AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : టీమిండియాలోకి వైభవ్.. మాజీల మాట పెడచెవిన పెట్టి ఇంత చిన్న వయసులోనే ఛాన్స్ ఇస్తారా?

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచి చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు టీమిండియాలోకి ఎంపిక చేయాలని డిమాండ్ పెరుగుతోంది. కొందరు మాత్రం ఈ వయసులో ఒత్తిడిని తట్టుకోలేరని అంటున్నారు.

Vaibhav Sooryavanshi : టీమిండియాలోకి వైభవ్.. మాజీల మాట పెడచెవిన పెట్టి ఇంత చిన్న వయసులోనే ఛాన్స్ ఇస్తారా?
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jun 04, 2026 | 5:02 PM

Share

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో తన బ్యాటింగ్ విధ్వంసంతో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం నెట్టింట మారుమోగిపోతోంది. ఈ 15 ఏళ్ల వండర్ కిడ్‌ను వీలైనంత త్వరగా భారత జాతీయ జట్టులోకి తీసుకురావాలనే డిమాండ్ క్రికెట్ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది. టీమిండియా త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలతో వరుస టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌ల కోసం సెలక్టర్లు త్వరలోనే భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీని జట్టులోకి ఎంపిక చేయాలనే చర్చ తీవ్రతరమైంది.

వైభవ్ సూర్యవంశీ ఎంపికపై ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ఆటోమొబైల్, స్పోర్ట్స్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒకవైపు కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్‌కు ఇంత త్వరగా అంతర్జాతీయ క్రికెట్ సెటప్‌లో అవకాశం ఇవ్వడం సరికాదని కొందరు మాజీలు హెచ్చరిస్తున్నారు. భారీ ఒత్తిడి ఉండే అంతర్జాతీయ మ్యాచ్‌లను తట్టుకునేంత మానసిక పరిణతి ఈ వయసులో రావడం కష్టమని వారి అభిప్రాయం. అయితే మీడియా నివేదికల ప్రకారం.. సెలక్షన్ కమిటీ మాత్రం ఈ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కుర్రాడిని ఎలాగైనా జట్టులోకి తీసుకురావాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

భారత జట్టు జూన్ 26 (శుక్రవారం) నుంచి ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో రెండో అలాగే చివరి మ్యాచ్ జూన్ 28 (ఆదివారం)న జరగనుంది. ఈ పర్యటన ద్వారా టీమిండియాకు ఒక సరికొత్త టీ20 కెప్టెన్ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో అతనిని కెప్టెన్సీ పదవి నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఎంపిక చేస్తే, అతనికి కేవలం ఐర్లాండ్ టూర్‌లోనే ఛాన్స్ ఇస్తారా లేక ఆ వెంటనే జూలై 1 నుంచి ప్రారంభం కాబోయే ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 లో ఊహించని రేంజ్ బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, 16 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 48.50 అద్భుతమైన సగటుతో, 237.30 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో మొత్తం 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో అతని బ్యాట్ నుంచి ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.

వైభవ్ సూర్యవంశీ కేవలం పరుగులు మాత్రమే చేయలేదు, గ్రౌండ్‌లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఈ ఒక్క సీజన్‌లోనే అతను ఏకంగా 72 భారీ సిక్సర్లు బాదాడు. దీని ద్వారా ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వెస్టిండీస్ లీజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఎన్నో ఏళ్ల రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు బద్దలు కొట్టాడు. ఈ అసాధారణ హిట్టింగ్ సామర్థ్యం వల్లే అతడిని టీ20 ఫార్మాట్‌లో పవర్‌ప్లేను వాడుకోవడానికి సరైన ఓపెనర్‌గా సెలక్టర్లు భావిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే రాబోయే అధికారిక ప్రకటన ద్వారా వైభవ్ కల నిజం కానుందో లేదో తెలియనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us