టీమిండియాకు బెస్ట్ టెస్ట్ కెప్టెన్ అతడే.. నాలుగేళ్ల పాటు నెంబర్ వన్‌గా భారత్.. అద్భుత గణాంకాలు ఇవే!

సారథ్య బాధ్యతలు భారం అనుకున్నాడో, కెప్టెన్సీ పదవి ముళ్ల కీరిటమేనన్న తత్వం తెలిసి వచ్చిందో, బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు బాధించాయో, కోచ్‌ రవిశాస్త్రి స్థానంలో కొత్తగా వచ్చిన ద్రావిడ్‌తో ఇమడలేకపోతున్నాడో..

టీమిండియాకు బెస్ట్ టెస్ట్ కెప్టెన్ అతడే.. నాలుగేళ్ల పాటు నెంబర్ వన్‌గా భారత్.. అద్భుత గణాంకాలు ఇవే!
Virat Kohli
Follow us
Balu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2022 | 5:41 PM

సారథ్య బాధ్యతలు భారం అనుకున్నాడో, కెప్టెన్సీ పదవి ముళ్ల కీరిటమేనన్న తత్వం తెలిసి వచ్చిందో, బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు బాధించాయో, కోచ్‌ రవిశాస్త్రి స్థానంలో కొత్తగా వచ్చిన ద్రావిడ్‌తో ఇమడలేకపోతున్నాడో తెలియదు కానీ విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవడం మాత్రం అనూహ్యమే! గవాస్కర్‌ అన్నట్టుగా వేటు వేస్తారని తెలిసే ఈ నిర్ణయం తీసుకుని కూడా ఉండొచ్చు. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు పొమ్మన లేకుండా పొగబెట్టిందన్నది మాత్రం నిజం. టీ-20 కెప్టెన్సీ నుంచి తనంతట తానుగా తప్పుకున్న కోహ్లీకి ఆ తర్వాతి పరిణామాలు చాలా బాధించాయి. చెప్పా పెట్టకుండా వన్డే ఫార్మట్‌ కెప్టెన్‌ నుంచి తప్పించడం అవమానకరంగా ఫీలయ్యాడు కోహ్లీ. అలాగని అతడేం ఫెల్యూయిర్‌ కెప్టెన్‌ కాదు.. మోస్ట్ సక్సెస్‌ఫుట్‌ కెప్టెన్‌ అతడు. భారత టెస్టు జట్టు సారథిగా కోహ్లీ 68 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. అందులో 40 విజయాలు నమోదు కాగా.. 17 టెస్టుల్లో ఓటమి, మరో 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ గణాంకాలు చాలుగా…!

విదేశీగడ్డపై విజయం సాధించాలంటే పేసర్లు అవసరమని కోహ్లీ చాలా త్వరగా గ్రహించాడు. కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి ఉద్దేశమూ అదే. 2014లో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇండియా ఓడిపోయింది. సారథిగా కోహ్లీకి అదే తొలి టెస్ట్‌. అయినా అతడేం భయపడిపోలేదు. పేస్‌ బౌలర్లకు భరోసా కల్పించాడు. వారిలో విశ్వాసం పెంచాడు. టీమిండియాను ఓ బలమైన శక్తిగా తయారు చేశాడు. ప్రస్తుతం టీమ్‌లో మ్యాచ్‌ విన్నర్లుగా తయారైన జస్పిత్‌ బుమ్రా, రిషబ్‌ పంత్‌లిద్దరూ కోహ్లీ మార్గదర్శకత్వంలో రాటు దేలినవారే! కోహ్లీ దూకుడును అందిపుచ్చుకున్నవారే! టెస్ట్‌ల కోసం ఒకరు, లిమిటెడ్‌ ఓవర్ల కోసం ఇంకొకరు సారథ్యం వహించడమన్నది ఇండియాలో అంతగా వర్క్‌ అవటవ్వదని ధోని ఎప్పుడో చెప్పారు. సరే.. క్రికెట్‌ బోర్డు మనసులో ఏముందో తెలియదు కానీ. కోహ్లీ బాధ్యతలను కత్తిరించింది. ఇప్పుడు కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కాబట్టి టీమ్‌లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. జట్టులో సుస్థిర స్థానం కోసం గట్టిగా పోరాడుతున్న అజింక్యా రహానే, ఛతేశ్వర్‌ పూజారలకు రానున్నది గడ్డుకాలమే! యంగ్‌గన్స్‌గా పేరొందిన శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారిలకు మరిన్న అవకాశాలు దక్కవచ్చు. టీమిండియా ఇప్పుడు మార్పు దిశగా వెళుతున్నందున ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌యాదవ్‌ల ప్లేస్‌లో కుర్రాళ్లు రావచ్చు. టీమిండియాలో పోరాటస్ఫూర్తిని, ఎవరినైనా ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్ని నింపింది మాత్రం గంగూలీనే! ఆ తర్వాత వచ్చిన ద్రావిడ్‌, ధోనీ, కోహ్లీలు దాన్ని కొనసాగించారు. కోహ్లీ అయితే ఇంకాస్తా దూకుడు పెంచాడు. ఇప్పుడు కొత్తగా వచ్చే సారథి కూడా ఆ సంప్రదాయన్ని కొనసాగిస్తాడనే ఆశిద్దాం..

