డిజిటల్ హ్యుమన్స్ నియంత్రణకు చైనా చర్యలు! అసలేంటి వీటి కథ?
AI వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో, చైనా CAC డిజిటల్ మానవుల వినియోగంపై కొత్త నియంత్రణలను విడుదల చేసింది. భద్రత, నైతికత, వినియోగదారుల రక్షణ లక్ష్యంగా ఈ నిబంధనలు రూపొందించబడ్డాయి. డిజిటల్ హ్యూమన్‌కు స్పష్టమైన లేబులింగ్, మైనర్లతో సంబంధాలపై నిషేధం, వ్యక్తిగత డేటా రక్షణ, అభ్యంతరకర కంటెంట్ నివారణ వంటివి వీటిలో ప్రధానం.

ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో డిజిటల్ హ్యుమన్స్ వినియోగంపై నియంత్రణను కట్టుదిట్టం చేయడానికి CAC(సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా) కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో వర్చువల్ హ్యుమన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, నైతికత, వినియోగదారుల రక్షణ లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ముసాయిదా ప్రకారం ప్రతి డిజిటల్ హ్యామన్ కంటెంట్‌పై స్పష్టమైన డిజిటల్ హ్యుమన్స్ లేబుల్ ఉండటం తప్పనిసరి. వినియోగదారులు ఇది నిజమైన వ్యక్తి కాదని వెంటనే గుర్తించేందుకు ఈ నిబంధనను తీసుకొచ్చారు. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లలతో వర్చువల్ సన్నిహిత సంబంధాలు ఏర్పరచే విధంగా డిజిటల్ హ్యూమన్స్‌ను ఉపయోగించడం పూర్తిగా నిషేధించారు.
ఇంకా వ్యక్తుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారం ఆధారంగా డిజిటల్ మానవులను సృష్టించడం కూడా నేరంగా పరిగణించబడుతుంది. అలాగే, గుర్తింపు ధృవీకరణ (ID వెరిఫికేషన్) వ్యవస్థలను మోసం చేయడానికి వర్చువల్ హ్యూమన్స్‌ను ఉపయోగించడం కఠినంగా నిషేధించబడింది. దేశ భద్రత, సామాజిక సమగ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం, వేర్పాటువాదం, జాతి విద్వేషం వంటి కంటెంట్‌ను డిజిటల్ మానవులు వ్యాప్తి చేయడాన్ని కూడా ఈ నిబంధనలు నిరోధిస్తున్నాయి. అదేవిధంగా, లైంగిక, హింసాత్మక లేదా భయానక కంటెంట్‌ను నియంత్రించాల్సిన బాధ్యత సేవా ప్రదాతలపై ఉంటుంది.
వినియోగదారుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆత్మహత్య లేదా స్వీయ హానిపై సంకేతాలు కనిపించినప్పుడు జోక్యం చేసుకోవాలని కూడా కంపెనీలను సూచించారు. ఈ ముసాయిదా నిబంధనలు చైనా ప్రభుత్వం AI రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, దాని వినియోగంపై కట్టుదిట్టమైన నియంత్రణను కొనసాగించాలనే ద్వంద్వ విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భద్రత, పారదర్శకత, నైతిక ప్రమాణాలను స్థాపించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా పేర్కొనబడింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
