Fact Check : ఏంటి నిజమా.. రొనాల్డో ఆఖరి మ్యాచ్ చూసేందుకు డల్లాస్ స్టేడియానికి కోహ్లీ, ధోనీ వెళ్లారా?
Fact Check : క్రిస్టియానో రొనాల్డో చివరి వరల్డ్ కప్ మ్యాచ్‌ను చూసేందుకు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ డల్లాస్ స్టేడియానికి వెళ్లారంటూ వైరల్ అవుతున్న ఫోటో పూర్తిగా ఫేక్. దీనికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.

Fact Check : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు చెందిన పోర్చుగల్ జట్టు టోర్నమెంట్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించింది. మంగళవారం (జూలై 07) జరిగిన రౌండ్ ఆఫ్ 16 ఉత్కంఠభరిత పోరులో స్పెయిన్ చేతిలో 0-1 తేడాతో పోర్చుగల్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్, రొనాల్డో కెరీర్‌లో ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ కావడం గమనార్హం. అయితే ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా స్టేడియానికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త, దానికి సంబంధించిన ఫోటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న ఆ వైరల్ అవుతున్న ఫోటోను చూస్తే ఎవరైనా సరే నిజమేనని నమ్ముతారు. ఆ చిత్రంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఇద్దరూ స్టేడియం స్టాండ్స్‌లో పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఆ ఫోటో ఒక మూలలో అప్పటి పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్ మ్యాచ్ లైవ్ స్కోరింగ్ బోర్డు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దాని పక్కనే ఉన్న టైమర్ ప్రకారం అప్పటికి మ్యాచ్ ప్రారంభమై 13 నిమిషాల 33 సెకన్ల ఆట పూర్తయినట్లు చూపిస్తోంది. ఏదో ఒక లైవ్ వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసినట్లుగా ఉన్న ఈ ఫోటోకు “విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ కలిసి స్పెయిన్ వర్సెస్ పోర్చుగల్ మ్యాచ్ చూస్తున్నారు.. క్రిస్టియానో రొనాల్డోను ఉత్సాహపరుస్తున్నారు” అనే క్యాప్షన్ పెట్టి నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
మరి ఇంతలా హల్ చల్ చేస్తున్న ఈ వైరల్ ఫోటో వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ ఫోటోలో ఎలాంటి నిజం లేదు, ఇది ముమ్మాటికీ ఫేక్ ఫోటో. కోహ్లీ కానీ, ధోనీ కానీ తాము ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లినట్లు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు, అలాగే వారి సోషల్ మీడియా ఖాతాలలోనూ ఎలాంటి పోస్టులు పెట్టలేదు. అసలు విషయానికి వస్తే, ధోనీ ఈరోజు తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ త్వరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా ఉన్నారు. కాబట్టి వారు డల్లాస్ స్టేడియానికి వెళ్లే అవకాశమే లేదు. టెక్నాలజీని ఉపయోగించి ఎవరో ఆకతాయిలు సృష్టించిన ఈ మార్ఫింగ్ ఫోటోకు ఎలాంటి అధికారిక ఆధారం లేదు.
ఈ మ్యాచ్ ఫలితంతో రొనాల్డో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌లో ఇదే ఆఖరి ప్రపంచకప్. తన సుదీర్ఘ ఫుట్‌బాల్ కెరీర్‌లో ఆయన ఆరోసారి వరల్డ్ కప్‌లో భాగస్వామ్యమయ్యాడు. స్పెయిన్‌తో మ్యాచ్ జరగడానికి ముందే రొనాల్డో స్వయంగా ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని అధికారికంగా ప్రకటించాడు. దాంతో స్పెయిన్ చేతిలో ఓటమి తర్వాత రొనాల్డో తన కెరీర్ లోని చివరి వరల్డ్ కప్ మ్యాచ్‌ను ఆడేసినట్లయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తన కెరీర్‌లో ఒక్కసారి కూడా ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడలేకపోయిన దురదృష్టకర ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో మిగిలిపోవడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
