INDA vs SLA: వైభవ్ సూర్యవంశీతో గొడవ.. దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్‌కు తప్పని శిక్ష..!

Vishen Halambage Fined: మైదానంలో దూకుడు ప్రదర్శించడం సహజమే అయినా, అది వ్యక్తిగత దూషణలు, తోపులాటల వరకు వెళ్లడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. శ్రీలంక ఆటగాడిపై జరిమానా పడటంతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది. భారత యువ ఆటగాళ్లు ఇకనైనా లంక క్రీడాకారుల స్లెడ్జింగ్ వ్యూహాలకు చిక్కకుండా, బ్యాట్, బంతితోనే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

INDA vs SLA: వైభవ్ సూర్యవంశీతో గొడవ.. దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్‌కు తప్పని శిక్ష..!
Vishen Halambage Fined

Updated on: Jun 16, 2026 | 8:59 PM

Vishen Halambage Fined: ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న మైదాన వివాదం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూ శ్రీలంక ఆల్రౌండర్ విషెన్ హలంబాగే చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు, తోపులాటలు చివరకు అతడికే చేటు తెచ్చాయి. ఈ ఘర్షణపై మ్యాచ్ రేఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో శ్రీలంక ఆల్-రౌండర్ విషెన్ హలంబగేకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. ఈ 21 ఏళ్ల ఆటగాడు ట్రై-సిరీస్ మ్యాచ్‌లో భాగంగా వైభవ్ సూర్యవంశీతో ఘర్షణకు దిగాడు. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య తోపులాట కూడా జరిగింది. మ్యాచ్ ప్రారంభం కాకముందే విషెన్ హలంబగే వైభవ్ సూర్యవంశీపై కీలక వ్యాఖ్యలు చేశాడని చెబుతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అతను వైభవ్ సూర్యవంశీని ఏదో అనడంతో విషయం మరింత తీవ్రమైంది. ఈ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి చాలా దగ్గరగా వెళ్లాడు. దీంతో వైభవ్ లంక ప్లేయర్ విషెన్ హలంబగేను నెట్టేశాడు. ఈ మొత్తం ఘటనలో ఈ శ్రీలంక ఆటగాడు దోషిగా తేలాడు.

ఆట ముగిసిన తర్వాత కూడా విషెన్ హలంబాగే పరిధులు దాటి వైభవ్ సూర్యవంశీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ అతడికి అత్యంత సమీపంగా వెళ్లాడు. దీంతో సహనం కోల్పోయిన భారత యువ ఆటగాడు వైభవ్, శ్రీలంక ప్లేయర్‌ను వెనక్కి నెట్టేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ, విచారణ అనంతరం శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగేను దోషిగా తేల్చారు. నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ అతడికి భారీ జరిమానా విధించారు.

లంక సీనియర్ వికెట్ కీపర్‌కూ తప్పని జరిమానా..

ఈ హైడ్రామాలో శ్రీలంక సీనియర్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాపై కూడా మ్యాచ్ రేఫరీ జరిమానా విధించడం గమనార్హం. అయితే, డిక్వెల్లాకు వైభవ్, విషెన్ మధ్య జరిగిన గొడవతో ఎలాంటి సంబంధం లేదు. నిజానికి మైదానంలో ఇరు ఆటగాళ్ల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు డిక్వెల్లానే చొరవ తీసుకుని వారిని శాంతింపజేశాడు. కానీ, మ్యాచ్‌లో జరిగిన మరో క్రమశిక్షణా ఉల్లంఘన ఘటనలో డిక్వెల్లా దోషిగా తేలడంతో మ్యాచ్ రేఫరీ అతడికి సైతం జరిమానా విధించారు.

వైభవ్ సూర్యవంశీపై చర్యలు ఉంటాయా?

శ్రీలంక ఆటగాడిని చేతులతో నెట్టిన వైభవ్ సూర్యవంశీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న ఈ యువ క్రికెటర్‌పై కూడా చర్యలు ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ, ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. లంక ఆటగాడే కావాలని స్లెడ్జింగ్‌తో రెచ్చగొట్టడం వల్లే వైభవ్ అలా స్పందించాల్సి వచ్చిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

రంగంలోకి దిగిన బీసీసీఐ.. యువ ఆటగాళ్లకు కీలక సూచన..

ఈ వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా ఈ ఘటనపై మాట్లాడుతూ భారత ఆటగాళ్లకు విలువైన సూచనలు చేశారు. ఇండియా-ఎ తరపున ఆడుతున్న వారంతా భారత సీనియర్ జట్టులోకి వచ్చేందుకు తహతహలాడుతున్న అద్భుతమైన ప్రతిభావంతులని ఆయన పేర్కొన్నారు.

“ఇండియా-ఎ జట్టు ఒక పెద్ద టోర్నమెంట్‌లో ఆడుతోంది. ఇక్కడ ఆడుతున్న ప్రతి ఒక్కరూ రేపటి రోజున భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకునే సత్తా ఉన్నవారే. కాబట్టి యువ ఆటగాళ్లు మైదానంలో ఇలాంటి అనవసరమైన వివాదాలపై దృష్టి పెట్టకుండా, తమ దృష్టిని కేవలం ఆటపైనే కేంద్రీకరించాలి. సిరీస్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగాలి” అని దేవజీత్ సైకియా స్పష్టం చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us