కెప్టెన్‌గా కోహ్లీ ఒకట్రెండుసార్లు విఫలం చెంది ఉండవచ్చు. కాని అంతకంటే ఎక్కువ విజయాలనే టీమిండియాకు ఇచ్చాడు. 2011లో టెస్ట్‌ క్రికెట్‌లో అడుగు పెట్టిన కోహ్లీ మూడేళ్లకే సారథిగా మారాడు. 2014లో ధోనీ గాయపడటంతో మొదటిసారి కెప్టెన్సీ పదవిని అందుకున్నాడు. అది కూడా ఆస్ట్రేలియాలో. తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆస్ట్రేలియా గడ్డపైనే కోహ్లీ సిరీస్‌ను కైవసం చేసుకోవడం విశేషం. ఇంగ్లాండ్‌లో కోహ్లీ సాధించిన విజయాలు తక్కువేం కావు. కాకపోతే సౌతాఫ్రికాలో సిరీస్‌ విజయం సాధించాలన్న ఆశయాన్ని మాత్రం కోహ్లీ నెరవేర్చుకోలేకపోయాడు. టెస్ట్‌ల్లో కోహ్లీ కంటే కెప్టెన్‌గా ఎక్కువ విజయాలను అందుకున్న కెప్టెన్లు ముగ్గరంటే ముగ్గురే ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన గ్రేమ్‌ స్మిత్‌ 109 మ్యాచ్‌లకు సారధిగా వ్యవహరించి 53 విజయాలను అందించాడు. ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్‌ 77 మ్యాచ్‌ల్లో 48 విజయాలు సాధించాడు. ఆస్ట్రేలియాకే చెందిన స్టీవ్‌ వా 57 మ్యాచ్‌ల్లో 41 విజయాలు చవిచూశాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మీద ఎక్కువ విజయాలను నమోదు చేసిన ఆసియన్‌ కెప్టెన్‌ కూడా విరాట్ కోహ్లీనే. 23 మ్యాచుల్లో ఏడు విజయాలను నమోదు చేసుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌ గ్రౌండ్‌లో ప్రత్యర్థులు విజయం సాధించడం చాలా కష్టం. కానీ కోహ్లీ ఈజీగా దాన్ని సాధించాడు. ఇంతకు ముందు ఇలాంటి ఫీట్‌ ఇద్దరికే సాధ్యమయ్యింది. 2000 సంవత్సంలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌, 2014లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకేల్ క్లార్క్‌లు మాత్రమే ఈ ఘతన సాధించారు. మొన్న కోహ్లీ సాధించాడు. దాదాపు 42 నెలల పాటు టీమ్‌ఇండియా టెస్టు జట్టు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగిందంటే అందుకు కారణం కోహ్లీనే! అక్టోబర్‌ 2016 నుంచి మార్చి 2020 వరకు ఇండియానే నంబర్‌ వన్‌. సారథ్య బాధ్యతలను నుంచి తప్పుకున్నాడు కాబట్టి ఇకపై కోహ్లీకి అంత ఒత్తిడి ఉండదు.. మళ్లీ మనం మునుపటి కోహ్లీని చూసే అవకాశం ఉంది.. ఆల్‌ ది బెస్ట్ విరాట్‌!