NASA: సౌర వ్యవస్థ వెలుపల 5000 గ్రహాలలో జీవం ఆనవాళ్లు.. అచ్చం భూమిలా ఎన్నున్నాయో తెలుసా?
తాజాగా మరో 65 గ్రహాలను కనుగొన్నట్లు నాసా పేర్కొంది. దీంతో సౌర వ్యవస్థతో పాటు అంతరిక్షంలో జీవం ఉండే గ్రహాల సంఖ్య 5000లకు చేరినట్లు నాసా వెల్లడించింది. ఇందులో దాదాపు
భూమి(Earth) కాకుండా ఈ విశ్వంలో జీవం ఉన్న గ్రహం మరొకటి ఉందా? అనే ప్రశ్న మన మదిలో మెదులుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానంగా, అనేక దేశాలు గ్రహాంతరవాసుల గురించి నిరంతరం పరిశోధన చేస్తూనే ఉన్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA) చేసిన కొన్ని ప్రయత్నాలు ఇప్పటికే కొంతమేర సమాధానాలు దొరికినా.. మరెన్నో ప్రశ్నలు ఇంకా అలానే ఉన్నాయి. అయితే, ఇన్నేళ్ల నాసా ప్రయాణంలో ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. తాజాగా మరో 65 గ్రహాలను కనుగొన్నట్లు నాసా పేర్కొంది. దీంతో సౌర వ్యవస్థతో పాటు అంతరిక్షంలో జీవం ఉండే గ్రహాల సంఖ్య 5000లకు చేరినట్లు నాసా వెల్లడించింది. ఇందులో దాదాపు 200 గ్రహాలు భూమిని పోలి ఉన్నాయని తెలిపింది. ఇటీవల ధృవీకరించిన ఎక్సోప్లానెట్ పేరును K-2-377 bగా నిర్ధారించింది. ఇది ‘సూపర్ ఎర్త్’ అని కూడా పేర్కొంది. దీని నక్షత్రం ఒక కక్ష్యను పూర్తి చేయడానికి 12.8 రోజులు పడుతుందని వెల్లడించింది. ఈ గ్రహాలను నాసా ఎక్సోప్లానెట్ ఆర్కైవ్‌లో ఉంచారు. ఆర్కైవ్ హెడ్, జెస్సీ క్రిస్టియన్‌సెన్ మాట్లాడుతూ, “ఇది చాలా ఉత్తేజకరమైనది. మేం దాని గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని పేర్కొంది.
ఎక్సోప్లానెట్స్ మన సౌర వ్యవస్థ వెలుపల ఏర్పడతాయి. అవి సూర్యుని చుట్టూ కాకుండా వేరే నక్షత్రాల చుట్టూ తిరుగుతుంటాయి. దీనికి ముందు కూడా NASA 90 లలో సుమారు 3000 ఎక్సోప్లానెట్‌లను కనుగొంది.
సౌర వ్యవస్థ లేదా గెలాక్సీ వెలుపల ఉన్న అన్ని గ్రహాలను ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TES) సహాయంతో NASA గుర్తించింది. ఈ గ్రహాలన్నీ మన సౌర వ్యవస్థ లేదా గెలాక్సీ వెలుపల ఉన్నాయి. అందుకే వీటిని ఎక్సోప్లానెట్స్ అని పిలుస్తారు. ఇవన్నీ TESS సహాయంతో కనుగొన్నవే. కాబట్టి, వాటిని TESS ఆబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అని కూడా అంటారు. కాగా, వీటి గురించి లోతైన పరిశోధన చేసేందుకు 20271లో నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్‌ను నాసా ప్రయోగించనుంది.
35 శాతం నెప్ట్యూన్ లాంటి గ్రహాలే..
ఇప్పటి వరకు కనుగొన్న 5000 గ్రహాలలో 30 శాతం ఎక్సోప్లానెట్‌లు గ్యాస్ గ్లేట్‌లు కాగా, 31శాతం సూపర్ ఎర్త్‌లు, 35 శాతం నెప్ట్యూన్ లాంటి గ్రహాలు ఉన్నాయని నాసా తెలిపింది. భూమి లేదా మార్స్ వంటి రాతి గ్రహాలు కేవలం 4 శాతం మాత్రమే ఉన్నాయని పేర్కొంది. వీటి గురించి మరింత పరిశోధించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2029లో ఏరియల్ మిషన్‌ను ప్రారంభించనుంది.