24 ఫోర్లు, 10 సిక్సర్లు.. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో టీమిండియా ప్లేయర్ బీభత్సం.. కట్‌చేస్తే..
Unique Cricket Records: వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ప్రపంచ రికార్డును సృష్టించిన భారత బ్యాటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీమిండియా ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి మరీ చరిత్ర సృష్టించడం గమనార్హం. ఈ బ్యాటర్ ప్రస్తుతం టీం ఇండియాకు దూరంగా ఉన్నాడని తెలిస్తే, కచ్చితంగా షాక్ అవుతారు.

Unique Cricket Records: వన్డే క్రికెట్‌లో ప్రతిరోజూ అనేక రికార్డులు బద్దలవుతుంటాయి. కొన్నిసార్లు బ్యాటర్ అద్భుతాలు చేస్తే.. కొన్నిసార్లు బౌలర్ తన ఘోరమైన బౌలింగ్‌తో రికార్డ్ సృష్టిస్తుంటాడు. వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ప్రపంచ రికార్డును సృష్టించిన భారత బ్యాటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఘనత 2022లో జరిగింది. ఈ టీమిండియా ప్లేయర్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి మరీ చరిత్ర సృష్టించడం గమనార్హం. ఈ బ్యాటర్ ప్రస్తుతం టీం ఇండియాకు దూరంగా ఉన్నాడని తెలిస్తే, కచ్చితంగా షాక్ అవుతారు.
భారత యువ, డేంజరస్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు. ఇషాన్ ఈ రికార్డును ఎంత పవర్ ఫుల్‌గా సాధించాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు వేడుకున్నారు. డిసెంబర్ 2022లో చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌న్ ఆడాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఔట్ కావడంతో ఈ మ్యాచ్ ఇషాన్ కిషన్‌కు ఒక పెద్ద అవకాశం. ఓపెనింగ్ బాధ్యతను స్వీకరించిన వెంటనే, ఇషాన్ వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. అతను ప్రారంభం నుంచే బంగ్లాదేశ్ ఫాస్ట్, స్పిన్ బౌలర్లపై దాడి చేశాడు. అతని బ్యాటింగ్ శక్తి, సమయస్ఫూర్తిని మాత్రమే కాకుండా, నిర్భయమైన శైలిని కూడా ప్రదర్శించింది. ఇది బౌలర్ల మనోధైర్యాన్ని దెబ్బతీసింది.
200 పరుగులు పూర్తి..
ఇషాన్ కేవలం 126 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ. ఈ సమయంలో, అతను 138 బంతుల్లో ఈ ఘనత సాధించిన వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇషాన్ ఇన్నింగ్స్ చాలా దూకుడుగా ఉంది. ఇషాన్ మొదట కేవలం 85 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత అతని వేగం మరింత పెరిగింది. అతను తదుపరి 100 పరుగులు కేవలం 41 బంతుల్లోనే చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో, ఇషాన్ 141 బంతుల్లో మొత్తం 210 పరుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.
భారత్ 227 పరుగుల తేడాతో విజయం..
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ 113 పరుగులతో భారత్ బంగ్లాదేశ్‌పై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 34 ఓవర్లలో 182 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
టీమిండియాలో నో ఛాన్స్..
ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీం ఇండియాకు దూరంగా ఉన్నాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన భారత జట్టు తరపున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత, అతను ‘వ్యక్తిగత కారణాల’ కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలో తిరిగి వచ్చాడు. ఈ విరామం తర్వాత, అతను దేశవాళీ క్రికెట్ (రంజీ ట్రోఫీ)లో ఆడటానికి కూడా నిరాకరించాడు. దీనిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగా, అతన్ని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించారు. అయితే, తరువాత దేశవాళీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చి కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రాలేదు. ఇప్పటికే భారత్ తరపున మూడు ఫార్మాట్లలో ఆడిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








