Video: క్యా సీన్ హై.. వైభవ్ సూర్యవంశీ కోసం వచ్చిన 80 ఏళ్ల దిగ్గజ క్రికెటర్.. ఏకంగా 161 కిలోమీటర్లు జర్నీ చేసి మరీ..!

Vaibhav Sooryavanshi - Anura Tennekoon: క్రికెట్ మైదానంలో రికార్డులు రావడం, పోవడం సహజం. కానీ కొన్ని సంఘటనలు మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కలవడానికి, ఆ దేశ తొలి వన్డే కెప్టెన్, 80 ఏళ్ల అనుర తెన్నెకూన్ ఏకంగా 161 కిలోమీటర్లు ప్రయాణించి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Video: క్యా సీన్ హై.. వైభవ్ సూర్యవంశీ కోసం వచ్చిన 80 ఏళ్ల దిగ్గజ క్రికెటర్.. ఏకంగా 161 కిలోమీటర్లు జర్నీ చేసి మరీ..!
Vaibhav Sooryavanshi Anura Tennekoon

Updated on: Jun 16, 2026 | 9:26 PM

Vaibhav Sooryavanshi – Anura Tennekoon: భారత ‘ఎ’ జట్టు త్రైపాక్షిక వన్డే సిరీస్ కోసం ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు భారత్ తరపున కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పర్యటనలో ఇప్పటివరకు వైభవ్ ఆశించిన స్థాయిలో బ్యాటింగ్‌లో రాణించకపోయినప్పటికీ, అతని ఆటతీరును చూడటానికి మైదానానికి వస్తున్న అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైభవ్‌కు కేవలం భారతదేశంలోనే కాకుండా, విదేశాల్లోనూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అతని అభిమానుల జాబితాలో సామాన్యులే కాకుండా, మాజీ అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు కూడా చేరడం విశేషం.

ఆశీర్వాదం తీసుకున్న యువ ఆటగాడు..

జూన్ 15న డంబుల్లా వేదికగా భారత్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. లంక దిగ్గజ క్రికెటర్ అనుర తెన్నెకూన్ కొలంబో నుంచి ఏకంగా 161 కిలోమీటర్ల దూరం ప్రయాణించి డంబుల్లా స్టేడియానికి చేరుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వైభవ్, తెన్నెకూన్‌ను కలిసి ఎంతో మర్యాదగా ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వయసులో కూడా తన కోసం అంత దూరం వచ్చిన పెద్దాయనకు వైభవ్ చూపిన గౌరవం నెటిజన్ల మనసులను గెలుచుకుంది. ఈ భావోద్వేగ భేటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఐపీఎల్ ఆటతీరుకు ఫిదా అయ్యాను: తెన్నెకూన్

వైభవ్‌తో ముచ్చటించిన లంక మాజీ కెప్టెన్, అతనికి కెరీర్‌కు ఉపయోగపడే విలువైన సలహాలు ఇచ్చారు. “నీ ఆటపై మాత్రమే నువ్వు దృష్టి పెట్టు, బయట జరిగే విషయాలను, విమర్శలను అస్సలు పట్టించుకోవద్దు. దురదృష్టవశాత్తూ ఈ రోజు మ్యాచ్‌లో నీ లయను అందుకోలేకపోయావు. కానీ క్రికెట్‌లో ఇవన్నీ సహజం, ప్రతిరోజూ మనకు అనుకూలంగా ఉండదు” అని వైభవ్‌ను ఓదార్చారు. అనంతరం తెన్నెకూన్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో వైభవ్ బ్యాటింగ్ చూసి తాను ఎంతగానో ప్రభావితమయ్యానని కొనియాడారు. అతడు సిక్సర్లు, బౌండరీలు బాదే శైలి అద్భుతమని, భవిష్యత్తులో అతడు మరింత గొప్పగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉత్కంఠ పోరులో భారత్‌కు పరాజయం..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో 3 బౌండరీలు, ఒక సిక్సర్‌తో వేగంగా 21 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టు కూడా సరిగ్గా 265 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఫలితం కోసం నిర్వహించిన సూపర్ ఓవర్ ఉత్కంఠలో భారత జట్టు ఓటమి చవిచూసింది.

గెలుపోటములతో సంబంధం లేకుండా క్రికెట్ అనేది ఆటగాళ్ల మధ్య గౌరవాన్ని, మైత్రిని పెంచుతుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ, భవిష్యత్తులో భారత క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా ఎదుగుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us