగ్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌లలో ఇది ఒకటి. రష్యా వింపెల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్, శత్రు విమానాలను సుమారు 300 – 400 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ చేయగలదు. దీని హైపర్‌సోనిక్ వేగం మాక్ 6 (ధ్వని వేగం కంటే 6 రెట్లు) ఈ క్షిపణిని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేస్తుంది.

ఈ మిస్సైల్ ప్రధానంగా శత్రుదేశానికి చెందిన AWACS (ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్), ట్యాంకర్ విమానాలు, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. లాంగ్ రేంజ్ సామర్థ్యం కారణంగా భారత వైమానికదళం శత్రు దేశం లోపలకు చొరబడకుండానే భారత గగనతలం నుంచి ప్రయోగించే అవకాశాన్ని ఇస్తుంది. తద్వారా మన ఫైటర్ జెట్లు, పైలట్లు మరింత సురక్షితంగా ఉంటూ శత్రుదేశపు లక్ష్యాలను ధ్వంసం చేయడం సాధ్యపడుతుంది.

సాంకేతిక విశేషాలు

రేంజ్: 300 నుంచి 400 కిలోమీటర్ల వరకు, Beyond Visual Range (BVR) మిస్సైల్‌లలో అగ్రగామి.

వేగం: మాక్ 6 (సుమారు 7,400 కిమీ/గంట), హైపర్‌సోనిక్ సామర్థ్యం.

వార్‌హెడ్: 60 కిలోగ్రాముల హై-ఎక్స్‌ప్లోసివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్, ఇది భారీ విధ్వంసాన్ని సృష్టించగలదు.

బరువు: సుమారు 510 కిలోగ్రాములు.

గైడెన్స్ సిస్టమ్:

ఇనర్షియల్ నావిగేషన్.

మిడ్-కోర్స్ అప్‌డేట్స్ (లాంచింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి).

అంతిమ దశలో యాక్టివ్ రాడార్ హోమింగ్.

ఫీచర్స్:

“ఫైర్ అండ్ ఫర్గెట్” సామర్థ్యం. అంటే లాంచ్ చేసిన తర్వాత మిస్సైల్ తనంతట తానుగా లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేస్తుంది. ఉదాహరణకు శత్రుదేశపు యుద్ధ విమానం వేగంగా కదులుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే.. దాన్ని వెంటాడి పేల్చేయగలదు.

విడిపోయే రాకెట్ బూస్టర్, R-77 మిస్సైల్ (100 కిమీ రేంజ్) కంటే 3-4 రెట్లు ఎక్కువ దూరం చేరగలదు.

లక్ష్య సామర్థ్యం: AWACS, ట్యాంకర్ విమానాలు, ఫైటర్ జెట్‌లను శత్రు రక్షణ వ్యవస్థల రేంజ్‌కు దూరంగా ఉండి నాశనం చేయగలదు.

భారతదేశానికి ఎందుకు లాభదాయకం?

వ్యూహాత్మక ఆధిపత్యం: R-37M ద్వారా 400 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ధ్వంసం చేయగలగడం ద్వారా భారత వైమానిక దళానికి శత్రు విమానాలను దూరం నుంచే నాశనం చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. పాకిస్తాన్ ఉపయోగించే F-16 లేదా చైనా ఉపయోగించే J-10C వంటి విమానాలతో పోలిస్తే ఇది గణనీయమైన ఆధిక్యతను అందిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న AMRAAM (AIM-120C) మిస్సైల్ రేంజ్ సుమారు 100-120 కిలోమీటర్లు మాత్రమే.

పైలట్ల భద్రత: లాంగ్ రేంజ్ సామర్థ్యం వల్ల పైలట్లు శత్రు రక్షణ వ్యవస్థల రేంజ్‌కు దూరంగా ఉండి దాడి చేయవచ్చు, దీనివల్ల విమానాలు, పైలట్ల నష్టం తగ్గుతుంది.

ఆపరేషనల్ సౌలభ్యం: ఆపరేషన్ సిందూర్ వంటి కార్యకలాపాల్లో LoC దాటకుండా శత్రు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ మిస్సైల్ భారతదేశానికి రణనీతి పరంగా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది.

మేక్ ఇన్ ఇండియా: రష్యా ఈ మిస్సైల్‌ను భారతదేశంలో తయారు చేయాలని ప్రతిపాదించింది, ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం కింద స్వావలంబన రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లేదా మరేదైనా రక్షణ రంగ సంస్థ ఈ తయారీలో భాగస్వామ్యం కావచ్చు. దీనివల్ల సాంకేతిక నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.

రష్యా-భారత సంబంధాలు: ఈ ఒప్పందం భారత్-రష్యా రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది.

Su-30MKI అప్‌గ్రేడ్

R-37M పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి Su-30MKI విమానాల రాడార్ (ప్రస్తుత Bars రాడార్), ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫైటర్‌జెట్‌లకు 400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం అవసరం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పరీక్ష:

R-37M రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో విజయవంతంగా పరీక్షించబడింది. Su-35S, Su-30SM2, MiG-31BM విమానాల నుంచి ఈ మిస్సైల్ను రష్యా ప్రయోగించింది. 2024లో 213 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ MiG-29ని కూల్చినట్లు నివేదికలు వెల్లడించాయి. యుద్ధంలో ప్రయోగించి పరీక్షించిన ఆయుధం కావడంతో వాస్తవ పనితీరును నిరూపితమైంది.

మొత్తంగా R-37M మిస్సైల్ భారత వైమానిక దళానికి అత్యాధునిక దాడి సామర్థ్యాన్ని, యుద్ధరంగ ఆధిపత్యాన్ని అందిస్తుంది. దీని హైపర్‌సోనిక్ వేగం, లాంగ్ రేంజ్ సామర్థ్యం, అధునాతన గైడెన్స్ సిస్టమ్ శత్రు విమానాలను దూరం నుంచే నాశనం చేయడంలో అపూర్వమైన సామర్థ్యాన్ని ఇస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద ఈ మిస్సైల్ తయారీ స్థానిక రక్షణ ఉత్పత్తిని బలోపేతం చేస్తుంది, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలను అందిస్తుంది. పాకిస్తాన్, చైనా వంటి ప్రత్యర్థులతో పోటీలో ఈ మిస్సైల్ భారతదేశాన్ని గణనీయమైన ఆధిక్యతలో నిలబెడుతుంది, జాతీయ భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us