AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. పేరు లేకుండానే భారత జట్టు ప్రకటన.. ఎందుకంటే?

Vaibhav Suryavanshi, India U19 Squad: యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఆస్ట్రేలియా సిరీస్‌కు ప్రకటించిన అండర్-19 జట్టు నుండి బీసీసీఐ తొలగించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, ఇది షాక్ కాదు, అతడి కెరీర్‌కు మరో మెట్టు. ఆసియా క్రీడల్లో సీనియర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటమే దీనికి అసలు కారణం. అండర్-19 స్థాయి నుండి సీనియర్ క్రికెట్‌కు వైభవ్ వేగంగా ఎదుగుతున్నాడని ఇది స్పష్టం చేస్తుంది.

వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. పేరు లేకుండానే భారత జట్టు ప్రకటన.. ఎందుకంటే?
Vaibhav Suryavanshi, India U19 Squad
Venkata Chari
|

Updated on: Aug 27, 2026 | 2:08 PM

Share

Vaibhav Suryavanshi, India U19 Squad: భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు లేకుండానే ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగనున్న సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఒక్కటే ప్రశ్న.. 15 ఏళ్ల వైభవ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు..? తాజాగా ప్రకటించిన జట్టును పరిశీలిస్తే దీనికి ప్రధాన కారణం మరో అంతర్జాతీయ బాధ్యతగా కనిపిస్తోంది.

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లు..

ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత పర్యటనకు రానుంది. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 5 వరకు మూడు వన్డేలు, రెండు మల్టీడే మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే సిరీస్‌లో లక్ష్య రైచందానీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మల్టీడే జట్టుకు యశ్‌వర్ధన్ చౌహాన్ నాయకత్వం వహించనున్నాడు.

ఈ రెండు జట్లలోనూ వైభవ్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

అసలు కారణం ఏంటి?

వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణంగా ఆసియా క్రీడలు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 5 వరకు భారత్ అండర్-19, ఆస్ట్రేలియా అండర్-19 సిరీస్ జరగనుంది. ఇదే సమయంలో జపాన్‌లోని ఐచి-నాగోయాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి.

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టులో వైభవ్‌కు చోటు దక్కింది. క్రికెట్ పోటీలు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 3 వరకు జరగనున్న నేపథ్యంలో.. అండర్-19 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. అందుకే సెలెక్టర్లు అతడిని ఈ జట్టులోకి తీసుకోలేదని తెలుస్తోంది.

ఇప్పటికే సీనియర్ స్థాయిలోకి అడుగు..

వైభవ్‌ను అండర్-19 క్రికెట్‌కే పరిమితం చేయాల్సిన అవసరం లేని స్థాయికి అతడి కెరీర్ చేరుకుంది. 2026లో భారత్ తరఫున సీనియర్ టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు.. ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ఇదే సమయంలో ఆసియా క్రీడల జట్టులోనూ ఎంపిక కావడం అతడి కెరీర్ వేగంగా ఎదుగుతున్న తీరుకు నిదర్శనం.

గతేడాది ఆస్ట్రేలియాపై అదరగొట్టినా..

ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో వైభవ్‌కు మంచి అనుబంధమే ఉంది. 2024లో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్టులో చెన్నై వేదికగా కేవలం 58 బంతుల్లోనే శతకం సాధించి సంచలనం సృష్టించాడు.

అంతేకాదు.. 2025లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 జట్టులోనూ వైభవ్ సభ్యుడిగా ఉన్నాడు. అప్పట్లో అతడిని మూడు వన్డేలు, రెండు మల్టీడే మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు.

ఇప్పుడు అండర్-19 కంటే పెద్ద వేదికలపై..

వైభవ్ ప్రయాణం గత రెండేళ్లలో అనూహ్యంగా వేగం పుంజుకుంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అతడు.. ఆ తర్వాత భారత ‘ఎ’ జట్టులోకి, చివరకు సీనియర్ టీ20 జట్టులోకి కూడా అడుగుపెట్టాడు.

2026 ఐపీఎల్‌లోనూ అతడి బ్యాట్ పరుగుల వరద పారించింది. ఆ తర్వాత భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో అవకాశం దక్కింది. దీంతో అండర్-19 స్థాయి నుంచి సీనియర్ క్రికెట్ వైపు అతడి ప్రయాణం ఇప్పటికే మొదలైందని చెప్పొచ్చు.

రెడ్ బాల్ క్రికెట్‌పైనా దృష్టి..

వైభవ్‌కు వరుసగా టీ20, వన్డే అవకాశాలు వస్తున్నప్పటికీ.. అతడి అభివృద్ధిలో రెడ్ బాల్ క్రికెట్ కూడా ముఖ్యమేనని మాజీ భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవల అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల ఈ యువ ఆటగాడు సుదీర్ఘ ఫార్మాట్‌లో మరింత అనుభవం సంపాదించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

అందుకే వైభవ్‌ను కేవలం అండర్-19 క్రికెట్‌లోనే కొనసాగించకుండా.. వయసుకు మించిన స్థాయిలో అతడికి ఎదురయ్యే అవకాశాలను సమర్థంగా నిర్వహించడంపై సెలెక్టర్లు దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

అభిమానులకు అసలు గుడ్ న్యూస్..!

ఆస్ట్రేలియా అండర్-19 సిరీస్‌కు వైభవ్ ఎంపిక కాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అతడి పేరు జట్టులో లేకపోవడానికి ప్రధాన కారణం మరింత పెద్ద వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటమే.

ఒకప్పుడు అండర్-19 జట్టులో చోటు కోసం పోటీపడిన వైభవ్.. ఇప్పుడు సీనియర్ భారత జట్టు, ఆసియా క్రీడల వంటి వేదికల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో అండర్-19 సిరీస్‌ను మిస్ అవుతున్నా.. వైభవ్ కెరీర్ మాత్రం మరో స్థాయికి దూసుకెళ్తోంది!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us