AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blue Ghost: చంద్రుడిపై సేప్‌గా ల్యాండైన బ్లూ ఘోస్ట్‌! చరిత్రలో ఇదే తొలిసారి..

అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థ తమ బ్లూ ఘోస్ట్ లూనార్ ల్యాండర్‌ను చంద్రుడిపై విజయవంతంగా దింపి చరిత్ర సృష్టించింది. ఇది చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయిన తొలి ప్రైవేట్ ల్యాండర్. నాసాకు చెందిన పరిశోధన పరికరాలతో, చంద్రుడి ఉపరితలంపై విస్తృతమైన పరిశోధనలు చేయనుంది. ఈ విజయం ప్రైవేట్ సంస్థలకు అంతరిక్ష పరిశోధనల్లో కీలక మలుపు.

Blue Ghost: చంద్రుడిపై సేప్‌గా ల్యాండైన బ్లూ ఘోస్ట్‌! చరిత్రలో ఇదే తొలిసారి..
Blue Ghost
SN Pasha
|

Updated on: Mar 03, 2025 | 9:06 AM

Share

చంద్రుడిపై చేసే ప్రయోగాల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చరిత్రలో తొలిసారి ఓ ప్రైవేట్‌ సంస్థ తమ ల్యాండర్‌ను విజయవంతంగా చంద్రుడిపై దింపింది. గతంలో ఇతర పలు ప్రైవేట్‌ సంస్థలు చంద్రుడిపై ల్యాండర్‌ను సేఫ్‌గా దింపడంలో విఫలం అయ్యారు. చివరి దశలో అవి కూలిపోవడమో, పక్కకు ఓరిగిపోవడమే జరిగేవి. కానీ, అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. బ్లూ ఘోస్ట్ అనే లూనార్ ల్యాండర్‌ను ఆదివారం జాబిల్లి ఉపరితలంపై సక్సెస్‌ఫుల్‌, సరైన స్థితిలో దించింది. చంద్రుడిపై కూలిపోకుండా, పడిపోకుండా సరిగ్గా ల్యాండర్ ను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ నిలిచింది. ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ అనే ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ప్రయోగించిన మరో ల్యాండర్‌ ఎథెనా గురువారం చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుంది.

అయితే, అది చంద్రుడి దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల పరిధిలో ల్యాండ్‌ కానుంది. ఆ సంస్థ గత ఏడాది ఫిబ్రవరి 22న ఒడిసస్‌ ల్యాండర్‌ను చందమామపై దించి, ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థగా చరిత్ర సృష్టించింది. కానీ, ల్యాండింగ్‌ టైంలో టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా కిందపడిపోయింది. ఈ బ్లూ ఘోస్ట్‌ ల్యాండర్‌ నాసాకు చెందిన 10 శాస్త్ర, సాంకేతిక పరికరాలతో ఆదివారం చందమామపై అడుగుపెట్టింది. దాదాపు 6.6 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పున ఉండే ఈ ల్యాండర్‌ను జనవరి 15న ఫ్లోరిడాలోని కేప్‌కెనవరాల్‌ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఎలాన్ మస్క్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌, బ్లూ ఘోస్ట్‌తో పాటు జపాన్‌కు చెందిన మరో ల్యాండర్‌ హకుటో ఆర్‌2 కూడా నింగిలోకి మోసుకెళ్లింది. వీటిలో బ్లూ ఘోస్ట్‌ చందమామపై నిర్ణీత ల్యాండింగ్‌ సైట్‌కు 328 అడుగుల పరిధిలోనే ఇది ల్యాండ్‌ అయినట్టు ఫైర్‌ఫ్లై సంస్థ వెల్లడించింది.

చంద్రుడిపై దిగిన అరగంటలోనే బ్లూ ఘోస్ట్‌ అక్కడి చిత్రాలు తీసి భూమికి పంపడం ప్రారంభించింది. బ్లూఘోస్ట్‌ ద్వారా చంద్రుడిపైకి 10 పరికరాలను పంపడానికి నాసా 101 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపుగా రూ.883.45 కోట్లు, వాటి తయారీకి 44 మిలియన్‌ డాలర్లు (రూ.385 కోట్లు) ఖర్చు చేసింది. ఆ పరికరాలతో చంద్రుడిపై బ్లూ ఘోస్ట్‌ 15 రోజులుపాటు ప్రయోగాలు చేయనుంది. చంద్రుడి ధూళిని సేకరించేందుకు వాక్యూమ్‌ వినియోగం, చంద్రుడి ఉపరితలం కింద ఉష్ణోగ్రతలను కొలవడానికి డ్రిల్లింగ్‌ చేయడం, వ్యోమగాముల స్పేస్‌సూట్‌లు, పరికరాలకు అంటుకునే హనికరమైన ధూళిని తొలగించే మరో పరికరాన్ని కూడా ఇందులో అమర్చారు. చంద్రుడిపై మానవ మనుగడకు, అంతరిక్ష యాత్రకు ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఫైర్‌ ప్లై ఏరోస్పేస్‌ సంస్థ ఈ ప్రయోగం చేపట్టింది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.