AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: అంపైర్ల పట్ల గౌరవమే ఉండదు.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేసిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్..

India vs England: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టార్గె్ట్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ తీవ్ర విమర్శలు చేశాడు. అంపైర్ల పట్ల..

India vs England: అంపైర్ల పట్ల గౌరవమే ఉండదు.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేసిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్..
Virat Kohli
Shiva Prajapati
|

Updated on: Mar 25, 2021 | 1:51 AM

Share

India vs England: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టార్గె్ట్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ తీవ్ర విమర్శలు చేశాడు. అంపైర్ల పట్ల కోహ్లీ దురుసుగా ప్రవర్తిస్తాడంటూ దుయ్యబట్టాడు. అనేక సార్లు కోహ్లీ, అంపైర్లను అగౌరవపరిచాడని ఆరోపించాడు. టీ20 సిరీస్‌‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ అవుట్‌కు కారణమైన డేవిడ్ మలాన్ వివాదాస్పద క్యాచ్‌పై విరాట్ కోహ్లీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ క్యాచ్ సరైంది కాదని, ‘సాఫ్ట్ సిగ్నల్’ ఇవ్వాల్సిందిగా అంపైర్లకు కోహ్లీ సూచించాడు. ఈ క్రమంలోనే అంపైర్.. ఓవైపు సూర్యకుమార్‌ను అవుట్‌గా పరిగణిస్తూనే మరోవైపు థర్డ్ అంపైర్‌కు నివేదించాడు.

ఆ మ్యాచ్‌లో కోహ్లీ అంపైర్‌కు చేసిన సూచన మొదలు.. ఇప్పటి వరకు అతను చేసిన కామెంట్స్‌ని ఉటంకిస్తూ లాయిడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ నితిన్ మీనన్‌పై ఇంగ్లాండ్ టీమ్ ఒత్తిడి తెచ్చిందో లేదో నాకు తెలియదు కానీ.. ఒక విషయం మాత్రం తెలుసు. ఈ సిరీస్ మొత్తంలో కోహ్లీ అంపైర్లపై ఒత్తిడి చేయడాన్ని క్షుణ్ణంగా గమనించాను. అంపైర్లపై ఒత్తిడి చేయడం, వారిని అగౌరవపరచడం, వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రివ్యూలు కోరడాన్ని స్పష్టంగా గమనించాను’ అని లాయిడ్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. అలాగే.. ‘భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో అంపైర్‌ కాల్‌ను డెసిషన్‌ రివ్యూ సిస్టమ్ నుంచి తొలగించాలని విరాట్ కోరాడు. అలాగే బంతి స్టంప్స్ ఏ భాగం తాకినా ఔట్‌గా పరిగణించాలని డిమాండ్ చేశాడు. ఇది అసలు సరైన పద్ధతే కాదు.’ అని లాయిడ్ పేర్కొన్నాడు. ‘పరిస్థితులను గమనిస్తే.. విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. కోహ్లీ చెప్పినట్లు బంతి కేవలం బెయిల్స్‌కి తగలడం మొదలు ప్రతీది ఔట్‌గానే పరిగణిస్తే.. ఇక అన్ని టెస్ట్ మ్యాచ్‌లు రెండు రోజుల్లో ముగుస్తాయి. అలాగే వన్డే మ్యాచ్‌లు నాలుగు గంటల్లోనే కంప్లీట్ అవుతాయి’ అని లాయిడ్ వ్యాఖ్యానించాడు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ తన మాటల్లో, చేతల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం అని లాయిడ్ హితవు చెప్పాడు.

‘ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంపైర్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంపైర్లకు పసుపు మరియు ఎరుపు కార్డు స్టాంప్‌లు ఇవ్వాలి. ప్రస్తుతం అంపైర్లు ఎలాంటి అధికారం లేనివారుగా కనిపిస్తున్నారు. ఈ కార్డ్స్ ఇవ్వడం ద్వారా వారి పవర్‌ను మరింత పెంచినట్లు అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్లు అణగదొక్కబడుతున్నారు. వారిని కేవలం కీలు బొమ్మలుగా భావిస్తూ ఆటగాళ్లు సైతం రెచ్చిపోతున్నారు’ అని లాయిడ్ వ్యాఖ్యానించాడు.

అసలు ‘సాఫ్ట్ సిగ్నల్’ అంటే ఏంటి? నాలుగో టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ ఆడిన షాట్‌ను మలాన్ క్యాచ్‌ పట్టాడు. అయితే ఆ బంతి పిచ్‌న్ తాకినట్లుగా కనిపించింది. టీవీల ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికీ అది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, అంపైర్‌కు మాత్రం నాటౌట్ అనిపించలేదు. ఔట్‌గానే పరిగణించాడు. అయితే, క్యాచ్‌పై అనుమానంతో.. ఓవైపు థర్డ్ అంపైర్‌ను కోరుతూనే.. మరోవైపు తన నిర్ణయాన్ని ‘అవుట్’గా ప్రకటించాడు. ఏకకాలంలో ఇలా చేయడాన్నే ‘సాఫ్ట్ సిగ్నల్’ అంటారు. కాగా, థర్డ్ అంపైర్ వరుసగా రీప్లేలు చూసినా.. స్పష్టత లేకపోవడంతో ఫీల్ట్ అంపైర్ నిర్ణయమే ఫైనల్ అయ్యింది.

Also read:

పాలనా రాజధానిపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్.. కొత్త హంగులు దిద్దుకుంటున్న విశాఖ.. అభివృద్ధి పరుగులు పెట్టాలన్న సీఎం జగన్

HAL Recruitment 2021: హిందుస్తాన్ ఏరోనాటికల్‌లో భారీగా ఉద్యోగాలు.. ప్రారంభ జీతమే రూ. 40 వేలు.. మీరు దరఖాస్తు చేసుకున్నారా?