
Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ ప్రారంభానికి ఇంకా రెండు వారాలు కూడా లేదు. ఈ కబడ్డీ టోర్నీ డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని ‘ది ఎరీనా బై ట్రాన్స్‌స్టాడియా’లో జరగనుంది.
ఈ సీజన్‌లో లీగ్ దశలో 12 జట్ల మధ్య మొత్తం 132 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పోటీ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు కొనసాగుతుంది. అంటే మూడు నెలల పాటు కబడ్డీ కూతలతో దేశం మార్మోగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ 12 నగరాల్లో జరగనున్నాయి. అన్ని బృందాలు ఒక్కో నగరంలో తలో 6 రోజుల పాటు ఉంటాయి. మొదటి 6 రోజులు అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆపై బెంగళూరు, పూణే, చెన్నై, నోయిడా, ముంబై, జైపూర్, హైదరాబాద్, పాట్నా, ఆపై ఢిల్లీ, కోల్‌కతాలో గేమ్‌లు కొనసాగనున్నాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం ప్లేఆఫ్‌లు, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని, షెడ్యూల్‌ను తర్వాత వెల్లడిస్తామని నిర్వాహుకులు తెలిపారు.
ఈసారి ఒక రోజులో రెండు మ్యాచ్‌లకు మించి ఆడకూడదు. రెండు మ్యాచ్‌లు జరగాల్సిన రోజు మొదటి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి ఆరు రోజుల తర్వాత విశ్రాంతి రోజు ఉంటుంది. అన్ని జట్లు ఒక నగరం నుంచి మరొక నగరానికి మారడమే దీనికి కారణం.
కబడ్డీ ప్రేమికులు ఈ మ్యాచ్‌లను స్టేడియానికి వెళ్లి చూడటమే కాకుండా ఇంట్లో టీవీలోనూ, యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించగలరు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రో కబడ్డీ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అదే సమయంలో, డిస్నీ + హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..