AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : 5 ప్రపంచకప్‌లు.. 5 సార్లు గోల్స్.. చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే

FIFA World Cup 2026 : ఐదు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఏకైక ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో. 2026 ప్రపంచకప్‌ను తన చివరి టోర్నీగా భావిస్తున్న పోర్చుగల్ దిగ్గజం, ఎన్నో రికార్డుల మధ్య మిగిలిన వరల్డ్ కప్ ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

FIFA World Cup 2026 : 5 ప్రపంచకప్‌లు.. 5 సార్లు గోల్స్.. చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
Cristiano Ronaldo
Rakesh
|

Updated on: Jun 10, 2026 | 5:04 PM

Share

FIFA World Cup 2026 : ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఎందరో మహానుభావులు వచ్చారు, ఎన్నో రికార్డులు సృష్టించారు. కానీ పోర్చుగల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో సృష్టించిన కొన్ని అద్భుతాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఐదు వేర్వేరు టోర్నమెంట్లలో (2006 నుంచి 2022 వరకు) గోల్స్ సాధించిన ఏకైక పురుష ఆటగాడిగా రొనాల్డో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ అరుదైన ఘనత అతడిని ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలబెట్టింది.

రొనాల్డో తన ప్రపంచకప్ గోల్స్ ప్రయాణాన్ని 2006 లో జర్మనీ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ఇరాన్‌పై పెనాల్టీ ద్వారా ప్రారంభించాడు. ఆ తర్వాత 2010లో ఉత్తర కొరియాపై, 2014లో ఘనాపై కీలక గోల్స్ చేశాడు. ఇక 2018 రష్యా ప్రపంచకప్‌లో స్పెయిన్‌పై రొనాల్డో చేసిన హ్యాట్రిక్ గోల్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. ఆ టోర్నీలో అతను మొత్తం నాలుగు గోల్స్ కొట్టాడు. చివరగా 2022 కతార్ ప్రపంచకప్‌లో మళ్లీ ఘనాపై గోల్ సాధించి, ఐదు వేర్వేరు వరల్డ్ కప్‌లలో గోల్స్ చేసిన మొదటి ఫుట్‌బాలర్‌గా సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

రొనాల్డో ఇప్పటివరకు తన కెరీర్‌లో మొత్తం 22 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడి, 8 గోల్స్ చేశాడు. అయినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడలేకపోయాడు. వరల్డ్ కప్‌లో అతని జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2006లో నమోదైంది, అప్పుడు పోర్చుగల్ జట్టు సెమీఫైనల్స్ వరకు దూసుకెళ్లింది. ఆ తర్వాత జరిగిన టోర్నీలలో పోర్చుగల్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

ప్రపంచకప్ రికార్డుల విషయానికి వస్తే బ్రెజిల్ దిగ్గజం పెలే, అర్జెంటీనా లెజెండ్ డియెగో మారడోనా ఎప్పుడూ ముందంజలో ఉంటారు. పెలే తన కెరీర్‌లో నాలుగు ప్రపంచకప్‌లు ఆడి 12 గోల్స్ చేయడమే కాకుండా, మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మారడోనా 1986లో ఒంటరి పోరాటంతో అర్జెంటీనాకు కప్పు అందించడమే కాకుండా 21 మ్యాచ్‌ల్లో 8 గోల్స్ చేశాడు. రొనాల్డో వద్ద యూరో కప్, నేషన్స్ లీగ్ ట్రోఫీలు, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు ఉన్నప్పటికీ, పెలే, మారడోనాల లాగా వరల్డ్ కప్ ట్రోఫీ లేకపోవడం అతని కెరీర్‌లో ఒక పెద్ద వెలితిగా మిగిలిపోయింది.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌పైనే ఉంది. ప్రస్తుతం 41 ఏళ్ల వయసున్న రొనాల్డో తన ఆరో ప్రపంచకప్‌ బరిలోకి దిగాడు. దీనిని అతని కెరీర్‌లోనే చివరి ప్రపంచకప్‌గా భావిస్తుండటంతో, అభిమానులంతా దీనిని రొనాల్డో లాస్ట్ డాన్స్ అని పిలుచుకుంటున్నారు. ఈ టోర్నీలో గనుక రొనాల్డో గోల్ కొడితే, అత్యధిక వయసులో గోల్ చేసిన ఆటగాడిగా మరికొన్ని సరికొత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంటాడు. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి తన సుదీర్ఘ అద్భుతమైన కెరీర్‌ను సంపూర్ణంగా ముగించాలని రొనాల్డో పట్టుదలతో ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us