- Telugu News Sports News Cricket news Year Ender 2021: top moments in the sports all over the world, Neeraj Chopra, PV Sindhu, Kohli vs BCCI, Rohit Sharma
Year Ender 2021: ఒలింపిక్స్ నుంచి టీ20 ప్రపంచకప్ వరకు.. ప్రపంచ క్రీడల్లో కీలక ఘట్టాలు..!
Key Moments In Sports: గత 12 నెలల్లో ప్రపంచ క్రీడల్లో చోటు చేసుకున్న అత్యుత్తమ క్షణాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
Updated on: Dec 23, 2021 | 1:47 PM

Year Ender 2021: ఒకే ఒక్కడు..130 కోట్ల మందిలో ఒకే ఒక్కడు. భారతీయుల వందేళ్ల కలను సాకారం చేశాడు. భారత కీర్తి పతాకను విశ్వ వేదికపై రెపరెపలాడించాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో వండర్ క్రియేట్ చేశాడు. స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. ఎంతోమంది అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్‌పై ఆశలు రేపినా..చివరికి హర్యానా యువకుడు నీరజ్‌చోప్రా పసిడిని ముద్దాడి.. భారత్ గర్వించేలా చేశాడు. ఆటు పోట్లను ఎదుర్కొని..ఒబిసిటీని జయించి.. ఒలంపిక్స్‌లో మన పతకాల కరువును తీర్చేందుకు తన బరువును కరిగించుకుని....బరిలోకి దిగాడు. దిగడం దిగడంతోనే గోల్డ్ మెడల్ తన మెడలో వేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతాకం సాధించిన సందర్భంగా యావత్ భారతావని నీరజ్‌కు నీరాజనం పలికింది. అంతేకాదు.. జావెలిన్ త్రోయర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. 23ఏళ్ల నీరజ్ చోప్రా ఫైనల్లో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర పుటలకెక్కాడు.

అదే ఒలింపిక్స్‌లో మన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్యాన్ని గెల్చుకుంది. బంగారంతో తిరిగివస్తుందనుకున్నాం కానీ.. కొద్దిలో మిస్సయ్యింది. అయినప్పటికీ వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించడమన్నది మామూలు విషయం కాదు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు కొందరు అకతాయిలు. ఇలా రెండు సార్లు జరిగింది. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన తర్వాత ఆకతాయిల్ని స్టేడియం నుంచి బయటకు పంపించినా నాలుగో టెస్టులోనూ మళ్లీ అలాంటి ఘటనే రిపీట్ అయింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరిగిన నాలుగో టెస్ట్‌లో భారత ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌పై ఆస్ట్రేలియా అభిమానులు దురహంకార వ్యాఖ్యలు చేశారు. నాలుగో టెస్ట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని ఆస్ట్రేలియన్లు దూషించారు. సిరాజ్‌ను దూషిస్తూ పాటలు పాడటమే కాకుండా అనుచిత పదాలు వాడారని తెలిపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కరోనా కాస్త అడ్డు తగిలింది. ఇండియాలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో టోర్నీని సగంలో ఆపేశారు. మిగతా సగాన్ని ఎమిరేట్స్‌లో పూర్తి చేశారు. చెన్నై సూపర్స్ కింగ్స్ జట్టు నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

ఐపీఎల్–2021లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ ధోని.. లీగ్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన ధోని, ఐపీఎల్ సీఎస్‌కే జట్టు కెప్టెన్ నుంచి తప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చాడు. అతను కనీసం మరో సీజన్ జట్టు తరఫున ఆడుతున్నట్లు తెలిపాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున తాను ఆడే చివరి మ్యాచ్ వేదిక చెన్నైనే అవుతుందని ధోని వెల్లడించాడు. అయితే అది వచ్చే ఏడాదేనా లేక ఐదేళ్ల తర్వాతా అనేది చెప్పలేనని... కానీ ఎప్పుడు చెన్నైలో మ్యాచ్ జరిగినా తన రిటైర్‌మెంట్ అక్కడే ప్రకటిస్తానని వెల్లడించాడు.

బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. అయితే ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. ఏకంగా జట్టు నుంచే తప్పుకున్నాడు. అయితే, సదరు అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ఏ చివరి అవకాశం ఇవ్వడంతో అతను దిగొచ్చాడు. జట్టు సభ్యులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, తదుపరి మ్యాచ్‌లో మోకాలిపై నిల్చొని ఉద్యమానికి మద్దతు తెలుపుతానని అన్నాడు.

అప్పట్లో భారత హాకీ జట్టు చాలా అద్భుతంగా ఆడేదట! ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలుచుకుందట! ఒక తరం మొత్తం వింటూ వచ్చిన కథ ఇది. రికార్డు పుస్తకాల్లో, క్విజ్ పోటీల్లో, కొన్నేళ్ల తర్వాత గూగుల్ సెర్చ్‌లో... ఇలా అలనాటి ఘనత గురించి వినడమే తప్ప ఇండియా ఒలింపిక్ పతకం గెలవడం ఈ తరం చూడలేదు. కానీ ఒలింపిక్స్ గేమ్స్‌లో టీమిండియా మెన్స్ హాకీ జట్టు మాత్రం.. చరిత్ర పుటలను చింపుతూ.. మొన్నటి వరకు ఓ లెక్క ఇవాళ్టి నుంచి ఇంకో లెక్క అని రికార్డు బద్దలు కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా భారత పురుషుల హాకీ జట్టు 41ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడంచి కాంస్య పతకం గెలుచుకుంది.

ఇక టోక్యో ఒలంపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు పోరాటం.. చివరికి నిరాశగా ముగిసింది. కానీ బంగారంలాంటి ప్రదర్శనతో కోట్ల మంది మనసుల్ని గెలిచింది. కాంస్యం వీరి మెడలో ఎందుకు పడలేదు.? అనుకునేలా మన జట్టు పోరాడింది. అయితే కాంస్య పతాకం గెలుచుకోలేకపోయినా.. పోరాడి ఓడి ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది . ఇలా నాలుగో స్థానంకు రావడం ఇదే తొలిసారి. ఇక మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 3–4తో బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. భారత్ తరఫున గుర్జీత్ సింగ్ 25, 26వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా.. వందన కటారియా 29వ నిమిషంలో ఒక గోల్ చేశారు. కానీ బ్రిటన్ జట్టు అనూహ్యాంగా నాలుగు గోల్స్ చేసి, థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో 22ఏళ్లుగా జరగని సంఘటన భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసుకోవడం అందరికీ సాధ్యం కాదు.. ఇంగ్లండ్ ఆటగాడు జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొత్తం 19 వికెట్లు తీశాడు. ఓ ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసుకున్నాడు. ఈ ఘటన తర్వాత 43 ఏళ్లకు అంటే 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత ఆటగాడు అనిల్ కుంబ్లే ఈ ఘనతను పునరావృతం చేశాడు. 22ఏళ్ల తర్వాత డిసెంబర్ 2021లో న్యూజిలాండ్‌కు చెందిన అజాజ్ పటేల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాజిక్ చేశాడు. ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం పది మంది భారత బ్యాట్స్‌మెన్లను అవుట్ చేశాడు.




