AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పిన్నర్‌గా వచ్చి.. గొప్ప బ్యాటర్‌గా రిటైర్‌! ఐపీఎల్‌ లైఫ్‌ ఇస్తే.. ఆ నిషేధం జీవితాన్ని మార్చింది! స్టీవ్‌ స్మిత్‌ లైఫ్‌ స్టోరీ

స్టీవ్ స్మిత్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్, ఐపీఎల్ ప్రభావం, 2018 బాల్ టాంపరింగ్ వివాదం, అతని అద్భుతమైన పునరాగమనం వంటి కీలక అంశాలు అతని జీవితంలో ఉన్నాయి. అతని అంతర్జాతీయ వన్డే కెరీర్ లోని ఘనతలు, వివాదాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

స్పిన్నర్‌గా వచ్చి.. గొప్ప బ్యాటర్‌గా రిటైర్‌! ఐపీఎల్‌ లైఫ్‌ ఇస్తే.. ఆ నిషేధం జీవితాన్ని మార్చింది! స్టీవ్‌ స్మిత్‌ లైఫ్‌ స్టోరీ
Steve Smith
SN Pasha
|

Updated on: Mar 05, 2025 | 4:58 PM

Share

ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. గొప్ప బ్యాటర్‌గా.. విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌తో పాటు ఫ్యాబ్‌ ఫోర్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న గొప్ప బ్యాటర్‌. అలాంటి క్రికెటర్‌ తాజాగా అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం టీమిండియాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌ నుంచి మరో దిగ్గజ క్రికెటర్‌ దూరం అవుతుండటాన్ని క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి స్టీవ్‌ స్మిత్‌ కెరీర్‌ ఆరంభం నుంచి అతను సాధించిన ఘనతలు, వివాదాలు ఏంటో ఓసారి చూద్దాం..

స్టీవ్ స్మిత్ 1989 జూన్ 2న సిడ్నీలోని కోగరాలో ఆస్ట్రేలియన్ తండ్రి పీటర్, బ్రిటీష్‌ తల్లి గిలియన్‌కి జన్మించాడు. స్మిత్ మెనై హైస్కూల్‌లో చదువుకున్నాడు. 17 సంవత్సరాల వయస్సులో ఇంగ్లండ్‌ వెళ్లి క్రికెట్‌ కెరీర్‌ ఆరంభించాడు. అక్కడ కెంట్ క్రికెట్ లీగ్‌లో సెవెనోక్స్ వైన్ కోసం క్లబ్ క్రికెట్ ఆడాడు. సెవెనోక్స్ తరఫున బాగా ఆడుతుండటంతో సర్రే సెకండ్ ఎలెవన్‌ టీమ్‌కు ఎంపికయ్యాడు. అతని తల్లి లండన్‌లో జన్మించినందున, స్మిత్‌కు బ్రిటిష్, ఆస్ట్రేలియన్ పౌరసత్వాలు రెండూ ఉన్నాయి. డాని విల్లీస్‌ను ప్రేమించి న్యూ సౌత్ వేల్స్‌ లోని బెర్రిమాలో 2018 సెప్టెంబరు 15న పెళ్ళి చేసుకున్నాడు.

అంతర్జాతీయ కెరీర్‌ విషయానికి వస్తే..

స్టీవ్ స్మిత్ 2010 ఫిబ్రవరిలో మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో ఒక లెగ్ స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు స్మీత్‌. అదే నెలలో మెల్‌బోర్న్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌లో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2010లో స్మిత్ ఏడు మ్యాచ్‌ల్లో 14.81 సగటుతో 11 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అలాగే 2010 జులైలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌తో సాంప్రదాయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, అప్పుడు కూడా లెగ్‌ స్పిన్నర్‌ రోల్‌లోనే ఆడిన స్మిత్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ, 2012 ఐపీఎల్‌ సీజన్‌లో పుణే వారియర్స్‌ ఇండియా జట్టు స్మిత్‌ను తీసుకుంది. అదే స్మిత్‌ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

అద్భుతమైన ఫీల్డింగ్‌, బ్యాటర్‌గా స్మిత్‌ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఐపీఎల్‌లో అతని ప్రదర్శన చూసి.. ఆస్ట్రేలియా జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఇక అప్పటి నుంచి స్మిత్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2015లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌ కూడా అయ్యాడు. 2015లో సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ (ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్), 2015, 2017లో ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2011–2020కి ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్‌, 2015, 2018, 2021, 2023లో ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా అలన్ బోర్డర్ మెడల్, 2015, 2018లో ఆస్ట్రేలియన్ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2015, 2021లో ఆస్ట్రేలియన్ వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఇలా అతని కెరీర్‌గా అద్భుతంగా సాగిపోతున్న వేళ 2018 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడటంతో స్మిత్‌ జీవితం మలుపుతిరిగింది.

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. 2018 మార్చి 29 నుండి ఆస్ట్రేలియాలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుండి స్మిత్‌ను ఒక ఏడాది పాటు నిషేధించారు. అదనంగా మరొక సంవత్సరం పాటు అతనికి ఎలాంటి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొద్దని కూడా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆదేశాలు జారీ చేసింది. నిషేధం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన స్మిత్‌.. జట్టులో కీ ప్లేయర్‌గా రాణిస్తూ తనపై పడ్డ మచ్చని తుడిచేసుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన స్మిత్‌ టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నాడు. మొత్తం 170 వన్డేలు ఆడిన స్మిత్‌ 5800 పరుగులు చేశాడు. అలాగే 28 వికెట్లు కూడా పడగొట్టాడు. వన్డేల్లో 12 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 164.