భారత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇంతకాలం కోహ్లీ ని కెప్టెన్ గా కొనసాగించడం ఎక్కువ అని అతను పేర్కొన్నాడు. ఐపీఎల్ 11 సీజన్ల లో కోహ్లీ ఎనిమిది సీజన్లకు ఆర్‌సీబీకి కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేకపోయాడు.
ఇకపోతే ప్రతీ సీజన్ ఆరంభంలో చక్కటి ప్రదర్శన తో రాణించడం.. చివరి దశకు చేరుకోగానే చెత్త ప్రదర్శన చేయడం ఆర్‌సీబీకి అలవాటు గా మారింది. 2015 లో ఫైనల్స్ కు చేరినా.. ట్రోఫీ అందుకోలేకపోయింది. కోహ్లీ కెప్టెన్సీ లో 96 మ్యాచులు ఆడిన ఆర్‌సీబీ కేవలం 44 మ్యాచులు మాత్రమే విజయం సాధించింది. కాగా కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఆర్‌సీబీ ఇప్పటివరకు ట్రోఫీ అందుకోలేకపోయిందని గంభీర్ పేర్కొన్నాడు. ‘కోహ్లీ తెలివైన కెప్టెన్ అని నేను అనుకోను. కెప్టెన్ గా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ట్రోఫీ గెలిస్తేనే అతను కెప్టెన్ గా సక్సెస్ అయినట్లు. ధోని, రోహిత్ లాంటి వాళ్ళు ఇప్పటికే మూడు సార్లు ట్రోఫీ గెలిచారు. వారితో కోహ్లీని పోల్చవద్దు. అతన్ని కెప్టెన్ గా కొనసాగించడమే గొప్ప విషయం’. అని గంభీర్ అన్నాడు.