కరోనాతో మాజీ క్రికెటర్ మృతి.. ఫ్లాస్మా థెరపీ చేసినా..
కరోనా వైరస్ బారిన పడి ఢిల్లీ మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్(53) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన మృతి చెందినట్లు సంజయ్ అత్యంత స్నేహితుడు తెలిపారు.
కరోనా వైరస్ బారిన పడి ఢిల్లీ మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్(53) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన మృతి చెందినట్లు సంజయ్ అత్యంత స్నేహితుడు తెలిపారు. కాగా క్లబ్ క్రికెట్‌లో మంచి పేరును సాధించిన సంజయ్.. ఢిల్లీ అండర్-23 జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్‌గా కూడా పనిచేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే సంజయ్ కరోనా బారిన పడ్డారు. ఇక ఆదివారం ఆయన పరిస్థితి విషమించగా.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అలాగే ప్లాస్మా థెరపీ చేయించినా ఫలితం లేకుండా పోయిందని సంజయ్ సన్నిహితులు తెలిపారు. ఇక సంజయ్ మృతిపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన అకాల మరణం తీవ్ర కలవరపాటుకు గురిచేసిందని డీడీసీఏ సెక్రటరీ వినోద్ తిహారా అన్నారు.
అయితే రంజీ ట్రోఫీ ఆడిన అనుభవం లేకపోయినా.. సంజయ్‌కి జూనియర్ క్రికెటర్లతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌తో సంజయ్‌కు మంచి అనుబంధం ఉండేది. ఇక సంజయ్ కరోనా బారిన పడ్డారని తెలుసుకున్న గంభీర్ ప్లాస్మా థెరపీ కోసం ట్విట్టర్‌లో అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్‌కు ప్లాస్మా థెరపీ కూడా చేశారు. కాగా సంజయ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సిదాంత్ రాజస్థాన్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతుండగా, చిన్న కుమారుడు ఎకాన్ష్ అండర్-23 జట్టులో ఢిల్లీ తరుఫున ఆడుతున్నారు.