AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : రోహిత్ తర్వాత భారత వన్డే కెప్టెన్ ఎవరు?  మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ సాధ్యమా?

గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ అనే అతని విధానం చర్చకు దారితీసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేలకు సారథిగా ఉన్నాడు. అతని తర్వాత వన్డేలకు బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌ను భవిష్యత్తు వన్డే కెప్టెన్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.

Team India : రోహిత్ తర్వాత భారత వన్డే కెప్టెన్ ఎవరు?  మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ సాధ్యమా?
Team India (4)
Rakesh
|

Updated on: Aug 21, 2025 | 10:32 AM

Share

Team India : గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ అనే అతని విధానం చర్చకు దారితీసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేలకు సారథిగా ఉన్నాడు. అతని తర్వాత వన్డేలకు ఎవరు కెప్టెన్ అవుతారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

వన్డే కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్

ప్రస్తుతానికి, బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌ను భవిష్యత్తు వన్డే కెప్టెన్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతని అద్భుత ప్రదర్శన, నిలకడైన బ్యాటింగ్ అతనికి ఈ అవకాశం కల్పించాయి. శ్రేయస్ 70 వన్డేల్లో 48.22 సగటుతో 2845 పరుగులు చేశాడు. 5 సెంచరీలు కూడా ఉన్నాయి. అతని నాయకత్వ లక్షణాలు, మిడిల్ ఓవర్లలో ఒత్తిడిని తట్టుకుని ఆడగల సామర్థ్యం సెలెక్టర్లను ఆకట్టుకున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు అతనే సారథిగా ఉండే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

శుభ్‌మన్ గిల్‌పై పనిభారం సమస్య

మరోవైపు, భారత క్రికెట్ భవిష్యత్తు కెప్టెన్‌గా భావించిన శుభ్‌మన్ గిల్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. గిల్ ఇప్పటికే టెస్టులకు సారథ్యం వహిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో కూడా వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతనిపై ఉన్న పనిభారం కారణంగా మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం సాధ్యం కాదని బీసీసీఐ భావిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండడం, ఒకే ఆటగాడిపై అన్ని ఫార్మాట్‌ల కెప్టెన్సీ భారం మోపడం వల్ల ఆటగాడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గంభీర్ వ్యూహం, వాస్తవ పరిస్థితులు

గౌతమ్ గంభీర్ మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమని అతనికి తెలుసు. ఒకే కెప్టెన్ ఉంటే జట్టులో ఒకే రకమైన సంస్కృతి, ప్రణాళికలు ఉంటాయని, అది విజయాలకు దోహదపడుతుందని అతను భావిస్తున్నాడు. అయితే, నిరంతర క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆ వ్యూహాన్ని అమలు చేయడం సులభం కాదు. అందుకే, ప్రస్తుతానికి వన్డేలకు శ్రేయస్ అయ్యర్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్లుగా కొనసాగే అవకాశం ఉంది.

రోహిత్ తర్వాతే నిర్ణయం

ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేలకు సారథ్యం వహిస్తున్నాడు. 38 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్, విరాట్ కోహ్లీతో కలిసి టెస్టులు, టీ20ల నుంచి వైదొలిగారు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ వీరిద్దరికీ చివరిది కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆసియా కప్ తర్వాత బీసీసీఐ రోహిత్‌తో అతని అంతర్జాతీయ భవిష్యత్తుపై చర్చించనుంది. ఒకవేళ రోహిత్ వన్డేలకు కూడా గుడ్ బై చెప్తే, శ్రేయస్ అయ్యర్‌కు వెంటనే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..