AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : టీ20 క్రికెట్‌లో కింగ్ సంచలన రికార్డ్.. తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

Virat Kohli : విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించారు. భారత బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే విరాట్ కోహ్లీ దరిదాపుల్లో ఎవరూ లేరు.

Virat Kohli  : టీ20 క్రికెట్‌లో కింగ్ సంచలన రికార్డ్.. తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
Virat Kohli
Rakesh
|

Updated on: May 14, 2026 | 10:07 AM

Share

Virat Kohli : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మరో అద్భుత మైలురాయిని అధిగమించారు. టీ20 క్రికెట్ చరిత్రలో 14,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. బుధవారం రాయ్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో కోహ్లీ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ 14 వేల పరుగుల మార్కును చేరడానికి 78 పరుగులు కావాల్సి ఉండగా, కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడి ఆ లక్ష్యాన్ని ముద్దాడారు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీయడం ద్వారా కోహ్లీ ఈ చారిత్రాత్మక ఘనతను అందుకున్నారు.

కేవలం 14 వేల పరుగులు చేయడమే కాకుండా, ఈ మార్కును అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్‌గా కూడా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కోహ్లీ కేవలం 409 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోగా, అంతకుముందు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 423 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఇప్పుడు గేల్ రికార్డును కోహ్లీ తుడిచిపెట్టేశారు. ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ 431 ఇన్నింగ్స్‌లతో మూడవ స్థానంలో ఉండగా, జోస్ బట్లర్ (468), అలెక్స్ హేల్స్ (505) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ నిలకడ ఎంతటిదో ఈ గణాంకాలే నిరూపిస్తున్నాయి.

భారత బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే విరాట్ కోహ్లీ దరిదాపుల్లో ఎవరూ లేరు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 12,491 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ ఇప్పటివరకు 469 మ్యాచ్‌లు ఆడి ఈ పరుగులు సాధించగా, కోహ్లీ కేవలం 426 మ్యాచ్‌ల్లోనే 14 వేల మార్కును దాటడం విశేషం. శిఖర్ ధావన్ (9,797), సూర్యకుమార్ యాదవ్ (9,654), సంజూ శామ్సన్ (8,830) వంటి టాప్ ప్లేయర్లు కోహ్లీ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. అయితే, సిక్సర్ల విషయంలో మాత్రం రోహిత్ శర్మ (564 సిక్సర్లు) భారత బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో 14 వేల పరుగులు దాటిన ప్రపంచంలోని ఆరో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచారు. ప్రస్తుతం ఈ జాబితాలో క్రిస్ గేల్ 14,562 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, కీరన్ పొలార్డ్ (14,482), అలెక్స్ హేల్స్ (14,449), డేవిడ్ వార్నర్ (14,284), జోస్ బట్లర్ (14,200) వరుసగా కోహ్లీ కంటే ముందున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్‌ను చూస్తుంటే, అతి త్వరలోనే క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డును కూడా బద్దలు కొట్టి ప్రపంచంలోనే అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us