Virat Kohli : కోహ్లీకి 71వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రామ్‌కు పార్సిల్
Virat Kohli : వడోదర వన్డేలో కోహ్లీ కేవలం మ్యాచ్‌నే గెలిపించలేదు, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును కూడా దాటేశాడు. ఈ మ్యాచ్‌లో 93 పరుగులతో ఆకట్టుకున్న కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది

Virat Kohli : మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచే విరాట్ కోహ్లీ, నిజజీవితంలో మాత్రం చాలా సున్నిత మనస్కుడు. ముఖ్యంగా తన తల్లి పట్ల ఆయనకు ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 93 పరుగులతో ఆకట్టుకున్న కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తన అవార్డులన్నింటినీ ఏం చేస్తారో విరాట్ వెల్లడించిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ అనంతరం ప్రెజెంటర్ హర్షా భోగ్లే విరాట్‌ను సరదాగా ఒక ప్రశ్న అడిగారు. “విరాట్.. నీకు ఇప్పటికే 45 వన్డే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చాయి. వాటన్నింటినీ దాచుకోవడానికి నీ ఇంట్లో ఒక ప్రత్యేక గది కావాలేమో?” అని అడిగారు. దీనికి కోహ్లీ నవ్వుతూ చాలా ఎమోషనల్ సమాధానం ఇచ్చారు. “నేను నా అవార్డులన్నింటినీ గురుగ్రామ్‌లోని మా అమ్మ దగ్గరకు పంపించేస్తాను. ఆమెకు ఆ ట్రోఫీలను దాచుకోవడం అంటే చాలా ఇష్టం. నా విజయాలను చూసి ఆమె ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటుంది. అందుకే నా అవార్డులన్నీ ఆమె దగ్గరే భద్రంగా ఉంటాయి” అని కోహ్లీ చెప్పుకొచ్చారు.
వడోదర వన్డేలో కోహ్లీ కేవలం మ్యాచ్‌నే గెలిపించలేదు, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును కూడా దాటేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (34,357) మొదటి స్థానంలో ఉండగా, కోహ్లీ (28,068) రెండో స్థానానికి చేరుకున్నాడు. అలాగే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల విషయంలోనూ సచిన్ (76) తర్వాత కోహ్లీ (71) రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ రికార్డుకు కోహ్లీ కేవలం 5 అవార్డుల దూరంలోనే ఉండటం విశేషం.
కోహ్లీ కెరీర్ ప్రారంభంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, తల్లి నీడలో క్రమశిక్షణతో పెరిగి ఈ స్థాయికి చేరుకున్నారు. తన ప్రతి విజయానికి తల్లి ఆశీస్సులే కారణమని భావించే విరాట్, తనకు వచ్చే గౌరవాలను కూడా ఆమెకే అంకితం ఇస్తుంటారు. ఒక పక్క ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తూనే, మరోపక్క తన మూలాలను, అమ్మపై ఉన్న మమకారాన్ని చాటుకోవడం కోహ్లీ గొప్పతనానికి నిదర్శనం. రికార్డుల కంటే కూడా అమ్మ మొఖంలో కనిపించే ఆ చిన్న చిరునవ్వే తనకు అత్యున్నత అవార్డు అని విరాట్ మాటలను బట్టి అర్థమవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
