ఆండ్రాయిడ్ ఫోన్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఇలా చేస్తే ఈజీగా అన్‌లాక్
Unlock Android Phone Password .. తొందరపాటులో కొత్త పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్ సెట్ చేసి దానిని మర్చిపోవడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్యే. కొన్ని సార్లు పిల్లలు ఫోన్‌తో ఆడుకుంటూ తప్పు పాస్‌వర్డ్స్ ఎంటర్ చేసి ఫోన్‌ను లాక్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడి సర్వీస్ సెంటర్‌కు పరుగెత్తుతుంటాము. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మీ ఫోన్‌ను ఇంటి నుంచే అన్‌లాక్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్ మర్చిపోయినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరి సహాయం లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా అన్‌లాక్ చేయడానికి కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని మీ సమస్యను నిమిషాల్లో పరిష్కరించుకోండి.
గూగుల్ ఫైండ్ మై డివైస్
లాక్ చేసిన ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్‌లో ఉన్నట్లయితే గూగుల్ అందించే “Find My Device” టూల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా మరొక ఫోన్ లేదా కంప్యూటర్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి [google.com/android/find](https://www.google.com/search?q=https%3A%2F%2Fgoogle.com%2Fandroid%2Ffind) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. లాక్ చేసిన ఫోన్లో ఏ గూగుల్ అకౌంట్ అయితే ఉందో, అదే అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. స్క్రీన్‌పై డివైస్ లొకేషన్‌తో పాటు కొన్ని ఆప్షన్‌లు కనిపిస్తాయి.
అందులో ‘ఎరేస్ డివైస్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోన్‌లోని డేటాతో పాటు లాక్ స్క్రీన్ పూర్తిగా తొలగిపోతుంది. ఆటోమేటిక్‌గా ఫోన్ రీస్టార్ట్ అయి కొత్త ఫోన్ లాగా ఓపెన్ అవుతుంది. మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే కంపెనీ ప్రత్యేకంగా ‘SmartThings Find’ ఫీచర్‌ను అందిస్తుంది. వేరే పరికరంలో బ్రౌజర్ ఓపెన్ చేసి smartthingsfind.samsung.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి. శాంసంగ్ అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వాలి. డాష్‌బోర్డ్‌లో లభించే ‘అన్‌లాక్’ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఫోన్ లాక్ స్క్రీన్‌ను రిమోట్‌గా తొలగించి మళ్లీ వాడుకోవచ్చు.
రికవరీ మోడ్ ద్వారా ఫ్యాక్టరీ రీసెట్
పైన చెప్పిన పద్ధతులు పని చేయకపోతే లేదా ఫోన్ ఇంటర్నెట్ ఆఫ్‌లో ఉంటే చివరి మార్గంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఫోన్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాలి. స్క్రీన్‌పై కంపెనీ లోగో కనిపించే వరకు పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ లేదా వాల్యూమ్ అప్ బటన్‌ను ఒకేసారి నొక్కి పట్టుకోవాలి. లోగో రాగానే బటన్లు వదిలేస్తే రికవరీ మెనూ వస్తుంది. ఇక్కడ టచ్ పని చేయదు కాబట్టి వాల్యూమ్ బటన్లతో పైకి కిందకి వెళ్ళి, ‘Wipe data/factory reset’ ఆప్షన్‌ను పవర్ బటన్‌తో సెలక్ట్ చేయాలి.
కొన్ని నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఫార్మాట్ చేసి అన్‌లాక్ అవుతుంది. ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు పూర్తిగా డిలీట్ అవుతాయి. రీసెట్ అయిన తర్వాత ఫోన్ ఆన్ అయ్యేటప్పుడు గతంలో వాడిన అదే గూగుల్ అకౌంట్ వివరాలు అడుగుతుంది కాబట్టి వాటిని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆండ్రాయిడ్ ఫోన్ పాస్‌వర్డ్ మర్చిపోవడం పెద్ద సమస్యే అయినప్పటికీ సరైన టెక్నిక్స్ ఫాలో అయితే నిమిషాల్లో పరిష్కరించుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది రాకుండా పాస్‌వర్డ్స్‌ను ఎక్కడైనా సేఫ్‌గా నోట్ చేసి పెట్టుకోవడం మంచిది.
