India vs New Zealand 1st Test Match Report: కాన్పూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్ట్ డ్రా గా ముగిసింది. చివరి రోజు బౌలర్లు పూర్తిగా శ్రమించారు. కాని ఆఖరి వికెట్ తీయలేకపోయారు. న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. చివరగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రచిన రవీంద్ర, అజాజ్ పటేల్ భారత్ విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదో రోజు బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ పేలవంగా ఆడింది. ఓపెనర్ టామ్ లాథన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. 52 పరుగులు చేసి జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు.
విలియమ్ సోమర్ విల్లే 36 పరుగులు, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 24 పరుగులు చేశారు. క్రీజులో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడ్డారు. వీరు మినహాయించి మిగతా వారు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ఇక భారత బౌలర్లు ఆది నుంచి తమ ప్రతాపం చూపించారు. ఓవర్లు మెయిడన్ చేస్తూ పరుగులు రాకుండా కట్టడి చేశారు. వరుసగా వికెట్లు సాధించారు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 4 వికెట్లు, అక్సర్ పటేల్ 1 వికెట్, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ సాధించారు.
నాలుగో రోజు భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 234 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించింది. దీంతో మూడోరోజు 63 పరుగుల ఆధిక్యంతో కలిపి కివీస్‌కి 284 పరుగుల టార్గెట్‌ని నిర్దేశించింది. తొలిటెస్ట్ ఆడిన శ్రేయాస్ అయ్యార్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా క్లాసిక్ ఆటతో అలరించాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 65 (ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్దిమాన్ సాహా కూడా చెలరేగిపోయాడు. హాప్ సెంచరీ చేసి అదరగొట్టాడు. 61 (నాలుగు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్సర్ పటేల్ 28 పరుగులతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.