AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు! ప్రపంచ రికార్డు..

భారత మాజీ స్పిన్నర్ బాపు నాడ్కర్ణి టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించారు. 1964లో ఇంగ్లాండ్‌పై మద్రాస్ టెస్ట్‌లో వరుసగా 21 మెయిడెన్ ఓవర్లు వేశారు. 131 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆయన మొత్తం బౌలింగ్ గణాంకాలు 32 ఓవర్లు, 27 మెయిడెన్లు, 5 పరుగులు, 0 వికెట్లు. నాడ్కర్ణి కచ్చితత్వం క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.

మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు! ప్రపంచ రికార్డు..
R G Nadkarni
SN Pasha
|

Updated on: Aug 19, 2026 | 4:39 PM

Share

క్రికెట్‌లో బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు సాధించడం సాధారణమే. కానీ బౌలర్లు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా వరుసగా ఓవర్లు వేయడం అత్యంత అరుదు. అలాంటి అసాధారణ రికార్డును భారత మాజీ స్పిన్నర్ ఆర్.జి. నాడ్కర్ణి సృష్టించారు. టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వరుస మెయిడెన్ ఓవర్లు వేసిన ఘనత ఆయన పేరిట ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచింది.

నాసిక్‌లో పుట్టి..

మహారాష్ట్రలోని నాసిక్‌లో 1933 ఏప్రిల్ 4న జన్మించిన రమేశ్‌చంద్ర గోవింద్ నాడ్కర్ణి, భారత క్రికెట్‌లో అత్యంత కట్టుదిట్టమైన ఎడమచేతి వాటం స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. అభిమానులు ఆయనను ప్రేమగా బాపు నాడ్కర్ణి అని పిలిచేవారు. 1964లో మద్రాస్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో నాడ్కర్ణి తన బౌలింగ్‌తో సంచలనం సృష్టించారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వరుసగా 21 మెయిడెన్ ఓవర్లు వేశారు. అంటే వరుసగా 131 బంతులు వేసినా ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఆ సమయంలో ఇది ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

131 బంతుల్లో 0 పరుగులు..

నాడ్కర్ణి కంటే ముందు ఈ విభాగంలో 17 వరుస మెయిడెన్ ఓవర్ల రికార్డు ఉండేది. 1949లో సోమర్‌సెట్ తరఫున హెచ్.ఎల్. హేజెల్ ఈ ఘనత సాధించారు. 1955-56లో ఎం.సి.సి. తరఫున జి.ఏ.ఆర్. లాక్ కూడా 17 వరుస మెయిడెన్లు వేశారు. అయితే నాడ్కర్ణి 21 ఓవర్లతో వారిని అధిగమించారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అత్యధిక బంతులు వేసిన రికార్డు మాత్రం నాడ్కర్ణి పేరిట లేదు. 1956-57లో డర్బన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ హెచ్.జె. టేఫీల్డ్ 137 బంతులు ఒక్క పరుగు ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. నాడ్కర్ణి 131 బంతులతో ఆ రికార్డుకు కొద్దిదూరంలో నిలిచారు.

27 మెయిడెన్ ఓవర్లు..

ఆ మ్యాచ్‌లో నాడ్కర్ణి మరుసటి రోజు కూడా బౌలింగ్ కొనసాగించారు. మొత్తంగా ఆయన 32 ఓవర్లు వేయగా అందులో 27 మెయిడెన్లు ఉన్నాయి. 5 పరుగులు మాత్రమే ఇచ్చారు. బ్యాడ్ లక్ ఏంటంటే.. అంత అద్భుతంగా బౌలింగ్ చేసినా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఒక ఇన్నింగ్స్‌లో 25 లేదా అంతకంటే ఎక్కువ ఆరు బంతుల ఓవర్లు వేసి, 10 కంటే తక్కువ పరుగులు ఇచ్చిన అరుదైన ప్రదర్శనగా ఇది రికార్డుల్లో నిలిచింది. నాడ్కర్ణి కెరీర్ మొత్తం కూడా ఆయన నియంత్రణకు నిదర్శనం. టెస్ట్ క్రికెట్‌లో ఓవర్‌కు సగటున కేవలం 1.67 పరుగులు మాత్రమే ఇచ్చారు. పాకిస్థాన్‌తో జరిగిన 1960-61 సిరీస్‌లోనూ కాన్పూర్‌లో 32-24-23-0, ఢిల్లీలో 34-24-24-1 వంటి అద్భుత గణాంకాలు నమోదు చేశారు. భారత క్రికెట్‌లో అత్యంత పొదుపైన బౌలర్లలో ఒకరైన బాపు నాడ్కర్ణి 2020 జనవరి 17న ముంబైలో 86 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. అయితే 21 వరుస మెయిడెన్ ఓవర్ల రికార్డుతో ఆయన పేరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Follow Us