
IPL Records : ఐపీఎల్ చరిత్రలో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ, మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. మైదానంలో పరుగుల వరద పారించడంలోనే కాకుండా, బౌండరీల వర్షం కురిపించడంలోనూ తనకు సాటిలేరని కింగ్ కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. 2026 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ ఈ చారిత్రక ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 800 ఫోర్లు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచి, కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్లో 9,000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. అయితే ఆ మార్కును చేరుకోకముందే ఫోర్లకు సంబంధించిన ఒక భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను తన ఐపీఎల్ కెరీర్‌లో 800వ ఫోర్‌ను బాదాడు. ఈ అద్భుత ఘనతను సాధించడానికి కోహ్లీకి 266 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. విశేషమేమిటంటే, ఈ సీజన్‌లోనూ (ఐపీఎల్ 2026) అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు అతను 33 బౌండరీలు సాధించాడు.
అత్యధిక ఫోర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్లు వీరే:
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు బాదిన టాప్ 5 బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే, విరాట్ టాప్ ప్లేసులో నిలిచాడని, మిగిలినవారు అతనికి కొంత దూరంలో వెనుకబడి ఉన్నారని స్పష్టమవుతుంది.
విరాట్ కోహ్లీ: 800+ ఫోర్లు (266 ఇన్నింగ్స్‌లు)
శిఖర్ ధావన్: 768 ఫోర్లు (ప్రస్తుత సీజన్‌లో ఆడటం లేదు)
డేవిడ్ వార్నర్: 663 ఫోర్లు (ప్రస్తుత సీజన్‌లో ఆడటం లేదు)
రోహిత్ శర్మ: 653 ఫోర్లు (271 మ్యాచ్‌లు)
అజింక్య రహానే: 522 ఫోర్లు
ఈ సీజన్‌లోనూ కోహ్లీదే ఆధిపత్యం
ఇది కేవలం ఆల్ టైం రికార్డు మాత్రమే కాదు ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యధిక ఫోర్ల వేటలోనూ విరాట్ కోహ్లీనే అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ ఇప్పటివరకు 33 ఫోర్లు బాదగా, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజు శాంసన్ 31 ఫోర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వయసు పెరుగుతున్నప్పటికీ, విరాట్ ఆటతీరు రోజురోజుకూ మరింత పదునుదేరుతున్నట్లు కనిపిస్తోంది.
కెప్టెన్సీ లేకపోవడమే కారణమా?
కోహ్లీ ఆటతీరును గమనిస్తుంటే, రికార్డులే అతడిని వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సీజన్ ఆరంభంలోనే అత్యధిక ఫోర్ల విషయంలో శిఖర్ ధావన్ (768) రికార్డును అధిగమించిన విరాట్, ఇప్పుడు 800 మార్కును చేరుకున్నాడు. ప్రస్తుతానికి మరెవరికీ అందుబాటులో లేని ఒక అద్వితీయమైన మైలురాయి ఇది. అతడు ఇదే జోరును కొనసాగిస్తే, అసాధ్యంగా అనిపించే మరెన్నో రికార్డులను సాధ్యం చేయడం కింగ్ కోహ్లీకి ఏమాత్రం కష్టమైన పని కాదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..